Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఏపీలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా 402 ఖాళీల భర్తీకి చర్యలు
* డీఎస్సీ-2014 ద్వారా 314 టీచర్ల పోస్టుల భర్తీకి సన్నాహాలు
* సూచనప్రాయంగా ఆమోదించిన ఆర్థిక శాఖ

ఈనాడు-హైదరాబాద్: ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక డీఎస్సీతో 402, జనరల్ డీఎస్సీ ద్వారా 314 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి సూచనప్రాయంగా ఆమోదం లభించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల ఆశ్రమ పాఠశాలల్లో 402 పోస్టులను స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీచేయనున్నారు. ఆర్థిక శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చిన అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి. మరోవైపు..రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో 314 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేస్తామని ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఏప్రిల్ 30న వెల్లడించారు. పదోన్నతులపై 349 పోస్టులను భర్తీచేస్తామని ప్రకటించారు.
* స్కూల్ అసిస్టెంట్ తెలుగు-2, హిందీ-2, ఇంగ్లీష్-6, గణితం-9, ఫిజికల్ సైన్స్-3, బయలాజికల్ సైన్స్-1, సోషల్ స్టడీస్-7, ఫిజికల్ ఎడ్యుకేషన్-5, తెలుగు పండిట్ గ్రేడ్2-42, హిందీ పండిట్ గ్రేడ్2-33, సెకండరీ గ్రేడ్ టీచర్స్-90, పీఈటీ-25, క్రాఫ్ట్-2, ఇతర పోస్టులను జనరల్ కేటగిరీలో భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను డీఎస్సీ-2014 ద్వారా భర్తీ చేయాలని యోచిస్తున్నారు.
* శాఖాపరంగా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అందితేనే ఏపీ విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన డీఎస్సీ-2014లో కలిపే అవకాశం ఉంది. త్వరలో డీఎస్సీ రాత పరీక్షలు జరగనున్నాయి. యుద్ధప్రతిపాదికన ఇందుకు సంబంధించిన చర్యలు జరిగితేనే డీఎస్సీ-2014 ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుంది. లేకపోతే కష్టమేనన్నది సంబంధిత వర్గాల అభిప్రాయం.


Published on 29/4/2015