Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టీఆర్‌టీ దరఖాస్తును సరిచేయని అభ్యర్థులు 30,849 మంది
* వారంతా జిల్లా వివరాలు అప్‌లోడ్‌ చేయాలి
* ఎస్‌ఏ బయాలజీ, హిందీ, ఆంగ్ల మీడియంలో పోస్టుల్లేవు
* టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)కి దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో 30,849 మంది తమ ఆప్షన్లను పూర్వజిల్లాల ప్రాధాన్యక్రమంలోకి మార్చుకోలేదని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 31 జిల్లాల నుంచి పూర్వ పది జిల్లాలకు ప్రాధాన్యత క్రమాన్ని మార్చుకోవాలని అభ్యర్థులకు పలుమార్లు సూచించినా ‘ఎడిట్‌’ అవకాశాన్ని వినియోగించుకోలేదని పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులు టీఆర్‌టీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు స్థానిక జిల్లా వివరాలను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.
ఆ విభాగంలో పోస్టుల్లేవు...
స్కూల్‌ అసిస్టెంట్‌ బయాలజికల్‌ సైన్స్‌ కేటగిరీ ఆంగ్లం, హిందీ మీడియంలో పోస్టులు లేనప్పటికీ 1868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వివరించారు. దరఖాస్తు సమయంలో దొర్లిన తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశమిచ్చినా వినియోగించుకోలేదన్నారు. ఆయా అభ్యర్థులు తమ దరఖాస్తును సవరించుకునేందుకు ఫిబ్రవ‌రి 10 నుంచి 12 వరకు మరోసారి చివరి అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ అర్హతల ప్రకారం తెలుగు, ఉర్దూ, మరాఠా, కన్నడ మీడియానికి మార్చుకోవాలని సూచించారు. మీడియాన్ని మార్చుకోని అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయబోమని స్పష్టం చేశారు.


Published on 09-02-2018