Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

డీఎడ్‌ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశమివ్వలేం
* స్పష్టం చేసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం
న్యూస్‌టుడే, జోగిపేట, పుల్కల్‌: ప్రస్తుత డీఎస్సీలో డీఎడ్‌ విద్యార్థులకు అవకాశం కల్పించడం సాధ్యం కాదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తేల్చిచెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాలు అజెండాగా పెట్టుకున్నాయని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌, అందోలు మండలాల్లో రూ.18.96 కోట్లతో నిర్మించిన మహిళా, సాధారణ పాలిటెక్నిక్‌ కళాశాలల భవనాలను అక్టోబరు 25న ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బాబూమోహన్‌ అధ్యక్షతన అందోలులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కడియం మాట్లాడుతూ... ప్రజోపయోగ పథకాలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ ముందుకొస్తే, ప్రతిపక్షాలు కేసులేస్తూ, విమర్శిస్తూ అడ్డుపడుతున్నాయన్నారు. కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే... ప్రతిపక్షాలు మాత్రం పాతజిల్లాల వారీగానే చేపట్టాలనడం సమంజసం కాదన్నారు. పూర్వ జిల్లాల ప్రకారం నియామకాలు చేపడితే, అభ్యర్థుల మధ్య పోటీ పెరుగుతుందన్నారు. ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డిలు పాల్గొన్నారు.
‘టెట్‌’కు అవకాశమిచ్చారు... డీఎస్సీకీ ఎందుకివ్వరు?
డీఎస్సీ రాసేందుకు తమకు అవకాశమివ్వాలని సంగారెడ్డికి చెందిన ఎంఎన్‌ఆర్‌, నాగార్జున కళాశాలల డీఎడ్‌ విద్యార్థులు పుల్కల్‌లో కడియంకు వినతిపత్రమిచ్చారు. ఇందుకాయన స్పందిస్తూ- ‘‘ఈరోజు మీరొచ్చారు. రేపు బీఎడ్‌ విద్యార్థులొచ్చి.. త్వరలోనే కోర్సు పూర్తవుతుందని, అవకాశమివ్వాలని కోరతారు. ప్రస్తుత డీఎస్సీలో డీఎడ్‌ విద్యార్థులకు అవకాశం కల్పించడం సాధ్యంకాదు’’ అని వారికి స్పష్టం చేశారు. రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో ‘టెట్‌’ రాసేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం... ఇప్పుడెందుకు ఇవ్వట్లేదని విద్యార్థులు ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానం చెప్పకుండా, ముందుకు వెళ్లి వాహనంలో కూర్చున్నారు. విద్యార్థులు ఆయన వాహనం ముందుకు వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. పోలీసులు విద్యార్థులను బలవంతంగా పక్కకు జరిపి ఉపముఖ్యమంత్రి వాహనాన్ని అక్కడి నుంచి పంపించేశారు. అందోలు సభకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Published on 26-10-2017