Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

అక్కడివారు స్థానికేతరులు కాదు!
* ఏపీ ఉపాధ్యాయ నియామకాల్లో తెలంగాణ జిల్లాల ఆడపడుచులకు దక్కని అవకాశం
ఆమె పేరు లక్ష్మీ ప్రసన్న. ఖమ్మం జిల్లా ఇరవెండి గ్రామంలో పుట్టారు. భద్రాచలంలో చదువుకున్నారు. నెల్లూరుకు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో ఆమె నెల్లూరులో ఉంటూ అక్కడే బీఈడీ పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌లో (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారు.
ఇప్పుడామె ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందేందుకు అర్హురాలా.. కాదా..?
ప్రభుత్వం కాదనే అంటోంది. ఇందుకు కారణం ఆమె తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జన్మించడమే. స్థానికేతరుల కోటాలోనూ ఆమె ఏపీలో పరీక్ష రాయలేని పరిస్థితి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె పుట్టిన ప్రాంతం దృష్ట్యా స్థానికులు కాదు.
పోనీ స్థానికేతరుల కోటాలో పరీక్ష రాద్దామనుకొంటే.. అదీ కుదరడం లేదు.
కారణం.. ప్రభుత్వం డిసెంబరు 2న ఏపీలో ఉన్నవారు మాత్రమే జిల్లాల ఆధారంగా స్థానికేతరుల కోటాకిందకు వస్తారని పేర్కొంటూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం చిత్తూరు జిల్లాలో ఉన్న వ్యక్తి కడప జిల్లాలో స్థానికేతర కోటా కింద ఉద్యోగం పొందవచ్చు. కానీ తెలంగాణ జిల్లాకు చెందిన వ్యక్తి మాత్రం అక్కడ జిల్లాల్లో ఉద్యోగం పొందలేరు. మొత్తానికి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో కొందరి అభ్యర్థుల తలరాత మారింది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ నియామకాల ప్రకటన జారీ అయితే.. పోస్టుల సంఖ్యను అనుసరించి ఏపీ వారు తెలంగాణ... తెలంగాణ వారు ఏపీలోని జిల్లాలకు దరఖాస్తుచేసే వారు. కొత్త ఉత్తర్వు ప్రకారం హైదరాబాదు.... చుట్టుపక్కల స్థిరపడ్డ ఏపీకి చెందిన వారు స్థానికేతర కోటాలో వెళ్లాలన్నా సాధ్యంకాదు. ఏపీలో ప్రకటించే ఉద్యోగాల సంఖ్య అనుసరించి తెలంగాణ నుంచి వెళ్లాలనుకున్న వారికి అవకాశం లేకుండా పోయింది. అన్ని జిల్లా స్థాయి ఉద్యోగాల నియామకాలకు ఇదే నిర్ణయాన్ని వర్తింప చేస్తే.. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏపీకి చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.
వీరి పరిస్థితి ఏంటి..!
* తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు, ఏపీకి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం వల్ల కొందరు తెలంగాణ మహిళలు ఏపీలో ఉన్నారు. ప్రస్తుతం వారు స్థానికేతర కోటా కింద హాజరయ్యే అవకాశం లేదు.
* ఖమ్మం, కరీంనగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్గొండ తదితర జిల్లాలకు చెందిన మహిళలు వివాహాలు చేసుకుని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరికి ఉద్యోగం గగనమే.
ఉత్తర్వుల్లో ఏముందంటే..!: ''సాధారణ పరిపాలన శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు అనుసరించి బహిరంగ విభాగంలోని 20% పోస్టులను ఏపీకి చెందిన అభ్యర్థులతో నింపాలి. అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఒరియా టీచర్ల (శ్రీకాకుళం, ఇతర జిల్లాలకు సంబంధించి) నియామకాల వంటి విషయాల్లో నిశితంగా పరిశీలించి రాష్ట్రేతర అభ్యర్థులకు అవకాశాన్ని కల్పించడంపై నిర్ణయం తీసుకోవాలి.''
---- ఏపీ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా డిసెంబరు 2న జారీచేసిన ఉత్తర్వు
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంటే 6.10.2001న జారీ చేసిన ఉత్తర్వుల సారాంశాన్ని తాజా ఉత్తర్వుల్లో ఉటంకించారు. ఇందులోనే స్థానిక, స్థానికేతర కోటా కింద ఉద్యోగాల భర్తీపై ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయీమెంట్‌ ఆర్డరు 1975 గురించి కూడా వివరించారు.

Published on 05/12/2014