Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఆగస్టు 24 నుంచి డీఎస్సీ పరీక్షలు
* 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
* జులై 6న నోటిఫికేషన్
* మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆగస్టు 24 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ-2018 పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు ఆ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం (జూన్ 9) విశాఖలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి పరీక్షల నిర్వహణను ఏపీపీఎస్సీకి అప్పగించినట్లు చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం రాగానే ఏపీపీఎస్సీ అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తుందన్నారు. పరీక్షలు ఆన్‌లైన్‌లోనే ఉంటాయన్నారు. పిల్లలకు సంగీతం, నృత్యం నేర్పించడానికి వీలుగా ఆయా పోస్టులను తొలిసారిగా భర్తీచేస్తున్నట్లు గుర్తుచేశారు. ఈసారి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ముఖ్యమంత్రి నేరుగా సమీక్షించి ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావాన్ని తెలియజేసేలా ప్రతిజ్ఞ చేయిస్తారని చెప్పారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సర్కారు ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది. 2014 జూన్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు ఉన్న ఖాళీలను ఆగస్టులో నిర్వహించబోయే డీఎస్సీ-2018 ద్వారా భర్తీ చేయనున్నారు. పురపాలిక, మోడల్ పాఠశాలల్లో ఖాళీలతో పాటు గతంలో కొన్ని పోస్టులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఏర్పడిన కొత్త ఖాళీలను వేరుగా చూపించారు. వీటినీ జిల్లాల వారీగా విభజించి త్వరలోనే అధికారిక డీఎస్సీ ప్రకటనలో పూర్తిస్థాయిలో ప్రకటిస్తారు.
మొత్తం ఖాళీలు ఇలా..
జడ్పీ/ప్రభుత్వ : 4,626
పురపాలికల్లో : 1,448
మోడల్ పాఠశాలలు : 929
కొత్తగా సృష్టించిన ఖాళీలు : 3,290
సంగీతం : 58
మొత్తం : 10,351
షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల: 6.7.18
భర్తీ చేసే పోస్టులు: స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, లాంగ్వేజి పండిట్లు, సంగీత, నృత్య టీచర్లు, పీఈటీలు, మోడల్ స్కూల్ టీచర్లు.ఫీజుల చెల్లింపు: 6.7.18 నుంచి 8.7.18 వరకు.
దరఖాస్తు సమర్పణ ఆన్‌లైన్‌లో: 7.7.18 నుంచి 9.8.18 వరకు
నమూనా పరీక్షలు: 1.8.18 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 15.8.18 నుంచి
పరీక్ష: 24.8.18 నుంచి 26.8.18
ప్రాథమిక కీ విడుదల: 27.8.18
అభ్యంతరాలుంటే: 27.8.18 నుంచి 7.9.18 వరకు
తుది కీ విడుదల: 10.9.18
ఫలితాల ప్రకటన: 15.9.18
రెండో టెట్‌కు 3,97,957 మంది..
ఆదివారం (జూన్ 10) నుంచి 19 వరకు జరగనున్న రెండో టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. ఏపీలోనే కాకుండా తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో మొత్తం 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14,891 మంది కేంద్రాలు ఎక్కడ కావాలో ఆప్షన్ పెట్టుకోలేదు. వీరికి సమీప కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని మంత్రి పేర్కొన్నారు. టెట్ పరీక్షను రెండు విడతలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో విడతలో 27,495 మందికి అవకాశం ఉందని, ఇలా రోజుకు 54,990 మంది పరీక్షలు రాస్తారని గంటా వివరించారు. సందేహాల నివృత్తి కోసం 95056 19127, 95057 80616, 95058 53627 నంబర్లు హెల్ప్‌లైన్ కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సారి టెట్ ఫలితాలను ఆన్‌లైన్‌లో వెంటనే తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పరీక్ష పూర్తయ్యాక సబ్‌మిట్ బటన్ నొక్కగానే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఫివ్రరి 21 నుంచి మార్చి మూడో తేదీ వరకు మొదటిసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి 4.46 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 4.10 లక్షల మంది పరీక్షలు రాశారు. డీఎస్సీ 2018లో ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం మరోసారి టెట్ నిర్వహించడానికి ముందుకొచ్చింది.
జిల్లాకు ఇద్దరు డీఈవోలు
విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా జిల్లాకు ఇద్దరు డీఈవోలను నియమించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. డీఎస్సీ- 2014 ద్వారా పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో పది వేలు భర్తీ చేసి రాష్ట్రాన్ని విద్యా కూడలిగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో మౌలిక వసతుల కోసం ఈ ఏడాది రూ.4,850 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. ఇకపై ఏ పాఠశాలలోను చెట్ల కింద తరగతలు నిర్వహించే పరిస్థితి, నేలపై విద్యార్థులు కూర్చొనే దుస్థితి ఉండదని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

Published on 10-06-2018