Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక ప్రకటన
* సుమారు రెండు వేల ఖాళీలు
* ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆర్‌.కిషోర్‌బాబు సచివాలయంలో నవంబరు 27న సూచనప్రాయంగా వెల్లడించారు. సుమారు రెండు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాల్లో గుర్తించిన గిరిజన ప్రాంతాల్లో 402 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. ఇవికాకుండా.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలోని 2800 ఉపాధ్యాయ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1350 వరకు ఉన్నాయి. సాంకేతిక కారణాలతో తదుపరి ఉత్తర్వులు వెలువడటంలో జాప్యం వల్ల వీటి నియామకాల ప్రక్రియ మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో 1350తో పాటు 402 (మొత్తం 1752) ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ విద్యతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో అభ్యర్థులు సాధించిన మార్కులతోనే ఈ ఉద్యోగాలను భర్తీచేస్తారు. ఈ నియామకాల ప్రకటన వెలువడేందుకు మరికొంత సమయం పట్టనుంది.
విద్యాశాఖ ద్వారా 350 ఉద్యోగాల భర్తీ!
ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ నుంచి 350 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు మైదాన ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని సామాజికవర్గాల వారీగా భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే జరిగితే విద్యా శాఖ తరపున జరిగే పోస్టుల భర్తీ సంఖ్య 10,663కు చేరుకుంటుంది.

Published on 28/11/2014 03:16:29 PM