సీమ్యాట్‌పై ఎంబీఏ
ప్రసిద్ధ విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివే అవకాశాన్ని కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీ-మ్యాట్‌) ఇస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్‌ 1 నుంచి మొద‌లైంది.

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, పుణెలోని జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలు, కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీ-మ్యాట్‌) పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేస్తాయి. ఏఐసీటీఈ అనుమతించిన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యాసంస్థలు, అనుబంధ కళాశాలలు ఈ స్కోరును ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటాయి. 10+2+3 విధానంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. జనవరి 28, 2019న పరీక్ష జరగనుంది. పరీక్షలో లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ సెక్షన్లలో 25 చొప్పున ప్రశ్నలుంటాయి.

సబ్జెక్టులవారీగా..
క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌: ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన అంశాలే ఉంటాయి. ప్రశ్నలను అనువర్తనం చేయాల్సి ఉంటుంది. ముందుగా కాన్సెప్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. షార్ట్‌కట్స్‌కూ ప్రాధాన్యమివ్వాలి. అయితే వాటిపైనే ఆధారపడకూడదు. ఒక ప్రశ్న చదివిన తర్వాత విభిన్న కోణాల్లో దానిని ఎలా అడుగుతారో కూడా తెలుసుకోవాలి. ప్రతి ప్రశ్నకూ భిన్న కోణాలను ఆలోచించాలి.
క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌లో అధ్యయనం చేసే అంశాలే డాటా ఇంటర్‌ప్రిటేషన్‌లోనూ ప్రాథమిక అంశాలుగా ఉపయోగపడతాయి. మొత్తం ఈ అంశంలో అధ్యాయాలను పరిశీలిస్తే.. అరిథ్‌మెటిక్‌, ఆల్జీబ్రా, జామెట్రీ విభాగాలుంటాయి. డాటా ఇంటర్‌ప్రిటేషన్‌లో పై చార్ట్‌లు, బార్‌ గ్రాఫ్‌లు, టేబుల్స్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. సన్నద్ధతలో ఈ అంశానికి ఎక్కువ సమయం కేటాయించాలి.
లాజికల్‌ రీజనింగ్‌: దీనికి ప్రాథమిక అంశాలు అంటూ ఏమీ ఉండవు. నేరుగా పాత ప్రశ్నపత్రాలు, జవాబు కనుక్కున్న తీరును పరిశీలించి, నిత్యం కొన్ని ప్రశ్నలను సాధన చేస్తూ వెళ్లాలి. అభ్యర్థుల కామన్‌సెన్స్‌ విజయానికి తోడ్పడుతుంది. ఇందులో ఆల్ఫబెట్‌ ఆధారిత ప్రశ్నలు, బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, సిలాజిజం, పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అకడమిక్‌ కెరియర్‌లో ఇవి భాగం కాదు. కానీ తార్కిక పరిజ్ఞానంతో వీటికి సమాధానం కనుక్కోవచ్చు.
లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌: ఇందులో వ్యాకరణ ఆధారిత ప్రశ్నలతోపాటు, కాంప్రహెన్షన్‌పైనా ప్రశ్నలు ఉంటాయి. ఆంగ్ల దినపత్రికల సంపాదకీయాలను చదివి, సంపాదకీయాల్లో వచ్చే కొత్త పదాలను సందర్భానుసారం అర్థం చేసుకొనే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సొసైటీ, ఆర్థిక రంగ అంశాలను ఎంచుకొని చదవాలి.
జనరల్‌ అవేర్‌నెస్‌: ఇందులో కరెంట్‌ అఫైర్స్‌తోపాటు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. హిస్టరీ, ఎకానమీలను కరెంట్‌ అఫైర్స్‌ కోణంలో చదవాలి. ఆయా ప్రాథమిక అంశాలను తాజా సంఘటనలతో ముడిపెట్టాలి. అలాగే ఇటీవలి కాలంలో పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లులు, అందులో ఉండే అంశాలపైనా ప్రశ్నలు వస్తున్నాయి. పరీక్షకు ముందు 8 నెలలపాటు జరిగిన అంశాలనూ అధ్యయనం చేయడం మంచిది. ప్రాథమిక అంశాలకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఉపయోగపడతాయి.

వేగంతో పాటు కచ్చితత్వం
సీ-మ్యాట్‌కు సిద్ధం కావటానికి నిర్దిష్ట సిలబస్‌ అంటూ ఉండదు. పరీక్షలోని ప్రశ్నల రకాలూ, స్థాయినీ గ్రహించటానికి సీ-మ్యాట్‌ వెబ్‌సైట్‌లో ఉంచే మాక్‌ టెస్టులు ఉపయోగపడతాయి.
ప్రతి సరైన సమాధానానికీ నాలుగు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు, అంటే 180 నిమిషాలు. మంచి స్కోరు సాధించాలంటే వేగం, కచ్చితత్వం తప్పనిసరి.
మొదటిసారి పరీక్ష రాసేవారు రెండు దశల్లో సన్నద్ధత కొనసాగించాల్సి ఉంటుంది. తొలి దశను ప్రాథమిక అంశాలపై పట్టుకూ, రెండో దశను మాక్‌ పరీక్షలు రాయడానికీ కేటాయించుకోవాలి. అభ్యర్థులు తమ శక్తిసామర్థ్యాల ఆధారంగా ప్రాథమిక అంశాలకు సమయం నిర్దేశించుకోవాలి. అయితే దీనికి 30- 40 రోజులకంటే ఎక్కువ సమయం ఇవ్వటం సరికాదు.

గమనించాల్సినవి
* అభ్యర్థులు తమకు అనుకూలమైన సెక్షన్‌ నుంచి పరీక్షను రాయడం ప్రారంభించవచ్చు.
* అభ్యర్థులు తమకు పట్టు ఉన్న అంశాలను ముందుగా పూర్తి చేసుకునే వీలు ఉంటుంది.
* ఇప్పటికే ప్రాథమిక అంశాలపై పట్టున్నవార్లు సాధ్యమైనన్ని మాక్‌పరీక్షలు రాయాలి.
* ఏదైనా ఒక అంశంలో తరచూ తప్పులు చేస్తుంటే, దానికి సంబంధించి ప్రాథమిక అంశాలను చదివి, అదే అధ్యాయంలో మాక్‌ పరీక్షలు రాస్తే ఎంతో ఉపయోగకరం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: జ‌న‌ర‌ల్ కేట‌గిరీ/ ఓబీసీ (నాన్‌క్రీమిలేయ‌ర్)- పురుషుల‌కు రూ.1,400, మ‌హిళ‌ల‌కు రూ.700; ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ- పురుషుల‌కు రూ.700, మ‌హిళ‌ల‌కు రూ.700; ట‌్రాన్స్‌జెండ‌ర్ అభ్య‌ర్థులకు రూ.700.

ముఖ్య‌మైన తేదీలు:
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: 30.11.2018.
వెబ్‌సైట్ నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల డౌన్‌లోడింగ్ తేది: 07.01.2019 నుంచి
ప‌రీక్ష తేది: జ‌న‌వ‌రి 28, 2019.
ఫ‌లితాల ప్ర‌క‌ట‌న తేది: ఫిబ్ర‌వ‌రి 8, 2019.

నోటిఫికేష‌న్‌
వెబ్‌సైట్‌

- పి. గోపాలకృష్ణ, కౌటిల్య కెరియర్స్‌

 

Posted on 22.10.2018