Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఫిబ్రవరి 24 నుంచి టీఆర్‌టీ రాతపరీక్షలు
* ఇప్పటివరకు 2.30 లక్షల దరఖాస్తులు
* సందేహాలు, సాంకేతిక సమస్యలపై ప్రత్యేక కేంద్రం
* టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)కు ఇప్పటి వరకు 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. టీఆర్‌టీ పరీక్ష నిర్వహణ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పుల్లేవని చెప్పారు. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు రాతపరీక్షలు ఉంటాయన్నారు. మే 10 నాటికి జిల్లాల వారీగా ఎంపిక జాబితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. పరీక్షకు వారం ముందుగానే ప్రవేశపత్రాలు జారీ చేస్తామన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ పోస్టులకు పూర్వ జిల్లా కేంద్రాల్లో, మిగతా పోస్టులకు హైదరాబాద్‌ మహానగర పరిధిలో రాతపరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీఆర్‌టీకి దరఖాస్తులో అభ్యర్థులకు ఎదురవుతున్న సందేహాలకు వివరణ ఇచ్చారు.
* దరఖాస్తు చేసే సమయంలో పీడీఎఫ్‌ ఫైల్‌ రూపుదిద్దుకోకున్నా, పరీక్ష ఫీజు చెల్లింపులో ఇబ్బందులు వచ్చినా అభ్యర్థులు టీఆర్‌టీ ప్రత్యేక కాల్‌సెంటర్‌ను సంప్రదించాలి. అప్పుడు వారి మెయిల్‌ ఐడీకి ఆ కాపీ పంపిస్తాం. ఈ కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 90301 74469 నెంబరులో సంప్రదించాలి. టీఆర్‌టీకి సంబంధించి ఇతరత్రా సమాచారం కోసం 72888 96658 నెంబరుకు ఫోన్‌ చేయాలి.
* అభ్యర్థులు ఆంగ్ల, తెలుగు మాధ్యమాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థుల విద్యార్హతల మేరకు రెండు సబ్జెక్టుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* టీఆర్‌టీ ప్రకటన సమయంలో 31 జిల్లాల ప్రాతిపదికన దరఖాస్తు చేసిన అభ్యర్థులు ‘ఎడిట్‌’ ఆప్షన్‌ ద్వారా పది జిల్లాలకు ప్రాధాన్యతాక్రమాన్ని మార్చుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారిలో 40 వేల మంది వరకు ఆ మేరకు ఆప్షన్‌ ఇవ్వలేదు. ఆప్షన్‌ ఇవ్వని వారి దరఖాస్తులు పరిగణలోకి తీసుకోం. జనవరి 10లోగా ‘ఎడిట్‌’ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
* దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఆ వివరాలను సరిచేసేందుకు జనవరి 7 నుంచి 10 వరకు మాత్రమే అవకాశమిస్తాం. సవరణకు ఒక్కసారే అవకాశం ఉంటుంది.
* జిల్లా పోస్టుల్లో 80 శాతం స్థానిక అభ్యర్థులకు, 20 శాతం స్థానికేతర అభ్యర్థులకు ఉంటాయి. స్థానికేతర పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి జిల్లాల వారీగా స్థానికేతర పోస్టులకు ఆప్షన్లు తీసుకుని మెరిట్‌ ప్రకారం ఎంపిక జాబితాను ప్రకటిస్తాం.
టీఆర్‌టీ దరఖాస్తుకు జనవరి 7 వరకు గడువు
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. జనవరి 7 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
https://tspsc.gov.in

Published on 31-12-2017