Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

స్థానికేతర ఖాళీలకు భారీ పోటీ!
* ‘అన్ని జిల్లాల వారూ అర్హుల’నే నిబంధనే కారణం
* తెలంగాణ టీఆర్‌టీలో కొత్త విధానంపై సర్వత్రా చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ)లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనతో స్థానికేతర కోటా కింద ఉండే 20 శాతం ఉపాధ్యాయ ఖాళీలకు భారీ పోటీ ఏర్పడనుంది. గత డీఎస్‌సీ-2012 వరకు అభ్యర్థులు ఏదో ఒక జిల్లాను మాత్రమే స్థానికేతర కోటా కింద ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. ఈసారి కొత్త జిల్లాల ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తుండటంతో సగం జిల్లాల్లో ఖాళీలు తక్కువగా ఉన్నాయి. ఏడు జిల్లాల్లో వందలోపే ఉండటం గమనార్హం. తొమ్మిది జిల్లాల్లో ఎస్‌జీటీ ఖాళీలు 10లోపే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ అభ్యర్థీ స్థానిక జిల్లాతో పాటూ.. మిగిలిన 30 జిల్లాల్లోని 20 శాతం కోటా పోస్టులకు పోటీపడేలా అవకాశం ఇచ్చింది. ఇది మంచి అవకాశమే అయినా.. దీనివల్ల స్థానికేతర ఖాళీలకు పోటీ భారీగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలో ఎస్‌జీటీ స్థానికేతర కోటా కింద 26 ఖాళీలున్నాయి. దానికి పాత పద్ధతి ప్రకారం 3 వేల మంది దరఖాస్తు చేసేవారు. ప్రతిభ ఆధారంగా నియామకాలు జరిగేవి. ఈసారి అన్ని జిల్లాల వారూ అర్హులే కాబట్టి డీఈడీ చేసిన వారందరూ (గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా) వాటికి పోటీపడతారు. ఖాళీలు అధికంగా ఉన్న ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాలకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రోస్టర్‌ పాయింట్లను కూడా పరిగణనలోకి తీసుకొని తమ కేటగిరీకి ఎన్ని ఖాళీలు ఉంటాయని అభ్యర్థులు ఆరా తీస్తున్నారు.
దరఖాస్తు చేయనున్న రెండున్నర లక్షలమంది!
టీఆర్‌టీకి సుమారు 2.50 లక్షల మంది పోటీ పడవచ్చని తెలుస్తోంది. దీనికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఉత్తీర్ణత తప్పనిసరి. గత మేలో జరిగిన టెట్‌లో పేపర్‌-1 (ఎస్‌జీటీ)లో 56,708 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-2 (స్కూల్‌ అసిస్టెంట్‌)లో 45,055 మంది పాసయ్యారు. అంటే టెట్‌లో ఉత్తీర్ణులైన వారే లక్ష మంది ఉన్నారు. గతంలో నిర్వహించిన మూడు టెట్లలో ఉత్తీర్ణులైన వారు మరో 75 వేల నుంచి లక్ష వరకు ఉండొచ్చని అంచనా. ఇక పీఈటీ, పీడీ పోస్టులకు టెట్‌ అవసరం లేదు. డీఈడీ, బీఈడీ చదివి టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2లో ఉత్తీర్ణులైన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే అభ్యర్థుల సంఖ్య 2.50 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
స్థానికతపై సందేహాల వెల్లువ
నాలుగు నుంచి 10వ తరగతి వరకు అంటే ఏడేళ్ల చదువులో ఎక్కడ నాలుగు సంవత్సరాలు చదివితే ఆ జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో అభ్యర్థులు మూడు నాలుగు జిల్లాల్లో చదివిన పరిస్థితులు ఉండటంలో పలు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఒక అభ్యర్థి 4వ తరగతి ఒక జిల్లాలో మిగిలిన ఆరు తరగతులను ఒక్కో జిల్లాలో రెండేళ్లు చదివితే ఏ జిల్లాకు స్థానికుడు అవుతాడని ప్రశ్నిస్తున్నారు. దీనికి అధికారులు మాత్రం అలాంటప్పుడు చివరి రెండు తరగతులు (9, 10) ఎక్కడ చదివితే ఆ జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణిస్తామని సమాధానం ఇస్తున్నారు. మరో అభ్యర్థి 4, 5 తరగతులు మేడ్చల్‌, 6, 7, 8 తరగతులు సంగారెడ్డి, 9, 10 తరగతులు మంచిర్యాలలో చదివాడు. అతను ఏ జిల్లావాసి? అనే ప్రశ్నకు మూడు తరగతులు చదివిన సంగారెడ్డిని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు.
23న సుప్రీంకోర్టులో విచారణ
ఉపాధ్యాయుల ఖాళీలపై అక్టోబరు 23న సుప్రీంకోర్టులో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే టీఆర్‌టీ ప్రకటన జారీ చేసినందున.. అదే విషయాన్ని విద్యాశాఖ సుప్రీం కోర్టుకు సమర్పించనుంది.

Published on 23-10-2017