Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేస్తాం
* వచ్చే డీఎస్సీలో ఎస్జీటీలుగా అవకాశం కల్పించేందుకు కృషి
* ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు

ఈనాడు, అనంతపురం: పశ్చిమ బెంగాల్‌లో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పించడం అక్కడి ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా జరిగిందని, కేవలం పోస్టుల కంటే అభ్యర్థులు తక్కువగా ఉండటం వల్లే అది సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో లేవని, ఇక్కడ ఎస్జీటీ పోస్టుల కంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీపడుతున్నారని వివరించారు. మే 14న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీఈసెట్‌-2015 పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం కోడ్‌ను అనంతపురంలో జేఎన్‌టీయూలో ఉదయం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని తెదేపా ఎన్నికల మేనిఫెస్టోలోనూ పేర్కొందని, అంతకుముందు పాదయాత్రలోనూ చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంచేశారని గుర్తు చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కేంద్రం ఒప్పుకోలేదన్నారు. రానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఉన్న ఖాళీల మేరకు కేంద్రంతో చర్చించి అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన డీఎస్సీలో అనంతపురంలో ఉర్దూ మీడియం విద్యార్థులకు తెలుగుమీడియం ప్రశ్నపత్రం రావడం, పలుచోట్ల స్వల్ప తప్పిదాలు జరిగినట్లు అభ్యర్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని దీనిపై విచారణ కమిటీ వేశామన్న గంటా... కమిటీ నివేదిక మేరకు బాధితులకు తప్పక న్యాయం చేస్తామన్నారు. రానున్న విద్యాసంవత్సరానికి డీఎస్సీ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామన్న మంత్రి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఫలితాలను వేగవంతంగా వెలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. జూన్‌ 1న డీఎస్సీ ఫలితాలు వెలువరిస్తామన్నారు. అలాగే 26న ఎంసెట్‌, 21న ఏపీఈసెట్‌, 28న పదోతరగతి ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.




Published on 14/05/2015