Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టీఆర్‌టీ హాల్‌టికెట్లలో గందరగోళం
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికతో పాటు చివరకు పరీక్ష ప్రవేశపత్రాల (హాల్‌టికెట్లు) జారీలోనూ సాంకేతిక తప్పిదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే.. గ్రూప్‌-1 ఫలితాల్ని సవరించి ఇవ్వగా, గురుకులాల్లో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్ల ప్రధాన పరీక్షల అభ్యర్థుల జాబితాలను వెనక్కి తీసుకుంది. తాజాగా అత్యంత కీలకమైన ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహణకు ముందుగానే సాంకేతిక తప్పిదం జరిగింది. టీఎస్‌పీఎస్సీ పరీక్షల సమాచారాన్ని నిర్వహిస్తున్న సీజీజీలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పొరపాట్లు అభ్యర్థులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ పోస్టులకు దాదాపు 2.77 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఫిబ్రవ‌రి 24 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ప్రవేశపత్రాల్లో అభ్యర్థులు దరఖాస్తులో ఇచ్చిన ఆప్షన్‌ మేరకు కాకుండా దూరంగా ఉన్న జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో గందరగోళం నెలకొంది. అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో హాల్‌టికెట్‌ లింకును టీఎస్‌పీఎస్సీ వెంటనే తొలగించింది.
టీఆర్‌టీ రాతపరీక్షలకు సంబంధించి ఫిబ్రవ‌రి 19 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఫిబ్రవ‌రి 19 అర్ధరాత్రి నుంచి లింకు అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవ‌రి 20 ఉదయం వెబ్‌సైట్‌ నుంచి ధ్రువీకరణ పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకున్న అభ్యర్థులకు.. పరీక్ష కేంద్రాలు వేరే జిల్లాలో కేటాయించారు. సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు రావడంపై భారీ సంఖ్యలో అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. పరిస్థితిని సమీక్షించిన టీఎస్‌పీఎస్సీ.. సాంకేతిక తప్పిదం కారణంగానే ఈ పరిస్థితి చోటుచేసుకున్నట్లు గుర్తించింది. టీఆర్‌టీ అభ్యర్థుల డేటాను మరోసారి సరిచేసి, హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. భాషాపండితులు (తెలుగు), స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు), పీఈటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ (సబ్జెక్టులు) పోస్టులకు పూర్వజిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించినందున వారికే ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయని తెలిసింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థికి ఖమ్మం, హైదరాబాద్‌ కోరుకుంటే ఆదిలాబాద్‌, కరీంనగర్‌ కేటాయించినట్లు ఫిర్యాదులు అందాయి. అభ్యర్థులకు వీలైనంత వరకు సమీప జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. సవరించిన హాల్‌టికెట్లను త్వరలోనే వెబ్‌సైట్లో పొందుపరుస్తామని వెల్లడించింది. ఫిబ్రవ‌రి 21 ఈ లింకు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.


Published on 21-02-2018