District Co-operative Central Bank Ltd.

DCCB - Preparation Plan

డీసీసీబీలో పాగా!

తెలంగాణ రాష్ట్రంలో వివిధ సహకార కేంద్ర బ్యాంకుల్లోని క్లర్క్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. జిల్లాలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులను మాత్రమే అర్హులుగా ప్రకటించారు. వీటికెలా సంసిద్ధం కావాలో తెలుసుకుందాం!
క్లర్క్‌ లేదా అసిస్టెంట్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు సాధించినవారు లేదా 55% మార్కులు సాధించిన కామర్స్‌ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేయవచ్చు.
అభ్యర్థులు 18-30 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలు, అంగవైకల్యం ఉంటే 10 సంవత్సరాలు, అంగవైకల్యం కలిగిన ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, అంగవైకల్యం కలిగిన బీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 19.10.2015
* ఫీజు (ఆన్‌లైన్‌ మాత్రమే): 9.10.2015 నుంచి 19.10.2015 వరకు
* పరీక్ష: నవంబర్‌ 2015లో.
విద్యార్హతలు
1.10.2015 నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.
* అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో 60% లేదా కామర్స్‌ గ్రాడ్యుయేట్లు అయితే 55% పొంది ఉండాలి.
దరఖాస్తు ఫీజు- ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీసీ/ ఎక్స్‌సర్వీస్‌ అభ్యర్థులకు రూ.250; జనరల్‌/ బీసీవారికి రూ.500.
పరీక్ష కేంద్రాలు: నరసంపేట, పెద్దపల్లి, దేశ్‌ముఖి, నర్సాపూర్‌, సిద్ధిపేట, కోదాడ, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, రంగారెడ్డి, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌
పరీక్ష విధానం
మొదట అభ్యర్థులకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 60 నిమిషాలపాటు జరిగే ఈ పరీక్షలో 100 ప్రశ్నలకుగానూ 100 మార్కులు కేటాయిస్తారు (రుణాత్మక మార్కులు- 0.25).
* ఇంగ్లిష్‌- 30 * రీజనింగ్‌- 35 * న్యూమరికల్‌ ఎబిలిటీ- 35
ఆన్‌లైన్‌ పరీక్షలో కనీస అర్హత మార్కు సాధించిన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
మౌఖిక పరీక్ష 12.5 మార్కులకు జరుగుతుంది. మొత్తంగా రాతపరీక్ష, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు పోస్టులు కేటాయిస్తారు. రాతపరీక్షలో ప్రశ్నలు ఆంగ్లమాధ్యమంలో మాత్రమే ఉంటాయి.
ఇలా సన్నద్ధం కండి
రీజనింగ్‌: 35 ప్రశ్నలకు 35 మార్కులు. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఈ విభాగంలో ఉంది. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ఆలోచించి సమాధానాలు గుర్తించాలి. ముఖ్యంగా కోడెడ్‌ ఇన్‌ ఈక్వాలిటీస్‌, సిలాసిజం, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, కోడింగ్‌- డీకోడింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, పజిల్స్‌, డైరెక్షన్స్‌ మొదలైనవి.
అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు స్టేట్‌మెంట్‌ అండ్‌ కన్‌క్లూజన్స్‌, ఆర్గ్యుమెంట్స్‌, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్స్‌ మొదలైనవి సాధన చేస్తే మేలు. వీటికి సమాధానాలు గుర్తించాలంటే సృజనాత్మకతతోపాటుగా ఇంగ్లిష్‌ భాషపై పట్టుండాలి. ప్రశ్నలో ఇచ్చిన సమాచారానికి తగ్గట్టుగా ఆలోచిస్తూ సరైన సమాధానం గుర్తించాలి.
ఇంగ్లిష్‌: పరీక్షలో అభ్యర్థుల మధ్య వ్యత్యాసం రావడానికి ఎక్కువ అవకాశమున్న విభాగమిది. ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. కేవలం ఇంగ్లిష్‌ గ్రామర్‌ చదవడమే కాకుండా రోజువారీ ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం లేదా జాతీయ మీడియా వార్తలు (ఇంగ్లిష్‌) వినడం/ చదవడం/, రోజువారీ దినచర్యలో ఇంగ్లిష్‌ మాట్లాడడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు.
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, సెంటెన్స్‌ కరెక్షన్స్‌, ఫిల్‌ ఇన్‌ద బ్లాంక్స్‌, ఒకాబులరీ, క్లోజ్‌ టెస్ట్‌ ప్రశ్నలు వీలైనన్ని సాధన చేయాలి. నిర్ణీత సమయాన్ని ముందుగానే నిర్ణయించుకుని తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేసేలా తయారవ్వాలి.
న్యూమరికల్‌ ఎబిలిటీ: దీనిలో ప్రశ్నలు మూడు విభాగాల నుంచి వస్తాయి.
1. న్యూమరికల్‌ ఎబిలిటీ
2. అరిథ్‌మెటిక్‌
3. డేటా అనాలిసిస్‌
న్యూమరికల్‌ ఎబిలిటీలోని ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకునేలా ఉంటాయి. సింప్లిఫికేషన్‌ తక్కువ సమయంలో చేసేవిధంగా షార్ట్‌కట్‌ మెథడ్‌, మైండ్‌ కాలిక్యులేషన్‌ అలవాటు చేసుకోవాలి. బాడ్‌మాస్‌ రూల్‌, ఘనాలు, ఘనమూలాలు, వర్గాలు, వర్గమూలాలు, గుణకారాలు, భాగహారాలపై దృష్టిపెట్టడం మంచిది. శాతాలు, నిష్పత్తి- అనుపాతం, లాభనష్టాలు, చక్రవడ్డీ- బారువడ్డీ, కాలం- పని, కాలం- దూరం, పడవలు- ప్రవాహాలు అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
డేటా ఎనాలిసిస్‌లో ఐదు విధానాలుంటాయి. పైచార్ట్‌, బార్‌చార్ట్‌, వెన్‌-డయాగ్రమ్‌, పట్టికలు, గ్రాఫ్స్‌. ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే శాతాలు- నిష్పత్తులు, సరాసరి- లాభనష్టాలు అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఈ ప్రశ్నలను గణిత ప్రశ్నలుగా పరిగణించకుండా తార్కికంగా ఆలోచిస్తే ఫలితాలుంటాయి.
జిల్లాలవారీగా భర్తీ చేసే క్లర్క్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల్లో మహిళలకు ప్రత్యేక కోటా ఉంది. కాబట్టి, స్థానిక మహిళలు (గ్రాడ్యుయేట్స్‌) దీనిని చక్కని అవకాశంగా భావించాలి.
రాతపరీక్షలో సెక్షన్‌ వారీగా కటాఫ్‌ మార్కు, ఓవరాల్‌ కటాఫ్‌ ఉంటాయి. మౌఖిక పరీక్షకు 1ః2 నిష్పత్తి ద్వారా అభ్యర్థులను ఖరారు చేస్తారు. కాబట్టి రాతపరీక్షలో వీలైనన్ని ఎక్కువ మార్కులు వచ్చేలా సన్నద్ధత సాగించాలి. దానికి అనుగుణంగా మెటీరియల్‌, మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేస్తే మంచిది.
ముఖ్యమైన వెబ్‌సైట్లు
* ఆదిలాబాద్‌ - www.adilabaddccb.org
* హైదరాబాద్‌ - www.hyderabaddccb.org
* కరీంనగర్‌ - www.karimnagardccb.com
* ఖమ్మం - www.khammamdccb.org
* మహబూబ్‌నగర్‌ - www.dccbmbnr.org
* మెదక్‌ - www.medakdccb.org
* నల్గొండ - www.nalgondadccb.org
* నిజామాబాద్‌ - www.nizamabaddccb.org
* వరంగల్‌ - www.warangaldccb.org