ప్రతిష్టాత్మక సంస్థల్లో న్యాయ‌విద్యకు క్లాట్‌

దేశంలోని జాతీయస్థాయి న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష- క్లాట్‌ (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌). దీని ప్రకటన వెలువడింది. పట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ (సీఎన్ఎల్‌యూ) పరీక్షను ఈ ఏడాది నిర్వహిస్తోంది. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో సీటు లభిస్తుంది. క్లాట్‌ ద్వారా ప్రవేశం క‌ల్పించే సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో... అత్యాధునిక కరిక్యులమ్‌, మౌలిక వసతులూ, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఉండటం మూలంగా నాణ్యమైన బోధన లభిస్తుంది. ప్రాంగణ నియామకాలూ ఉంటాయి. అందుకే కోర్సు పూర్తిచేసినవారికి కెరియర్‌ పరంగా ఢోకా ఉండదు. క్లాట్‌- 2017 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో... తెలంగాణలో నల్సార్‌ (హైదరాబాద్‌), ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం (విశాఖపట్నం) లో ప్ర‌వేశాలు పొంద‌వ‌చ్చు.

పరీక్ష విధానం
ఇది ఆన్‌లైన్‌ పరీక్ష. దీనిని 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలుంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ఇంగ్లిష్‌: 40 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌: 50 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథ్స్‌: 20 ప్రశ్నలు, లీగల్‌ అవేర్‌నెస్‌/ లీగల్‌ ఆప్టిట్యూడ్‌: 50 ప్రశ్నలు, లీగల్‌ రీజనింగ్‌: 40 ప్రశ్నలు ఉంటాయి. రుణాత్మక మార్కులున్నాయి. త‌ప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు.

ఈ సంస్థల్లో ప్రవేశాలు
క్లాట్‌ ర్యాంకు ఆధారంగా... 17 న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలుంటాయి. అవి:
* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ)
* నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌ (నల్సార్‌)
* ద నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, భోపాల్‌ (ఎన్‌ఎల్‌ఐయూ)
* ద వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జుడీషియల్‌ సైన్సెస్‌, కోల్‌కతా (డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్‌ (ఎన్‌ఎల్‌యూజే)
* హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్‌ (హెచ్‌ఎన్‌ఎల్‌యూ)
* గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, గాంధీనగర్‌ (జీఎన్‌ఎల్‌యూ)
* డా.రామ్‌ మనోహర్‌ లోహియా నేషనల్‌ లా యూనివర్సిటీ, లఖ్‌నవూ (ఆర్‌ఎంఎల్‌ఎన్‌ఎల్‌యూ)
* రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, పంజాబ్‌ (ఆర్‌జీఎన్‌యూఎల్‌)
* చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీ, పట్నా (సీఎన్‌ఎల్‌యూ)
* ద నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్‌, కొచ్చి (ఎన్‌యూఏఎల్‌ఎస్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ ఒడిశా, కటక్‌ (ఎన్‌ఎల్‌యూఓ)
* నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా, రాంచీ (ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జుడిషియల్‌ అకాడమీ, అసోం (ఎన్‌ఎల్‌యూజేఏఏ)
* దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ, విశాఖపట్నం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ)
* తమిళనాడు నేషనల్‌ లా స్కూల్‌, తిరుచిరాపల్లి (టీఎన్‌ఎన్‌ఎల్‌ఎస్‌)
* మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, ముంబయి (ఎంఎన్‌ఎల్‌యూ)

(ఈ ప‌దిహేడే కాకుండా ప‌లు ప్రైవేటు సంస్థలు క్లాట్ స్కోర్‌తో న్యాయ‌విద్యలో ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్నాయి)

సిద్ధమ‌వ్వండిలా...
ఇది ప్రవేశపరీక్ష అయినప్పటికీ ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఆలోచనాత్మక, వివరణాత్మక ప్రతిభా పాటవాలను అంచనావేస్తూ వారి అనువర్తన తీరును పరిశీలిస్తారు. కాబట్టి అవసరమైతే నిపుణుల సహాయంతో గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
జనరల్‌ ఇంగ్లిష్‌ గురించి కేవలం వ్యాకరణమే కాకుండా వాడుక, సాధన మీద పట్టు ఉండాలి. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను వాక్యరూపంలో ప్రదర్శించే రీతిలో ఉండాలి.
జనరల్‌ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌ కోసం మనోరమ ఇయర్‌ బుక్‌/ సీఎస్‌ఆర్‌ ఇయర్‌ బుక్‌/ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను చదవాలి. వార్తాపత్రికలు/ పీరియాడికల్స్‌ చదువుతూ ఉండాలి.
లీగల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌కు యూనివర్సల్‌ లా బుక్స్‌ వారు ప్రచురించిన లెక్సిస్‌ నెక్సిస్‌/ ఈస్టర్న్‌ బుక్స్‌ వారు ప్రచురించిన పుస్తకాలు చదవాలి. ఇవి అన్ని ప్రముఖ లా పుస్తకాల దుకాణాల్లో లభిస్తాయి. వనరులు సహకరిస్తే న్యాయశాస్త్ర అధ్యాపకుల సలహా, సంప్రదింపులు తీసుకోవడం ఉత్తమం. 200 మార్కులకు కనీసం 150 మార్కులు సాధిస్తే ఏదో ఒక న్యాయ విద్యాసంస్థలో ప్రవేశం లభించే అవకాశముంది.
క్లాట్‌ ద్వారా ప్రవేశం లభించేది ప్రసిద్ధ విద్యాసంస్థల్లో కాబట్టి వీటిలో అత్యాధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే కరిక్యులమ్‌ ఉంటుంది. మౌలిక వసతులూ, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఉండటం మూలంగా నాణ్యమైన బోధన లభిస్తుంది. ప్రాంగణ నియామకాలూ ఉంటాయి. అందుకే కోర్సు పూర్తిచేసినవారికి కెరియర్‌ పరంగా ఢోకా ఉండదు. బహుళజాతి సంస్థలూ, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులూ, ప్రైవేటు ఈక్విటీ కంపెనీలూ, కన్సల్టింగ్‌ సంస్థలూ, అకౌంటింగ్‌ కంపెనీల్లో న్యాయశాస్త్ర పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, కార్పొరేట్‌ లా కోర్సులకున్న గిరాకీ, సైబర్‌ లా, లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌లకు పెరుగుతున్న ప్రాముఖ్యం... ఈ రంగంలో అవకాశాలు ఎంతగా పెరుగుతున్నాయో సూచిస్తున్నాయి.

గ‌డువు తేదీ, అర్హత వివ‌రాలు
* ఎల్‌ఎల్‌బీ 5 సంవత్సరాల కోర్సు (యూజీ), ఎల్‌ఎల్‌ఎం సంవత్సరం (పీజీ) కోర్సులకు ప్రవేశం.
* 5 సంవత్సరాల కోర్సులో చేరే విద్యార్థులు 10+2 లేదా సమాన పరీక్షను 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ విద్యార్థులు 40% మార్కులతో పాస్‌ అయి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా క్లాట్‌ రాయవచ్చు.
* ఎల్‌ఎల్‌ఎం కోర్సు చేయదల్చినవారు ఎల్‌ఎల్‌బీ పరీక్షను 55% మార్కులతో; ఎస్‌సీ, ఎస్‌టీ వారు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా క్లాట్‌ రాయవచ్చు.
* అభ్యర్థులకు వయసు పరిమితి నిబంధన ఏమీ లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 01.01.2017 నుంచి ప్రారంభమవుతాయి. 31.03.2017 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
రాతపరీక్ష తేది: 14.05.2017
క్లాట్‌- 2017 పూర్తి వివరాలకుwww.clat.ac.inచూడవచ్చు.

posted on 27.12.2016