Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు... ముందస్తు నగారా!
        రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల అవుతాయని ఉద్యోగార్థులు నిరీక్షిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఈ సందర్భంగా దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశాలను తెలుసుకుందాం!
ఉపాధ్యాయ నియామకాల్లో 'టెట్‌ కమ్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌' టెస్ట్‌ కొత్త ధోరణి. దీనికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాంది పలుకుతోంది. తద్వారా విద్యాహక్కు చట్టం 2009 కింద అనుసరించాల్సిన అర్హతా పరీక్షను నిర్వహిస్తూనే అభ్యర్థులపై అదనపు భారం లేకుండా డీఎస్‌సీ నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎన్‌సీటీఈ మార్గదర్శకాలకు ఇబ్బంది లేకుండా నియామక పరీక్ష నిర్వహించబోవటం విశేషం. టెట్‌ సిలబస్‌, పరీక్షా స్వరూపం రానున్న నియామక పరీక్షలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులు గతంలో 4 సార్లు జరిగిన టెట్‌పరీక్షానుభవాల్ని రాబోయే నియామక పరీక్షలకు ఉపయోగించుకుంటే విజయం సాధించవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోనైనా, తెలంగాణాలోనైనా ఉపాధ్యాయ భర్తీ పరీక్షలో టెట్‌ పరీక్షాంశాలు కీలకం. కాబట్టి ఆయా సిలబస్సుల్ని ప్రామాణికంగా తీసుకొని అధ్యయనం చేయటం అవసరం. తెలంగాణాలో ఒకవేళ టెట్‌, డీఎస్‌సీ విడివిడిగా నిర్వహించినా టెట్‌ మార్కులు అంతిమంగా డీఎస్‌సీలో వెయిటేజి పాందుతాయి. అందుకని పరీక్ష స్వరూపంలో స్పష్టత వచ్చేవరకూ టెట్‌ సిలబస్‌ సిద్ధమవటం మంచిది. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు టెట్‌ సిలబస్‌తో సన్నద్ధత ప్రారంభించడం సముచితం.
ఎస్‌జీటీ అభ్యర్థులు
పోటీ తక్కువగా ఉంది అనే నిర్లక్ష్య ధోరణి ఉండరాదు. మంచి మార్కులు తెచ్చుకోవటం ద్వారా సీనియారిటీలో ముందు ఉండవచ్చు. గతంలోని టెట్‌/డీఎస్‌సీ సన్నద్ధతే సరిపోతుంది. టెట్‌లో పరిసరాల విజ్ఞానానికి 30 మార్కులే ఉండగా ఏపీ టెట్‌- టీఆర్‌టీలో 40 మార్కులు (పరిసరాల విజ్ఞానం I, II లకి చెరో 20 మార్కులు) ఉంటాయని అంచనా. అందువల్ల టెట్‌లో కంటే మరింత లోతుగా ఏపీ అభ్యర్థులు అధ్యయనం చేయాల్సివుంటుంది. అర్హత, నియామక పరీక్ష (AP)లో మూడు గత DSCలలో మాదిరిగా 20 మార్కులు జీకే, వర్తమానాంశాలకు కేటాయించే అవకాశముంది. ఏపీలో డిసెంబర్‌ పరీక్ష జరుగుతుందని భావిస్తే జూన్‌ 2014నుంచి జరుగుతున్న పరిణామాలు అన్నింటిపైనా దృష్టి పెట్టటం సబబు. తెలంగాణా అభ్యర్థులు ప్రస్తుతానికి జీకే, వర్తమాన అంశాలు వదిలేసి వీటిపై నోటిఫికేషన్‌లో స్పష్టత వచ్చిన తరువాత సిద్ధమైతే మంచిది.
స్కూల్‌ అసిస్టెంట్లు
గత టెట్‌-2 సిలబస్‌ అంశాలు కొనసాగుతాయనీ, శిశు వికాసం- పెడగాజి గతంలో మాదిరిగానే ప్రాధాన్యం పొందుతాయనీ అంచనా. అయితే భాష-I, II ల కింద టెట్‌-2లో చెరో 30 ప్రశ్నలు కేటాయించారు; ప్రస్తుత ఏపీ నియామక పరీక్షలో 'భాషల' భారం తగ్గబోతోంది. ప్రస్తుతం భాష-I, II లకి చెరో 15 ప్రశ్నలు కేటాయించి 'ఇంగ్లిష్‌' అవరోధాల్ని తగ్గిస్తారని భావిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ అభ్యర్థుల వెతలు కొంతవరకు పరిష్కరించినట్లే అవుతుందని చెప్పవచ్చు.
గత టెట్‌-2లో మాదిరిగానే ప్రస్తుత నియామక పరీక్షలో కూడా గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్ర స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగార్థులు తమ సొంత కంటెంట్‌లో పాటు మిగతా రెండు సబ్జెక్టులను కూడా చదవాల్సిందే. అయితే ప్రస్తుత సౌలభ్యత ఏమిటంటే- మిగతా రెండు సబ్జెక్టుల వెయిటేజిని 20 మార్కులకే పరిమితం చేయబోవటం. ఫలితంగా సొంత సబ్జెక్టుపై బలమైన దృష్టి పెట్టి, భారీ స్కోరు సాధించటం ద్వారా మిగతా రెండు సబ్జెక్టుల ఒత్తిడిని తగ్గించుకొనే వ్యూహాన్ని అనుసరించవచ్చు.
సాంఘికశాస్త్ర స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు టెట్‌-2లో మాదిరిగానే ఇబ్బంది లేనటువంటి సాంఘికశాస్త్ర సబ్జెక్టులకు మాత్రమే పరిమితమయ్యే సిలబస్‌ను నియామక పరీక్షలో కూడా ఇవ్వనున్నారు. స్కూల్‌ అసిస్టెంట్స్‌ (భాషలు)కు ఈ నియామక పరీక్ష కూడా గత టెట్‌-2 మాదిరిగానే ఉండబోతోంది. అయితే ఏ భాషలో అయితే స్కూలు అసిస్టెంట్లు కాగలుగుతున్నారో అందులో 100 మార్కులు సాధించే అవకాశం ఉండటంతో దానిపై అధిక దృష్టి పెట్టి మంచి స్కోరు సాధించే వ్యూహం అనుసరించాలి. దీనితో పాటు కంటెంట్‌లో భాగంగానే గణితం, సైన్స్‌/ సాంఘిక శాస్త్రంలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని మరో 15 ప్రశ్నలకు సిద్ధపడటం ఈ నియామక పరీక్షలో కన్పించే అంశం. సాధారణంగా భాషల స్కూల్‌ అసిస్టెంట్స్‌ ఉద్యోగార్థులు 'సాంఘిక శాస్త్రాన్నే' ఎంపిక చేసుకునే అవకాశముంది.
సిలబస్‌ అంశాలు: జాగ్రత్తలు
శిశు వికాసం - పెడగాజి: ఉభయ రాష్ట్రాల ఉపాధ్యాయ అభ్యర్థులు తప్పనిసరిగా సిద్ధమవ్వాల్సిన విభాగాల్లో ఇది ఒకటి. B Ed/D Ed లలో విద్యా మనోవిజ్ఞానశాస్త్రం అనే విభాగం కింద ఈ సిలబస్‌ అంశాల్ని అధ్యయనం చేస్తారు. ఉమ్మడిగా ఉండే టెట్‌లోనైనా, ప్రస్తుత ఏపీ నియామక పరీక్షలోనైనా 30 మార్కులు ఈ భాగం కింద ఉంటున్నాయి. B. Ed/D. Ed పాఠ్యగ్రంథాలు ప్రమాణమే అయినా ఎన్‌సీటీఈ మార్గదర్శకాల మేరకు సమగ్ర అవగాహనకు సంబంధించిన ప్రశ్నలే గత టెట్‌లలో అడిగారు. అందువల్ల ఏపీ నిర్వహించబోయే నియామక పరీక్షలో మళ్ళీ అదే తరహా ప్రశ్నలు పునరావృతం అవుతాయి. కారణం టెట్‌ ప్రశ్నలన్నీ కూడా ఈ అర్హతా పరీక్ష అనుసరించాలి కాబట్టి. అందువల్ల D.Ed, B.Ed మనోవిజ్ఞాన శాస్త్రం పుస్తకాలను బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటూ చదవటం ద్వారానే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు. అదేవిధంగా అనువర్తిత (అప్లికేషన్‌) కోణంలో ప్రశ్నలు కూడా అధికమేనని గమనించాలి. సైద్ధాంతిక కోణం కంటే అన్వయకోణం ముఖ్యం. గత టెట్‌ పరీక్షల్లో ఈ విభాగాన్నే 'కఠిన' విభాగమని అభ్యర్థులు భావించారని విస్మరించకూడదు.
భాష-1: సాధారణంగా అత్యధిక అభ్యర్థులు 'తెలుగు'ను తీసుకుంటున్నారు. టెట్‌కు నిర్దేశించుకున్న ప్రమాణాల్ని పాటించటం వల్ల టెట్‌ పరీక్షాపత్రంలో కఠినత్వం ఎక్కువగా ఉందని అభ్యర్థులు గతంలో గుర్తించారు. వ్యాకరణాంశాలు, సాహిత్యంపై పట్టు లేకుండా కోచింగ్‌ నోట్సుల్ని బట్టీ పట్టిన అభ్యర్థులు ఈ అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. కానీ ఒక పద్ధతి ప్రకారం పాఠశాలలో తెలుగు పాఠ్యగ్రంథాల్ని చదివినవారికి ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. అందువల్ల బిట్ల మాదిరిగా విషయాన్ని చదవకుండా అర్థం చేసుకుంటూ చదివే ప్రయత్నం జరగాలి. స్కూల్‌ అసిస్టెంట్‌లకు కొంత 'భాషల' భారం తగ్గినా ఎస్‌జీటీలకు మాత్రం ఈ భారం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
భాష-2 (ఇంగ్లిష్‌): ప్రస్తుత ప్రపంచ అవసరాల దృష్ట్యా ఆంగ్లం వినియోగం పెరిగిపోవటంతో బోధనలో కూడా ఈ భాష పాత్ర అనివార్యంగా మారింది. అందుకే అటు టెట్‌లోనూ, ఇటు ఏపీ నియామక పరీక్షలోనూ ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యం! ఈ విభాగంలో గత టెట్‌లలో అత్యధిక అభ్యర్థులు తక్కువ మార్కులు సాధించారు. టెట్‌ 1, 2లలో 30 మార్కులు కేటాయించినా ఏపీ నియామక పరీక్షలో మాత్రం ఎస్‌జీటీలో 30 మార్కులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలో 15 మార్కులు కేటాయిస్తారని అంచనా. అందువల్ల ఎస్‌జీటీ అభ్యర్థులు బాగా కష్టపడాల్సిందే. స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు కొంత వెసులుబాటు కల్పించినా, పోటీ పరీక్ష అయినందున ప్రతి మార్కూ సాధించాలి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా వ్యాకరణాంశాలలో ప్రశ్నలు ఎక్కువ ఉంటున్నాయి.
* వాడుక ఇంగ్లిష్‌ పదాలు కాకుండా క్లిష్టమైన పదాలలో ప్రశ్నలుంటాయి.
* సన్నివేశ ఆధారిత వ్యతిరేకార్థాలు/సమానార్థాలపై ప్రశ్నలు లాంటి సవాళ్ళు గతంలో ఎదురయ్యాయి. అందువల్ల ఆ దిశగా సన్నద్ధతను మార్చుకోవాలి.
పెడగాజి: టెట్‌ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ విభాగంలో చక్కని, చిక్కని ప్రశ్నలు అడగటం వల్ల అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఏపీ నిర్వహించబోయే నియామక పరీక్షలో కూడా ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు. మొత్తం మీద పెడగాజిని 3 కోణాల్లో అధ్యయనం చేయాలి.
(1) మనో విజ్ఞానశాస్త్ర అనుసంధానంగా..
(2) భాషల అనుసంధానంగా...
(3) కంటెంట్‌ అనుసంధానంగా..
టెట్‌-1, 2లలో 150 ప్రశ్నలకు 34 ప్రశ్నలు ఆ ధోరణిలోనే అడిగారు.ఏపీ నిర్వహించే నియామక పరీక్షలో కూడా అంతకన్న ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పాఠశాల అనుభవ సంబంధిత ప్రశ్నలు, అనువర్తన సంబంధిత ప్రశ్నలు, స్థూల అవగాహన సంబంధిత ప్రశ్నలు, సాధారణ పాఠ్యపుస్తక సంబంధిత ప్రశ్నలు అనే రూపంలో పెడగాజి ప్రశ్నలు ఉంటున్నాయి. పాఠశాల బోధనలో ఎదురయ్యే సవాళ్ళు- వాటిని పరిష్కరించే దిశగా బోధనా మెలకువలు అభ్యర్థి గ్రహించారా లేదా అనే కోణంలో ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి 'బట్టీ' పట్టే గత ధోరణులను నుంచి బయటపడి, వాస్తవ దృక్కోణంలో అధ్యయనం చేసినట్లయితే మెరుగైన ఫలితాలు సాధ్యం.
కంటెంట్స్‌: సాంఘికశాస్త్రంలో భౌగోళిక వ్యవస్థ, చరిత్రలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సివిక్స్‌, ఎకనామిక్స్‌కి తక్కువ ప్రాధాన్యం ఉంది. అందువల్ల ప్రాధాన్యాలను బట్టి సన్నద్ధత సమయాన్ని వెచ్చించాలి.
బయోసైన్స్‌ అభ్యర్థులు గణితం, భౌతిక శాస్త్ర అంశాలకు భయపడ్తున్నారు. అయితే ఈ రెండు విభాగాలకు '20' మార్కులు ఉండొచ్చు. కాబట్టి ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ ప్రాధాన్య అంశాలను గుర్తించి ఇప్పట్నించే సిద్ధపడితే మెరుగైన ఫలితం సులభమే.
గణితం, భౌతికశాస్త్ర అభ్యర్థులు జీవశాస్త్ర అంశాలను సులభంగానే ఎదుర్కోవచ్చు. కాబట్టి ర్యాంకును మెరుగుపర్చుకోగోరే ధోరణిలో మరింత సమయం వెచ్చించాలి.
స్కూల్‌ అసిస్టెంట్‌ (భాషలు) 100 మార్కులిచ్చే సొంత భాషను 2వ భాషలో అనుసంధానించుకొని పెడగాజి విధానాన్ని అధ్యయనం చేయాలి. ఇలా సమయం కూడా ఆదా అవుతుంది.
గమనించండి
* గతంలో టెట్‌లో అర్హతా మార్కులతో గట్టెక్కి డీఎస్‌సీలో మార్కులు అధికంగా తెచ్చుకుని ఉద్యోగం సంపాదించారు. రేపటి నియామక పరీక్ష (ఏపీ)లో టెట్‌ సిలబస్‌, పరీక్షాంశాలే ప్రధానం కాబట్టి టెట్‌ అంశాల నుంచే వీలైనంత ఎక్కువ మార్కులు రాబట్టుకోవాలి. ఇలా పరీక్ష మార్కులు పెంచుకోవడమే కాక టెట్‌ ద్వారా లభించే 'వెయిటేజి'తో కూడా లాభం పొందవచ్చు.
* గతంలో టెట్‌-1లో 8వ తరగతి ప్రమాణస్థాయిగా పేర్కొన్నా కఠినత్వ స్థాయి 10వ తరగతి వరకు విస్తరించింది. అదేవిధంగా టెట్‌-2లో 10వ తరగతి ప్రవేశస్థాయికి పేర్కొన్న కఠినత్వ స్థాయి ఇంటర్‌ వరకు విస్తరించింది. అందువల్ల ఏపీ ఉద్యోగార్థులు గత టెట్‌ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే అర్హత- నియామక పరీక్షను కూడా అదే కఠినత్వస్థాయిలో ప్రిపేరవ్వాలి. తెలంగాణ అభ్యర్థులు కూడా టెట్‌ విడిగా ఉంటుందని భావించి సిద్ధపడితే మంచిది. భవిష్యత్‌లో ఏపీలో మాదిరిగా ఒకే పరీక్ష నిర్వహించినా ఇబ్బంది ఉండదు.
* మారిన పాఠ్యపుస్తకాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధపడాలి. 2012 సిలబస్‌ అంశాలే ఉంటాయని పేర్కొన్నప్పటికీ కొంత స్థాయిలోనైనా నూతన పుస్తకాల్లోని పాఠ్యాంశాలను అధ్యయనం చేయటం మంచిది. ఈ సంవత్సరం డీఎస్‌సీ వరకూ తెలంగాణ అభ్యర్థులు కూడా ప్రస్తుతం లభిస్తున్న పాఠ్యగ్రంథాల ఆధారంగానే చదవాలి.
సన్నద్ధతకు ప్రభుత్వ ప్రచురణలే ఆధారం
1. AP రాష్ట్ర సిలబస్‌ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు.
2. స్కూల్‌ అసిస్టెంట్స్‌ కొన్ని పాఠ్యాంశాన్ని ఇంటర్‌ స్థాయిలో అధ్యయనం చేయాలి.
3. NCERT - సైకాలజీ
4. తెలుగు అకాడమీ - D.Ed/ B.Ed ప్రచురణలు
5. తెలుగు అకాడమీ - బోధనా పద్ధతులు
6. NCF 2005, విద్యాహక్కు చట్టం: 2005
7. రాజీవ్‌ విద్యా మిషన్‌, హైదరాబాద్‌ ప్రచురణలు

కొడాలి భవానీ శంకర్
Published on 09/08/2014 03:16:29 PM