Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

సగం కొలువులు మహిళలకే..!
* టీఆర్‌టీలో 4,095 ఖాళీలు వారివే
* జనరల్ కేటగిరీలోనూ పోటీకి అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)లో ప్రభుత్వం మహిళలకే పెద్దపీట వేసింది. స్కూల్ అసిస్టెంట్లు, భాషాపండిత పోస్టుల్లో సాధారణ కేటగిరీ కన్నా మహిళా రిజర్వేషన్ కింద పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎస్జీటీ, పీఈటీ పోస్టులు జనరల్ కేటగిరీ కింద అధికంగా ఉన్నాయి. మొత్తం 8,792 ఖాళీల భర్తీకి ప్రకటన జారీచేయగా అందులో 4,697 (53.43 శాతం) జనరల్ కేటగిరీ కాగా, మహిళా రిజర్వేషన్ కింద 4,095 (46.57 శాతం) పోస్టులను చూపారు. ఇక స్కూల్ అసిస్టెంట్ (పీఈ)లో ఖాళీలన్నీ మహిళలవే. రిజర్వు పోస్టులతో పాటు ఓపెన్‌లో, సంబంధిత రిజర్వుడు కేటగిరీల్లోనూ పోటీకి నిలిచే అవకాశం ఉండటంతో నియామకాల్లో సగానికిపైగా మహిళలే ఉండవచ్చని భావిస్తున్నారు.
* కొలువుల సంఖ్యపై నిరాశ..
టీఆర్‌టీలో కొన్ని జిల్లాల కొలువుల సంఖ్య చూస్తే కాగితంపై భారీగానే కనిపిస్తున్నా.. రిజర్వేషన్, రోస్టర్, భాషా మాధ్యమం వారీగా చూస్తే అభ్యర్థుల ఆశలు గల్లంతవుతున్నాయి. కొన్ని జిల్లాలో అభ్యర్థులు అర్హత కలిగిన సబ్జెక్టులకు ఒక్కపోస్టు కూడా లేకపోవడం గమనార్హం. ఎక్కడైనా ఒకటి, రెండు ఉన్నా.. వేర్వేరు రిజర్వేషన్‌ల కిందకు వెళ్లాయి. ఇక రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి అభ్యర్థులు ఎస్జీటీకి పోటీపడాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఖమ్మం, వరంగల్ అర్బన్‌లో ఒక్క ఎస్జీటీ పోస్టూ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ కొలువులు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. కొన్ని మాధ్యమాల్లో ఒక్క ఖాళీ కూడా లేదు. 900 ఉర్దూమీడియం పోస్టులుండగా.. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా 636 ఉంటే.. భాషాపండిత పోస్టులు మాత్రం కేవలం 26 మాత్రమే ఉన్నాయి. ఉర్దూమీడియం పోస్టుల్లో రిజర్వేషన్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ-ఏ, బీ, సీ, డీ కేటగిరీలను పేర్కొన్నారు. అయితే ఆయా కేటగిరీకు దరఖాస్తు చేసేవారంతా ఉర్దూ మీడియంలో చదివి ఉండాలని, ఉర్దూలోనే పరీక్ష రాయలని పేర్కొన్నారు. దీంతో వీటి భర్తీలో సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
* మెరిట్ ఉంటే ఏ జిల్లాలోనైనా..
సొంత జిల్లాల్లో పోస్టులు లేనివారికి మెరిట్ ప్రకారం ఏ జిల్లాలోనైనా ఓపెన్ కేటగిరీ కింద అవకాశాన్ని కల్పించడం ఈ సారి మంచి వెసులుబాటు. అయితే, గతంలో డీఎస్సీల్లో ఆ జిల్లాకు దరఖాస్తు చేసిన స్థానికేతరులు మాత్రమే పోటీ పడేవారు. ఇప్పుడు 30 జిల్లాల అభ్యర్థులూ స్థానికేతరులుగా పోటీపడేందుకు అవకాశం ఉండటంతో పోటీ మరింత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. స్థానికేతరులకు కేటాయించిన 20 శాతం పోస్టుల్లో ప్రతిభ చూపితేనే కొలువు దక్కుతుంది. ఒకవేళ ఒక జిల్లాలో కోరుకున్న పోస్టు ఓపెన్‌లో లేకుంటే, ఆ జిల్లా వరకు స్థానికేతర కేటగిరీపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.

Published on 22-10-2017