Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టీఆర్‌టీ న్యాయవివాదాల పరిష్కారానికి కృషి
* న్యాయస్థానంలో ప్రత్యేక పిటిషన్‌ వేయాలని నిర్ణయం
* జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన
* వారం రోజుల్లో తుది‘కీ’లు వెల్లడించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) ఫలితాల వెల్లడికి పరిపాలన, న్యాయ వివాదాలు అడ్డుగా మారాయి. పరీక్షలు నిర్వహించి, తుది ‘కీ’లు సిద్ధం చేసిన టీఎస్‌పీఎస్సీకి కొన్ని న్యాయ వివాదాలపై స్పష్టత రాకపోవడంతో సందిగ్ధంలో పడింది. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ టీఎస్‌పీఎస్సీకి తెలిపింది. ఈ నేపథ్యంలో న్యాయవివాదాలు దూరం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కమిషన్‌.. ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఏప్రిల్ 12న‌ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, పాఠశాల విద్య కమిషనర్‌ కిషన్‌, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తదితర అధికారులు సమావేశమయ్యారు. టీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు డిగ్రీలో కనీస అర్హత మార్కులుగా 50 శాతం ఉండాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు 45 శాతం మార్కులు పొందిన వారిని అర్హులుగా గుర్తించాలంటూ కోరారు. తుది ఆదేశాలకు లోబడి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించాలని కమిషన్‌కు సూచించింది. ఈ మేరకు కమిషన్‌ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఇదే సమయంలో 50 శాతం మార్కుల కన్నా తక్కువ ఉంటే పరిగణనలోకి తీసుకోవద్దని... హైకోర్టులో పిటిషన్‌ వేసి కేసులు పరిష్కరించేందుకు కృషిచేస్తామంటూ పాఠశాల విద్యాశాఖ నుంచి టీఎస్‌పీఎస్సీకి లేఖ అందింది. మరోవైపు ‘పీఈటీ’పై కొన్ని వివాదాలున్నాయి. భాషా పండితుల పోస్టులకు యూజీసీ గుర్తింపులేని విద్యాలయాల నుంచి పట్టాలు పొందిన అభ్యర్థులపై స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని కేసుల్లో ఫలితాలు వెల్లడించకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న‌ సమావేశమైన పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయనిపుణులను సంప్రదించారు. హైకోర్టు వేసవి సెలవుల నేపథ్యంలో కేసులు త్వరగా పరిష్కరించేందుకు కృషిచేయాలని, న్యాయస్థానంలో ప్రత్యేక పిటిషన్‌ వేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. టీఆర్‌టీ రాతపరీక్షలో ప్రతిభచూపిన అభ్యర్థుల వివరాలు వెల్లడించిన తర్వాత వారి ధ్రువీకరణ పత్రాల పరిశీలన బాధ్యతను పాఠశాల విద్యాశాఖ తీసుకోవాలని కమిషన్‌ కోరింది. ఈ మేరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో ధ్రువీకరణపత్రాల పరిశీలన పూర్తికి అధికారులు అంగీకరించారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్‌ అధికారి, ఒక సాంకేతిక అధికారిని గుర్తించి పేర్లు ఇవ్వాలని, త్వరలోనే వారికి సీజీజీ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
త్వరలో తుది‘కీ’లు!
టీఆర్‌టీకి సంబంధించి వారం రోజుల్లో తుది‘కీ’లు వెల్లడించాలని కమిషన్‌ భావిస్తోంది. న్యాయవివాదాల్లో స్పష్టత వస్తే ఏప్రిల్ చివ‌రిలోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ముందుగానే న్యాయవివాదాలు దూరమైతే మే నెలాఖరులోగా నూతన ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా.


Published on 13-04-2018