Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

డీఎస్సీ తుది 'కీ' తప్పులతో గందరగోళం
* ప్రతిభావంతులకు నష్టం జరిగే పరిస్థితి
* తప్పు దిద్దుకుంటున్న ఏపీ సర్కారు
* 2వ తేదీ సాయంత్రం ఫలితాలు విడుదల

ఈనాడు-హైదరాబాద్: డీఎస్సీ-2014 (టెట్ కమ్ టీఆర్‌టీ) ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల గుర్తింపులో అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడంతో ప్రతిభ కలిగిన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. తప్పుల్ని సరిదిద్దామని, లోపాలు ఉన్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వడం లేదా రెండు జవాబుల్లో ఏదీ గుర్తించినా మార్కు ఇవ్వడం చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. దాంతో కొందరు నష్టపోయే, మరికొందరు ప్రయోజనం పొందే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాథమికంగా ప్రకటించిన 'కీలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించడంతోపాటు రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ స్వయంగా పరిశీలన జరిపి తప్పులను సరిదిద్దాలి. అయినా, తుది 'కీ'లు ప్రకటించిన తర్వాత కూడా అధిక సంఖ్యలో తప్పుల్ని సవరించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. తుది కీ ప్రకటన తర్వాత జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. మళ్లీ అభ్యంతరాల స్వీకరణ అన్నది జరగదు. జరగకూడదు. కానీ, ఈ డీఎస్సీలో జరిగింది. డీఎస్సీ తుది 'కీ'ల్లో దొర్లిన తప్పులపై అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో విద్యాశాఖ పునఃపరిశీలన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ''ప్రశ్నలకు రెండు సమాధానాలు ఇవ్వడం వల్ల అభ్యర్థి సమయం వృథా అయింది. ప్రశ్న కింద పేర్కొన్న జవాబుల్లో దేనిని గుర్తించాలో తెలియక ఎక్కువ సమయం దానికే కేటాయించిన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. తుది కీ తర్వాత కూడా సవరణలు ఉండటం వల్ల డీఎస్సీ మూల్యాంకనంపై విశ్వసనీయ సన్నగిల్లే ప్రమాదం ఉంది అని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానించారు. ''తప్పుడు ప్రశ్నలకు అందరికీ మార్కులు ఇవ్వడం వల్ల ప్రతిభ కలిగిన అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. అర్హత పొందలేని అభ్యర్థి దీనివల్ల అర్హత పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. తోచిన జవాబులు పెట్టేసిన వారు కూడా ముందుకువచ్చే పరిస్థితులు ఉన్నాయి అని విద్యా శాఖ వర్గాలు సైతం అంటున్నాయి.
ఎందుకిలా!
ప్రశ్నపత్రాల రూపకర్తల్లో కొందరికి సరైన సామర్థ్యాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. ప్రామాణిక గ్రంథాలను పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు, జవాబులు గుర్తించాలి. కొందరు ఇష్టమొచ్చిన గ్రంథాలను ఉపయోగించారన్న అభిప్రాయాన్ని విద్యాశాఖ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. కొందరు అస్పష్టంగా ప్రశ్నలను ఇవ్వడంతో జవాబులు గుర్తించడంలో సమస్యలు తలెత్తాయి. మానవ వనరుల కొరత, తగినంత సమయం లేకపోవడంతో తప్పులు అనివార్యమైనట్లు చెబుతున్నారు. ముందుగానే ఎందుకు అప్రమత్తం కాలేకపోయారన్నది చర్చనీయాంశంగా మారింది. గత డీఎస్సీల్లోనూ ఎన్నడూ ఇలా జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రాల్లోని తప్పుల్ని సకాలంలో సవరించలేదు. దీని ఫలితంగా గ్రూపు-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గ్రూపు-1 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షల్ని సైతం పూర్తిచేసి, ఉద్యోగాల్ని ఇవ్వాల్సిన తరుణంలో సుప్రీంకోర్టు నుంచి వెలువడ్డ ఉత్తర్వులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. డీఎస్సీ 'కీ'ల వివాదంలో గ్రూపు-1 అంశం చర్చనీయాంశంగా మారింది.
మంత్రి గంటా సమీక్ష
ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో జూన్ 1న ఉదయం ఏపీ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు లక్ష్మీ వాల్ట్స్, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. తుది 'కీ'ల్లోనూ తప్పులు దొర్లడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా కూడా ఇదే అంశంపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో నిపుణుల బృందం తప్పులపై సమీక్ష జరిపి, సాయంత్రం అయిదున్నర గంటల సమయంలో తుది 'కీలను ఖరారు చేసింది.
2వ తేదీ సాయంత్రం ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ ఫలితాలు జూన్ 2న సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. విశాఖలో డీఎస్సీ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఈ రోజు రాత్రి తుది 'కీ' వివరాలు డీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.

Published on 1/06/2015