సత్యసాయి విద్యాసంస్థ ప్రవేశ పరీక్షలు వాయిదా
పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలను కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేశారు. విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్‌ 17 నుంచి 30 వరకు జరగాల్సిన ప్రవేశపరీక్షలు, ముఖాముఖి కార్యక్రమాన్ని వాయిదా వేశామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రవేశ పరీక్షల తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర ప్రవేశ పరీక్షలు మేలో నిర్వహిస్తామన్నారు. సత్యసాయి ప్రైమరీ, ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గురువారం నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. జూన్‌ 1 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

14 కోర్సుల్లో ప్రవేశాలకు ఈసెట్‌
* దరఖాస్తుకు ఆన్‌లైన్‌లో అవకాశం
జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: అనంతపురం జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసెట్‌-2020 ద్వారా 14 కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించామని ఉపకులపతి శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. మార్చి 5న జేఎన్‌టీయూలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశానికి వరుసగా ఆరోసారి ఈసెట్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అగ్రి ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఈసెట్‌ ద్వారానే అవకాశం లభిస్తుంది. మార్చి 5 నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు. గత సంవత్సరం అన్ని కోర్సులకు 39,734 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈసెట్‌ వెబ్‌సైట్లో అన్ని అంశాలు పొందుపరిచామన్నారు. చాలా మంది విద్యార్థులు దరఖాస్తు ఫారాలు సొంతంగా భర్తీ చేయకపోవడంతో పలు తప్పిదాలు చేస్తున్నారు. సొంతంగా దరఖాస్తు ఫారాలు నింపాలన్నారు. దరఖాస్తు చేయగానే ప్రింట్‌ను కొడితే దరఖాస్తు తీసుకోవడానికి వీలుందనీ.. అందులో తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలన్నారు. కొన్ని వివరాలను ఏప్రిల్‌ 13, 14 తేదీల్లో ఆన్‌లైన్‌లోనే సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఏవిధమైన అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్‌ 30న ఈసెట్‌ పరీక్ష ఉంటుంది.

ఎస్వీయూ పీజీసెట్‌కు 6,500మంది దరఖాస్తు
* తేదీ పొడిగింపునకు నిర్ణయం
తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశం కోసం ప్రతిఏడాది ప్రతిష్ఠాత్మకంగా పీజీసెట్‌ నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇటీవల ఎస్వీయూ విడుదల చేసిన పీజీసెట్‌-2020కి ఇప్పటివరకు 6,500మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. జులై 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉంది. ప్రతి ఏడాది ఎస్వీయూ పీజీసెట్‌కు దాదాపు పదివేల పైచిలుకు దరఖాస్తులు అందేవి. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పరీక్షలు జరగకపోవడం, డిగ్రీ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు భవితవ్యంపై సందిగ్ధం వీడకపోవడం తదితర కారణాలతో పీజీసెట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య ఈ ఏడాది తగ్గిపోయిందని ఎస్వీయూ వర్గాలు చెబుతున్నాయి. డీఓఏ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం జులై తొలి వారానికి దరఖాస్తు గడువు ముగియనుంది. మరోవైపు దరఖాస్తులేమో తక్కువ సంఖ్యలో రావడంతో దరఖాస్తు గడువు పెంచాలన్న ఆలోచనలో ఎస్వీయూ ఉన్నతాధికారులు ఉన్నారు.
* పొడిగింపు తప్పదా..?
ఎస్వీయూ పీజీ సెట్‌-2020 దరఖాస్తు గడువు పొడిగించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి ఎస్వీయూ పరిధిలోనే అనుబంధ డిగ్రీ కళాశాలల్లో చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు జిల్లావ్యాప్తంగా దాదాపు ముప్పైవేలు ఉంటారు. వీరితో పాటు ఎస్వీయూలో పీజీ చేయడానికి రాయలసీమ వ్యాప్తంగా విద్యార్థులు మక్కువ చూపిస్తారు. అలా రాయలసీమ వ్యాప్తంగా డిగ్రీ చివరి సెమిస్టర్‌ చదివేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షలు జరగకపోవడం, చివరి సెమిస్టర్‌ పరీక్షలు రద్దు చేస్తారన్న విషయం అధికారికంగా ఇంకా వెల్లడికాకపోవడం.. ఇవన్నీ ఎస్వీయూ పీజీసెట్‌ దరఖాస్తులు పెరగకపోవడానికి కారణాలే. ఈ అంశంపై రిజిస్ట్రార్‌ ఆచార్య శ్రీధర్‌ రెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక నిర్ణయం వెల్లడికాలేదు కనుక పీజీ సెట్‌ దరఖాస్తుల గడువును పొడిగించాలన్న ప్రతిపాదన తమముందు ఉందని, ఎప్పటివరకు పొడిగిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెస్సీ ఫలితాలను వెల్లడించిన ఎస్వీయూ
తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఎమ్మెస్సీ ఫలితాలను వర్సిటీ పరీక్షల కార్యాలయం జులై 1న విడుదల చేసింది. ఎమ్మెస్సీ మూడవ సెమిస్టర్‌కు సంబంధించిన ఫిజిక్స్, అప్లైడ్‌ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్, బాటనీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, జువాలజీ, అదేవిధంగా ఎమ్మెస్సీ మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన అప్లైడ్‌ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ ఫలితాలను విడుదల చేసినట్లు ఎస్వీయూ పరీక్షల నియంత్రణాధికారి దామ్లా నాయక్‌ పేర్కొన్నారు. ఫలితాలను మనబడి.కామ్, స్కూల్స్‌9.కామ్, ఇండియారిజల్ట్స్‌.కామ్‌ వెబ్‌సైట్లలో పొందుపర్చినట్లు చెప్పారు.

నన్నయ సెట్‌-2020 విడుదల
నన్నయ విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2020 ప్రకటనను ఉప కులపతి మొక్కా జగన్నాథరావు మార్చి 11న‌ విడుదల చేశారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నన్నయ సెట్‌-2020 వివరాలను ఆయన వెల్లడించారు. నాలుగు జిల్లాల్లోని పది కేంద్రాల్లో మే 12 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులు www.aknu.edu.in లేదా www.aknudoa.in లేదా www.nannayacet.in వెబ్‌సైట్లను సందర్శించి ఏప్రిల్‌ 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 8వ తేదీ నుంచి వర్సిటీ వెబ్‌సైట్లలో విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుకు ఏమైనా ఇబ్బందులుంటే మార్చి 16వ తేదీ నుంచి మే నాలుగో తేదీ మధ్య పరిష్కరిస్తామన్నారు.
* జిల్లాకు సంబంధించి అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ డిగ్రీ కళాశాల, కాకినాడలోని నన్నయ ఎంఎస్‌ఎన్‌ పీజీ క్యాంపస్‌, రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల, రంపచోడవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.

మే 31న సీపెట్‌ ప్రవేశ పరీక్ష
గన్నవరం టౌన్‌, న్యూస్‌టుడే: విజయవాడ సమీపంలోని సూరంపల్లిలో ఉన్న సీపెట్‌(సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశానికి సీపెట్‌ జేఈఈ-2020 పరీక్ష మే 31న జరుగుతుందని సంస్థ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ వి.కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈమేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఫిబ్ర‌వ‌రి 6న‌ ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌ ఇంజినీరంగ్‌కు భారతదేశంతో పాటు విదేశాలలో మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. ఇక్కడ 10వ తరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి డిప్లొమా, బీఎస్సీ పాసైన వారి వరకు డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అనుభవం ఉన్న వారికి విదేశాలలో సైతం ఉద్యోగాలు మెండుగా లభిస్తాయని వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య వివరాలు...:
* ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: మే 22,
* ఆల్‌ ఇండియా సిపెట్‌ - జేఈఈ పరీక్ష తేదీ: మే 31
* తరగతులు ప్రారంభించే తేదీ: జులై 01, దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.300, మిగిలిన అందరికీ రూ.750
* పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం
* దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్‌సైట్‌ https://eadmission.cipet.gov.in/

కృష్ణా డిగ్రీ పరీక్షల తేదీల్లో మార్పు
పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ పరీక్షల తేదీలను మార్పు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి కేబీ చంద్రశేఖర్‌ ఆదేశాల మేరకు వర్సిటీ పరీక్షల కంట్రోలర్‌ డి.రామశేఖరరెడ్డి ఈ మార్పుల్ని చేశారు. మారిన షెడ్యూల్‌ వివరాలను మార్చి 13న‌ సాయంత్రం కళాశాలలకు మెయిల్‌ ద్వారా పంపారు. వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికలకన్నా ముందే డిగ్రీ రెండు, మూడో ఏడాది పరీక్షల సమయసారణిని రూపొందించారు. ఆ మేరకు మార్చి 19 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఎన్నికల కారణంగా మారిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. డిగ్రీ మొదటి ఏడాది పరీక్షలను మొదట ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పరీక్షల తేదీల్లో మార్పు చేశారు. డిగ్రీ మొదటి ఏడాది రెండో సెమ్‌ థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మూడు సెమిస్టర్ల ప్రయోగ పరీక్షలు మార్చి 19 నుంచి నిర్వహిస్తారు. థియరీ పరీక్షల తరువాత ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తే జాప్యం జరుగుతుందని భావించి ముందుస్తుగా నిర్వహించనున్నారు. ఎన్నికల తేదీలను మినహాయించి ఈ పరీక్షలు జరుగుతాయి. డిగ్రీ మూడో ఏడాది విద్యార్థులు వేర్వేరు విశ్వవిద్యాలయాల సెట్‌లు రాస్తారు. అందువల్ల ముందుగా పరీక్షలు నిర్వహించి, సకాలంలో ఫలితాల్ని వెలువరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రామశేఖరరెడ్డి తెలిపారు.

గీతం అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం
సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ వర్సిటీ (విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు) ప్రాంగణాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ, బీకాం, బీఏ, ఎంబీఏ, నర్సింగ్‌ తదితర కోర్సుల్లో (2020-21) విద్యా సంవత్సరానికి సంబంధించి చేరడానికి అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ జూన్‌ 1న ప్రారంభమయిందని వీసీ ఆచార్య కె.శివరామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రవేశపరీక్ష (గాట్‌-2020)లో టాప్‌ ర్యాంక్‌లు సాధించిన వివిధ రాష్ట్రాల విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ కౌన్సెలింగ్‌ జూన్‌ అయిదో తేదీ వరకు జరగనుందన్నారు. ఈ సందర్భంగా జరిగిన అడ్మిషన్‌ ’కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌లో సీట్ల కేటాయింపు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య కె.వి.జి.డి.బాలాజీ, వివిధ విభాగాల ప్రధానాచార్యులు ఎస్‌.గణపతి, సి.ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో గీతం ఇంజినీరింగ్‌దరఖాస్తులు
సాగర్‌నగర్, న్యూస్‌టుడే: అఖిలభారత స్థాయి గీతం అడ్మిషన్‌టెస్ట్‌(గ్యాట్‌ -2020)కు సంబంధించి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జీఐటీఏఎమ్‌.ఈడీయూద్వారా స్వీకరిస్తున్నట్లు సంబంధిత విభాగం డైరెక్టర్‌ఆచార్య కె.నరేంద్ర నవంబరు తెలిపారు. గీతం డీమ్‌్్డ వర్సిటీ ఇంజినీరింగ్‌(బీటెక్, ఎంటెక్‌), ఫార్మసీ (బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ), ఎంఆర్క్‌కోర్సుల్లో ప్రవేశాలకై ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ఈ ఆన్‌లైన్‌దరఖాస్తులను 2020 మార్చి 30వతేదీ వరకు స్వీకరిస్తామన్నారు. గీతం వెబ్‌సైట్‌లో ఏప్రిల్‌5వ తేదీ నుంచి హాల్‌టికెట్‌లను డౌన్‌లోడు చేసుకోవచ్చన్నారు. ఇంజినీరింగ్‌లో 21 బీటెక్‌కోర్సులకు, 13 ఎంటెక్‌కోర్సులకు, ఫార్మసీ, రెండేళ్ల ఎంఆర్క్‌కోర్సుల్లో ప్రవేశించడానికి దేశంలోని 50 పట్టణాల్లో ఆన్‌లైన్‌విధానంలో ఏప్రిల్‌11వతేదీ నుంచి 21 తేదీ వరకు ఈ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష పూర్తయిన నాలుగు రోజుల్లో ఏపిల్ర్‌25వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

‘నన్నయ’ పరీక్షల తేదీల్లో మార్పుల్లేవు: వీసీ
నన్నయ విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో పరీక్షల తేదీలు ముందుకు వచ్చాయని జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు మార్చి 15న‌ ఓ ప్రకటనలో సూచించారు. యూజీ పరీక్షలు మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 29 వరకు జరుగుతాయన్నారు. ఏప్రిల్‌ నాలుగో తేదీ నుంచి పీజీ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. తేదీల్లో ఎలాంటి మార్పులు రాలేదని, వర్సిటీ ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
http://aknu.edu.in/

పరీక్ష రుసుం చెల్లింపునకు గడువు 29
ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ వార్షిక పరీక్షలకు హాజరయే విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించేందుకు మార్చి 29 వరకు గడువు విధించారని స్థానిక సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు డాక్టర్‌ రామరాజు, సమన్వయాధికారి డాక్టర్‌ బి.జగన్మోహనరావు తెలిపారు. నిర్ణీత గడువు అనంతరం పరీక్షల రుసుమును రూ.200 అపరాధ రుసుముతో చెల్లించేందుకు ఏప్రిల్‌ 6 వరకు గడువు విధించారని వెల్లడించారు. పరీక్షల దరఖాస్తును, రుసుమును సమీపంలోని ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలో ్ర్ర్ర.్జ౯్చ్న్య్న-ఃi-’.i- వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. దూరవిద్య డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలను ఏప్రిల్‌ 29 నుంచి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 6 నుంచి, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మే 13 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

దూరవిద్య కోర్సుల్లో ప్రవేశ గడువు ఏప్రిల్‌ 4
ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 4 వరకు గడువు విధించారని స్థానిక సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఇన్‌ఛార్జి ప్రధానాచార్యుడు డాక్టర్‌ కేఏ రామరాజు తెలిపారు. ఏవిధమైన విద్యార్హత లేనివారు, ఇంటర్మీడియట్‌ అనుత్తీర్ణులైనవారు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చన్నారు. అభ్యర్థులు ఏపీ ఆన్‌లైన్‌ మీసేవ కేంద్రంలోకానీ, స్వయంగా కానీ http://www.braouonline.in/ వెబ్‌సైట్‌ ద్వారా నిర్ణీత గడువులోగా రూ.300 రుసుము చెల్లించి రశీదు పొందాలన్నారు. అర్హత పరీక్షను ఏప్రిల్‌ 19న నిర్వహిస్తారని పేర్కొన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మూడో సెమిస్టర్‌ పరీక్షల రుసుము చెల్లించేందుకు ఫిబ్ర‌వ‌రి 15 వరకు గడువును పెంచారని తెలిపారు.