Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఉపాధ్యాయ కొలువుల పండుగ..!
* 8,792 పోస్టులకు టీఆర్‌టీ ప్రకటన జారీ
* ఫిబ్రవరి రెండోవారంలో పరీక్షలు
* ఒకే రాతపరీక్ష, టెట్‌కు 20 శాతం వెయిటేజీ
* అభ్యర్థులు చదువుకున్న జిల్లాలోనే స్థానికులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) ప్రకటన జారీ చేసింది. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా కాకుండా, తొలిసారిగా టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ప్రకటన జారీ చేసింది. అక్టోబరు 30 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. దరఖాస్తు గడువు తేదీని నవంబరు 30గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. టీఆర్‌టీ రాతపరీక్షను 2018 ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహిస్తామని వివరించారు. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులకు రాతపరీక్షలో 80 శాతం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో 20 శాతం వెయిటేజీని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు రాతపరీక్షలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక ఉంటుందని ప్రకటించారు. టీఆర్‌టీ ప్రకటన టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. పాత డీఎస్సీ తరహాలో రాతపరీక్ష ఉంటుందని వివరించారు. విద్యార్థి నాలుగు నుంచి పదోతరగతి వరకూ వరుసగా నాలుగేళ్లు చదివిన జిల్లాలోనే అతడిని స్థానికుడిగా గుర్తిస్తారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ అతడు స్థానికేతరుడే. స్థానిక జిల్లాలో పోస్టులు లేకుంటే ఇతర జిల్లాల్లో స్థానికేతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ కింద స్థానికులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం పోస్టులను కేటాయించారు. గతంలో నిర్వహించిన డీఎస్సీలో స్థానిక లేదా స్థానికేతర జిల్లాలో ఏదో ఒక జిల్లాను ఎంపిక చేసుకుని అక్కడే పరీక్ష రాయాల్సి వచ్చేది. కానీ టీఆర్‌టీలో ఈ పద్ధతికి స్వస్తి పలికారు. దరఖాస్తు సమయంలో స్థానిక జిల్లా కాకుండా స్థానికేతర జిల్లాలను ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులు ఎంచుకోవాలి. పరీక్షలో ప్రతిభ చూపినా పోస్టులు తక్కువగా ఉంటే స్థానిక జిల్లాలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. అయితే నాన్ లోకల్ కింద అన్ని జిల్లాల్లో పోటీకి అర్హత లభిస్తుంది. ప్రతిభ ప్రకారం మిగతా 30 జిల్లాల్లో ఓపెన్ కేటగిరీ కింద పోస్టులను సాధించేందుకు టీఎస్‌పీఎస్సీ ఈ వెసులుబాటు కల్పించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంచుకున్న భాషలోనే పరీక్షలు..
టీఆర్‌టీలో వేర్వేరు భాషా మాధ్యమాలకు సంబంధించి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆయా భాషల్లోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉర్దూ మాధ్యమానికి ఉర్దూలో, ఆంగ్ల మాధ్యమానికి ఆంగ్లంలో ప్రశ్నపత్రాలు ఉంటాయి. టీఆర్‌టీలో తమిళ మాధ్యమ పోస్టులు తగ్గిపోగా... బెంగాలీ మాధ్యమ పోస్టులు 11 వచ్చాయి. టీఆర్‌టీలో టెట్ వెయిటేజీ ఉన్న పోస్టులకు మొత్తం 160 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. పార్ట్-1లో జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్‌కు సంబంధించి 20 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-2లో పెడగాజీలో 20 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-3లో సబ్జెక్టుకు సంబంధించి 120 ప్రశ్నలు ఉంటాయి. టీఆర్‌టీలో అభ్యర్థి అర్హులైన అన్ని కేటగిరీల పోస్టులకు (ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషలు, పీఈటీ, భాషాపండితులు) పరీక్షలు రాసేలా.. వేర్వేరు పరీక్షలకు వేర్వేరు తేదీలు, సమయాలు నిర్ణయిస్తూ షెడ్యూలు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. తెలంగాణ రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో పెట్టింది.
సైన్స్ అభ్యర్థులకు మొండిచేయి?
టీఆర్‌టీలో సైన్స్ అభ్యర్థులకు నిరాశ కలిగించే అంశాలున్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. బీఈడీలో మేథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులను ఎంచుకుని కోర్సులు పూర్తిచేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రెండు సబ్జెక్టుల్లోనూ రాసేందుకు అర్హత ఉంటుంది. కానీ, ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే ఎంచుకుని, మిగతా సబ్జెక్టును వదిలేసుకోవాలని నిర్ణయించారు. గతంలో డీఎస్సీలోనూ ఇదే పద్ధతి అమల్లో ఉండేది. దీనివల్ల అభ్యర్థి నష్టపోతాడని అంటున్నారు. ఇవీ పోస్టులు
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) - 5,415
స్కూల్ అసిస్టెంట్ - 1,941
భాషా పండితులు - 1,011
పీఈటీ - 416
స్కూల్ అసిస్టెంట్ (పీఈ) - 9
మొత్తం పోస్టులు - 8,792
దరఖాస్తుల స్వీకరణ - అక్టోబరు 30 నుంచి
దరఖాస్తు గడువు తేదీ - నవంబరు 30
రాతపరీక్ష - 2018 ఫిబ్రవరి రెండోవారం

Published on 21-10-2017