Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

బీకాం అభ్యర్థులకు చుక్కెదురు
* డీఎస్సీ దరఖాస్తుల తిరస్కరణ
ఈనాడు, నెల్లూరు: ఉపాధ్యాయ నియామకాల్లో కామర్స్ (బీకాం) పట్టభద్రులకు చుక్కెదురైంది. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించినా ప్రస్తుతం వాటిని తిరస్కరిస్తున్నారు. ఈ మేరకు వారి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లను పంపుతున్నారు. దరఖాస్తులను స్వీకరించినప్పుడే నిబంధనల మేరకు అనుమతులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు అభ్యర్థుల నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకున్నారు. రూ.వేలు ఖర్చు చేసి శిక్షణలు పొందిన తరువాత ఇప్పుడు డీఎస్సీ పరీక్షలకు హాల్ టిక్కెట్లు తిరస్కరించడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు తాము అర్హులు కానప్పుడు, అసలు బీఈడీ కోర్సులో ప్రవేశం ఇవ్వకుండా ఉండాల్సిందని అంటున్నారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన తమను ఉద్యోగాలకు అనర్హులని పేర్కొనడం ఏమేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. టెట్ రాయడానికి కూడా అనుమతించారని గుర్తుచేస్తున్నారు.
బీకాం అభ్యర్థులకు సాంఘిక శాస్త్రంలో బీఎడ్ చేసుకునే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఈ పోస్టుల్లో నియామకాలకు చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రాలు చదివి ఉండాలి. అయితే బీకాంలో కేవలం అర్థశాస్త్రం మాత్రమే ఉంటుంది. మిగిలిన రెండూ ఉండవు. అయినా వీరికి బీఎడ్‌లో సాంఘికశాస్త్రం చదివే అవకాశం ఇచ్చారు. ఈ డీఎస్సీలో మొదట బీకాం, బీఎడ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకోలేదు. తర్వాత ప్రభుత్వానికి విన్నపాలు చేయడంతో షరతులతో స్వీకరించారు. మూడు సబ్జెక్టుల్లో చదవలేదంటూ ఇప్పుడు వాటిని అంగీకరించడం లేదు. బీకాంలో కంప్యూటర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ సబ్జెక్టులు చదివిన వారి దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో ఏటా రెండు వేల మంది బీకాం విద్యార్థులు బీఎడ్ చేస్తున్నారు. ఇలాంటి వారు మొత్తం 20వేల వరకు ఉంటారని, ప్రస్తుత డీఎస్సీకి దాదాపు 5వేల మంది దరఖాస్తు చేసి ఉంటారని అంచనా. నిబంధనల మేరకే వీరి దరఖాస్తులను తిరస్కరించినట్టు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు తెలిపారు.

Published on 20/4/2015