Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

రెండేళ్ల బీఈడీలో సెమిస్టర్‌!
* అంతర్గత మూల్యాంకనంతో 20 శాతం మార్కులు
* రూపుదిద్దుకున్న పాఠ్య ప్రణాళిక

ఈనాడు, గుంటూరు: జస్టిస్‌ వర్మ కమిషన్‌ సిఫార్సుల నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి బీఎడ్‌ ఉపాధ్యాయ విద్యను రెండేళ్ల పాటు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఏప్రిల్ మొదటివారంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని వర్సిటీల ఎడ్యుకేషన్‌ డీన్లు, అధ్యాపకులు, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్లతో పాటు బెంగళూరు, భువనేశ్వర్‌, గోవా తదితర ప్రాంతాల్లోని జాతీయ ఉపాధ్యాయ విద్య ప్రాంతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) కేంద్రాల అధ్యాపకులు సమావేశమై రెండేళ్ల పాఠ్య ప్రణాళికకు తుది రూపమిచ్చారు. దీన్ని ఉన్నత విద్యామండలి ఆమోదించటమే తరువాయిగా చెబుతున్నారు.
రెండేళ్ల బీఎడ్‌ విద్య స్వరూపమిదీ..
* జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి(ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఇకమీదట సెమిస్టర్‌ విధానంలో పరీక్షలు జరుపుతారు. మొత్తం నాలుగు సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి.
* థియిరీకి అంతర్గత (ఇంటర్నల్‌) మూల్యాంకనం ద్వారా 20 శాతం మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. వాటిని కళాశాల స్థాయిలో అధ్యాపకులు ఇస్తారు.
* మొదటి ఏడాదిలో 8 వారాల పాటు శిక్షణార్థులు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో శిక్షణకు వెళ్లాలి. అదేవిధంగా రెండో ఏడాదిలో 12 వారాలు పాఠశాలల్లో శిక్షణకు వెళతారు. ఏడాది విద్యలో కేవలం నెల రోజులు మాత్రమే శిక్షణకు వెళ్లేవారు.
* ప్రయోగాత్మక శిక్షణకు వెళ్లినప్పుడు శిక్షణార్థుల బోధనా పద్ధతులు పరిశీలించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సబ్జెక్టు ఉపాధ్యాయులు మార్కులు ఇవ్వాలని ప్రతిపాదించారు.
* గతంలో తప్పనిసరిగా నాలుగు పేపర్లు చదవాల్సి ఉండగా... రెండేళ్ల విద్యలో దీన్ని ఆరు పేపర్లకు పెంచారు.
* ఏడాదికి పని దినాలు 200 రోజులకు తగ్గకుండా ఉండాలని నిర్ణయించారు.
అంతర్గత మూల్యాంకనంతో ఇబ్బందే
అంతర్గత మూల్యాంకనంతో అవకతవకలకు అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 20 శాతం మార్కులు వారి చేతుల్లో ఉండటంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.




Published on 1/5/2015