Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం
* ఎస్జీటీలకు గణితంలో చుక్కలు
* సంక్లిష్ట ప్రశ్నలతో సమయాభావం

ఈనాడు-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు మే 9న ప్రారంభమయ్యాయి. ఉదయం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) అభ్యర్థులకు పరీక్ష జరిగింది. ఇందులో గణితం ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూపించాయని.. దాదాపుగా నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక అనుసరించి మాత్రమే ప్రశ్నలు వచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్జీటీ పరీక్షకు 88.66 శాతం హాజరు నమోదైనట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. 61489 మంది అభ్యర్థులు దరఖాస్తుచేయగా 57,722 మందికి హాల్‌టిక్కెట్లను పంపిణీచేశామని తెలిపారు.. వీరిలో 51,177 మంది మాత్రమే హాజరయ్యారని చెప్పారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు.
ఆంగ్లంలో ప్రశ్నలు సులభం
గణితం విభాగంలో ప్రశ్నలకు జవాబులు రాయడంలో పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా చదివి..అవగాహన ఉన్న వారు ముందంజలో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాన్-మ్యాథ్స్ అభ్యర్థులకు గణితం ప్రశ్నలు మాత్రం సంక్లిష్టంగా మారాయని పేర్కొన్నారు. గణితం నేపథ్యం కలిగిన వారు కూడా 8 నుంచి 10 ప్రశ్నలకు వాటి సంక్లిష్టత కారణంగా జవాబులు రాసేందుకు ఇబ్బందిపడి ఉంటారని చెబుతున్నారు. సైకాలజీ ప్రశ్నలు మెదడుకు బాగా పనిబెట్టాయని పేర్కొంటున్నారు. ఆంగ్లంలో పేర్కొనే ప్రశ్నలు తొలి నుంచి కష్టంగా ఉండేవి. ఈ దఫా ఇందుకు సంబంధించిన ప్రశ్నలు సులభంగా ఇచ్చారని అవనిగడ్డ ప్రగతి విద్యా సంస్థల కార్యదర్శి పూర్ణచంద్రరావు అభిప్రాయపడ్డారు. తెలుగు, గణితం, సైన్స్, మెథడాలజీ ప్రశ్నల సరళి బాగానే ఉందని వెల్లడించారు. జీకే, వర్తమాన అంశాలపై ప్రశ్నలు సగటు స్థాయి కంటే కఠినంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తంచేశారు. ఈ దఫా టెట్-డీఎస్సీ కలిపి నిర్వహించడంవల్ల అభ్యర్థులకు ఉపశమనం లభించిందని కడప జిల్లాకు చెందిన డాక్టర్ వి.బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏడో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇచ్చారు. ఈ స్థాయిని పదో తరగతికి పెంచినందున బోధన ప్రమాణాల్లో మార్పు రానుందని అభిప్రాయపడ్డారు.
అభ్యంతరాలు:
* ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ విభాగం 'ఎ కోడ్‌లో 29వ ('ఒక విద్యార్థి పద్యాన్ని కంఠస్థం ....) ప్రశ్నకు సంబంధించి పేర్కొన్న జవాబులో 54.54 తరహాలో ఉండాల్సి ఉండగా..5.4 గా పేర్కొన్నారు.
* అమైనో ఆసిడ్ ఫినైల్ అలనైన్ లోపంవల్ల కలిగే మానసిక వైకత అనే ప్రశ్న సిలబస్‌లో లేదని పేర్కొంటున్నారు.
* అలంకారానికి సంబంధించిన 47వ ప్రశ్న స్థాయికి మించి ఉందని పేర్కొంటున్నారు. మొత్తమ్మీద చూస్తే నిర్దేశించిన పాఠ్యప్రణాళికకు తగినట్లే ప్రశ్నలు వచ్చాయని వెల్లడించారు.
అధిక హాజరు నమోదు
గరిష్ఠంగా చిత్తూరు జిల్లాలో 98.96%, పశ్చిమ గోదావరిలో 93.37%, నెల్లూరులో 97.7% వంతున హాజరు నమోదైంది.
కనిష్ఠంగా కడప జిల్లాలో 77.74%, విజయనగరంలో 79.13%, అనంతపురం జిల్లాలో 83.45% వంతున హాజరు నమోదైనట్లు విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయుల నియామకాల కోసం రాష్ట్రంలో కేవలం తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కేంద్రంలో పరీక్ష నిర్వహించారు.
11 మందికి గాను 8 మంది మాత్రమే హాజరయ్యారని ఏపీ విద్యా శాఖ సంయుక్త సంచాలకులు భార్గవ్ తెలిపారు. ప్రశ్నపత్రాల ప్రాథమిక 'కీని మే 18వ తేదీన విడుదలచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.




Published on 09/05/2015