Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

402 టీచర్ల పోస్టుల భర్తీకి ప్రకటన
* గిరిజనులకు మాత్రమే ప్రత్యేకం
* పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూల్లేవు
* మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడి

ఈనాడు-హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో 402 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసినట్లు ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు మే 20న ఓ ప్రకటన జారీచేశారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ నియామకాలను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని షెడ్యూల్‌ ప్రాంతాల్లో గిరిజన అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రత్యేక డీఎస్సీకి జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష గాని, ఇంటర్వ్యూలు కానీ లేవని మంత్రి రావెల ప్రకటించారు. అభ్యర్థులు ఇంటర్‌, డిగ్రీలో సాధించిన 50 మార్కులకు, బీఈడీ లేదా డీఈడీలో వచ్చిన మార్కులకు 30, టెట్‌లో మార్కులకు 20 మార్కుల వంతున వంద మార్కులను పరిగణనలోనికి తీసుకుని ప్రతిభా జాబితా తయారు చేస్తామని తెలిపారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. పరిశీలన, ప్రతిభా జాబితా తయారీ చివరి తేదీ జూన్‌ 10. జూన్‌11లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది ప్రతిభా జాబితాను జూన్‌ 14న ప్రకటిస్తారు. అదేనెల 15న కౌన్సెలింగ్‌ ద్వారా నియామక ఉత్తర్వులు జారీచేస్తారు. అభ్యర్థులు జూన్‌ 20వ తేదీలోగా ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని, అర్హులైన గిరిజన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రావెల కోరారు.


Published on 20/05/2015