Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఉపాధ్యాయ నియామకాల కోసం జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు
ఈనాడు-హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల (టెట్-కమ్-టీఆర్‌టీ) సందర్భంగా జిల్లా విద్యా శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కమిషనర్ ఉషారాణి అధికార్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె డిసెంబరు 1న వీడియో సమావేశంలో జిల్లా అధికారులతో మాట్లాడారు. ఉపాధ్యాయ నియామక దరఖాస్తుల స్వీకరణ డిసెంబరు 3 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానుందని తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి, అదనపు సమాచారం అందించేందుకు వీలుగా జిల్లా విద్యా శాఖ కార్యాలయాల్లో కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి తీసుకున్న పత్రంతో సహా నిర్దేశిత అర్హత పత్రాలను జిల్లా కార్యాలయాలకు అభ్యర్థులు పంపుతారని తెలిపారు. వాటిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హత పత్రాలపై అభ్యర్థుల సంతకాలు ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చిన వాటిని, వీటిని పరిశీలించి హాల్‌టిక్కెట్లను జారీచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
విద్యా శాఖ తరఫున 9061 ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేస్తామని విద్యా శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. పురపాలక శాఖ నుంచి వచ్చిన వివరాలను అనుసరించి 1252 ఉద్యోగాలను కూడా టెట్ కమ్ టీఆర్‌టీ - 2014 ద్వారా భర్తీ చేస్తామని ఏపీ విద్యా శాఖ కమిషనర్ ఉషారాణి ప్రకటించారు. ఈ మేరకు డిసెంబరు 1న ఒక ప్రకటన జారీ చేశారు.
స్థానికేతర (బహిరంగ విభాగం) కోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ వర్గాలు తెలియచేసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. రాతపూర్వక సమాచారం డిసెంబరు 2న అందుతుందని పేర్కొన్నాయి. ఉపాధ్యాయుల నియామక ప్రకటనకు అనుగుణంగా పూర్తిస్థాయి మార్గదర్శకాలను ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఏపీ టెట్ క‌మ్ టీఆర్‌టీ - పాఠ‌శాల విద్యాశాఖ విడుద‌ల చేసిన ఖాళీల వివ‌రాలు

Published on 01/12/2014