Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఐదేళ్ల తర్వాత ఉపాధ్యాయ నియామకాలు
* మూడేళ్లుగా అదిగో... ఇదిగో అంటూ వూరింపు
* సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు టీఆర్‌టీ ప్రకటన జారీ
ఈనాడు - హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం డీఎస్సీ నిర్వహించారు. తర్వాత మళ్లీ ఐదేళ్లకు తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు - టీఆర్‌టీ)ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012 ఆగస్టు 27, 28, 29 తేదీల్లో మొత్తం దాదాపు 18 వేల ఖాళీల భర్తీకి డీఎస్సీ జరిగింది. వాటిలో సుమారు 10 వేల స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలున్నాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో డీఎస్సీ నిర్వహణ వీలుపడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రకటన ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూశారు. తెలంగాణ మొదటి విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి నుంచి ఇప్పటి మంత్రి కడియం శ్రీహరి వరకు పలుమార్లు త్వరలోనే డీఎస్సీ అని ప్రకటనలిచ్చినా కార్యారూపం దాల్చలేదు. అసలు భర్తీ ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. మొత్తానికి 2016 జనవరిలో సుమారు 15,600 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయినా ముందడుగు పడలేదు.
సుప్రీం కోర్టులో కేసుతోనే కదలిక
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై రెండేళ్లుగా న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో ఉపాధ్యాయుల ఖాళీలపైకి కేసు మళ్లింది. దానికితోడు రాష్ట్ర బీఎడ్‌, డీఎడ్‌ నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. ఏడాదికాలంగా సుప్రీంకోర్టులో కేసు పలుమార్లు విచారణకు వచ్చింది. విద్యాశాఖ మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, న్యాయశాఖ అభిప్రాయాలు తీసుకోవాలని, 371డీపై అధ్యయనం చేయాలని చెబుతూ వస్తోంది. టెట్‌ నిర్వహించామని ఒకసారి, టీఆర్‌టీ ప్రకటన జారీ చేయాలంటే బీఈడీ రెండో సంవత్సరం పూర్తయిన వారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి వారి ఫలితాలు రావాలని మరోమారు చెప్పింది. ఈ జాప్యంపై రెండు నెలల క్రితమే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 23న జరగబోయే విచారణకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య హాజరు కావాలని ఆదేశించింది. దాంతో రెండు రోజుల ముందు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
ఉద్యోగాలు వదలనున్న విద్యావలంటీర్లు
ఫిబ్రవరి రెండో వారంలో టీఆర్‌టీ నిర్వహించనున్నందున రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 8 వేల మంది విద్యా వలంటీర్లలో అధిక శాతం మంది ఉద్యోగాలు వదిలి పరీక్షకు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. భూపాలపల్లి, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నందున ఇక్కడ ఉద్యోగాలు వదులుకునే వారి శాతం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా.
టీఆర్‌టీ పరీక్షల విధానం ఇదీ..
టీఆర్‌టీ పరీక్షా విధానం ప్రకారం ఎస్జీటీ, భాషాపండితులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇక వ్యాయామోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) పోస్టులకు 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు అరమార్కు ఇస్తారు. ఎస్జీటీ పోస్టులకు ఎనిమిదో తరగతి వరకు పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయని, అయితే కాఠిన్యత స్థాయి ఇంటర్‌ వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులకు పదోతరగతి వరకు ప్రశ్నలు ఉన్నా.. సిలబస్‌ కాఠిన్యత స్థాయి ఇంటర్‌ వరకు ఉంటుంది.






Published on 22-10-2017