DENA BANK

దేనా బ్యాంకులో 300 పీవోలు

- ఎంపికైన‌వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఏడాది కోర్సు
- ఆన్‌లైన్ ప‌రీక్షలు, బృంద‌చ‌ర్చలు, ముఖాముఖి ద్వారా నియామ‌కాలు

ప్రభుత్వ ఎంట‌ర్‌ప్రైజ్ సంస్థ దేనా బ్యాంకు 300 పీవో పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఈ ఉద్యోగాల‌కు డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ముందుగా ఆన్‌లైన్ ప‌రీక్ష- ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. అనంత‌రం గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన‌వాళ్లు అమిటీ యూనివ‌ర్సిటీ నోయిడా క్యాంప‌స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా ఏడాది కోర్సును పూర్తిచేసుకున్నవాళ్లు దేనా బ్యాంకులో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌గా కెరీర్ ప్రారంభించ‌వ‌చ్చు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఖాళీలు, అర్హతలు...
విభాగాల‌వారీ ఖాళీలు: అన్ రిజ‌ర్వ్‌డ్‌-206, ఓబీసీ- 22, ఎస్సీ-62, ఎస్టీ-10.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు స‌రిపోతాయి.
వ‌యోప‌రిమితి: ఏప్రిల్ 1, 2017 నాటికి 20 నుంచి 29 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఎంపిక విధానం:
ఆన్‌లైన్ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌), గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా

ఆన్‌లైన్ ప‌రీక్ష ఇలా..
200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. ఇందులో రీజ‌నింగ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌(బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ఈ ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండు గంట‌లు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. అభ్యర్థి ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని తెలుసుకోవ‌డానికి డిస్క్రిప్టివ్ ప‌రీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం 2 ప్రశ్నల‌కు స‌మాధానం రాయాలి. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఈ ప‌రీక్షకు 50 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. గ్రూప్ డిస్కష‌న్‌కి 20, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూకు 80 మార్కులు కేటాయించారు. అంటే ప‌రీక్ష మొత్తం 350 మార్కులకు ఉంటుంది.

అర్హత సాధించాలంటే..
ఆబ్జెక్టివ్ ప‌రీక్షలో అర్హత సాధించ‌డానికి ప్రతి సెక్షన్‌లోనూ క‌నీస క‌టాఫ్ మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. ఈ మార్కుల‌ను బ్యాంకు నిర్ణయిస్తుంది. అన్ని విభాగాల్లోనూ క‌లుపుకుని నిర్దేశిత క‌టాఫ్ మార్కుల కంటే ఎక్కువ పొందిన‌వారి డిస్క్రిప్టివ్ ప్రశ్నప‌త్రాన్ని మూల్యాంక‌నం చేస్తారు. ఇందులోనూ అర్హత సాధించ‌డం త‌ప్పనిస‌రి. ఆన్‌లైన్ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్‌)లో చూపిన ప్రతిభ ద్వారా ఆయా విభాగాల వారీ ఖాళీల‌కు 4 రెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌ను గ్రూప్ డిస్కష‌న్, ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తారు. జీడీ, ఇంట‌ర్వ్యూల్లో విడిగా క‌నీసం 40 (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 35 ) శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి.

తుది నియామ‌కాలు
ఆన్‌లైన్ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌), గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూల్లో సాధించిన మార్కులన్నింటి ద్వారా తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

పీజీ డిప్లొమా కోర్సు...
కోర్సుకు ఎంపికైన‌వాళ్లు బోధ‌న‌, భోజ‌నం, వ‌స‌తి నిమిత్తం రూ.3 లక్షలు ఫీజుగా చెల్లించాలి. ఈ ఫీజును చాలా త‌క్కువ వ‌డ్డీకి దేనా బ్యాంకు రుణ‌స‌దుపాయం క‌ల్పిస్తుంది. పీవోగా విధుల్లో చేరిన త‌ర్వాత 84 నెలల్లో (ఈఎంఐ విధానం) రుణాన్ని చెల్లించుకోవ‌చ్చు. కోర్సు వ్యవ‌ధి ఏడాది. మొద‌టి 9 నెల‌లు అమిటీ యూనివ‌ర్సిటీ, నోయిడా క్యాంప‌స్‌లో త‌ర‌గ‌తులు నిర్వహిస్తారు. చివ‌రి 3 నెల‌లు ఇంట‌ర్న్‌షిప్‌కు కేటాయించారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న దేనా కార్యాల‌యాల్లో ఏదోఒక చోటకి ఇంట‌ర్న్‌షిప్ నిమిత్తం పంపుతారు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి అమిటీ యూనివ‌ర్సిటీ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కోర్సులో ఉన్నప్పుడు వ్యక్తిగ‌త ఖ‌ర్చుల నిమిత్తం నెల‌కు రూ.2500 చొప్పున మొద‌టి 9 నెలలు స్టైపెండ్‌ చెల్లిస్తారు. చివ‌రి 3 నెల‌లు రూ.7500 చొప్పున ఇస్తారు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసిన‌వాళ్లు పీవోగా విధుల్లో చేరుతారు.

విధుల్లో చేరిన త‌ర్వాత‌...
విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థుల‌కు జూనియ‌ర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ (స్కేల్ -1 ఆఫీస‌ర్‌) హోదా కేటాయిస్తారు. ఉద్యోగంలోకి చేరిన త‌ర్వాత క‌నీసం మూడేళ్లపాటు విధుల్లో కొన‌సాగ‌డం త‌ప్పనిస‌రి. ఇందుకోసం కోర్సులో చేరిన‌ప్పుడే రూ.2 లక్షల విలువైన ఒప్పంద ప‌త్రం స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. గ‌డువులోగా వైదొలిగిన‌వారి నుంచి ఈ మొత్తాన్ని వ‌సూలు చేస్తారు. పీవోగా అయిదేళ్లు దేనా బ్యాంక్ లో కొన‌సాగిన‌వారి ఫీజును తిరిగి ఇచ్చేస్తారు.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మే 9, 2017
రిజిస్ట్రేష‌న్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.50; మిగిలిన అంద‌రికీ రూ.400
కాల్ లెట‌ర్లు: మే 31 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ప‌రీక్ష తేదీ: జూన్ 11,2017
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.

Posted on 19-04-2017

Online Exams

  • Online Grand Test - 1
  • Model Papers

  • Model Paper - 1
  • DENA BANK Info.

  • Notification
  • Apply Online