Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఇంటర్ లేకపోయినా స్కూల్ అసిస్టెంట్‌కు అర్హులే
* దూరవిద్యలో డిగ్రీతో పాటు బీఎడ్ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు
* టెట్ కమ్ టీఆర్టీ అర్హతలపై పాఠశాల విద్యాశాఖ వివరణ
ఈనాడు, హైదరాబాద్‌: టెన్త్, ఇంట‌ర్ లాంటి విద్యార్హత‌ల‌తో సంబంధం లేకుండా నేరుగా డిగ్రీ, ఆ తర్వాత బీఎడ్ చేసినవారు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులేనని ఏపీ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. తెలుగు మాధ్యమంలో పదో తరగతి వరకు చదివి.. ఇంటర్‌ చదవకుండా దూరవిద్యలో డిగ్రీ, బీఈడీ పూర్తిచేసిన వారు టెట్‌-కమ్‌-టీఆర్టీ (ఉపాధ్యాయుల నియామకం) రాతపరీక్ష రాసేందుకు దరఖాస్తు చేయొచ్చునని తెలిపింది. మొదటి భాష కింద తెలుగుతో పదో తరగతి పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇంటర్‌ చదవకుండా దూరవిద్యలో డిగ్రీ.. బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.... దీనిపై సంబంధిత వర్గాలు స్పందించాయి. వెబ్‌సైట్‌లో పెట్టిన మార్గదర్శకాలను పూర్తిగా చదవకుండానే అభ్యర్థులు హైరానా పడుతున్నారని విద్యాశాఖ పేర్కొంది. ఆయా అభ్యర్థులు దర‌ఖాస్తు ఫారంలో ఇంట‌ర్ ఆప్షన్‌ను ట‌చ్ చేయ‌కుంటే అప్‌లోడ్ అవుతుందనే విషయాన్ని గమనించాలని స్పష్టం చేసింది. ఎస్జీటీ పోస్టుల‌కు మాత్రం ఇంట‌ర్‌, డీఎడ్ అర్హత‌లు త‌ప్పనిస‌రని పేర్కొంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపించిన అనంతరం.. వాటిని ప్రింట్‌ తీసి.. అర్హతల నకళ్లతో అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు జనవరి 31వ తేదీలోగా పంపించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అర్హతల నకళ్లపై అభ్యర్థుల సంతకాలు చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో వ్యయప్రయాసాలకు గురవుతున్నామని అభ్యర్థులు ఆందోళన చెందుతుండగా.. పరీక్షల నిర్వహణ సమయంలో అక్రమాల నిరోధానికి ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఒకట్రెండు ఘటనల ఆధారంగా అభ్యర్థులందరు ఇబ్బందిపడేలా కొత్త నిబంధన విధించడంపై పునరాలోచన చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దరఖాస్తులు డీఈఓ కార్యాలయాల్లో అందజేస్తున్నా...వాటిని పరిగణనలోనికి తీసుకోవడంలో పొరబాట్లు జరిగితే తమ పరిస్థితి ఏమిటని వీరు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంధిత వర్గాలు స్పందిస్తూ... ఈ విధానంలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేస్తామని తెలిపాయి.
16వేల దరఖాస్తుల స్వీకరణ: రాష్ట్ర వ్యాప్తంగా 16వేల వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదుచేసిన వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే. .సవరించుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారు. రెండు, మూడురోజుల్లో ఇప్పటికే ప్రకటించిన వెబ్‌సైట్‌లో కంప్లయింట్‌ బాక్సును ఏర్పాటుచేసి.. తప్పులను సవరించుకునే అవకాశాన్ని కల్పిస్తామని అధికారులు తెలిపారు.

Published on 10/12/2014