Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఎస్‌జీటీ : తెలుగు మెథ‌డాల‌జీ
తెలుగు బోధనలో మార్కుల సాధన!

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువులను ఆశించేవారు సన్నద్ధతలో నిమగ్నమైవున్నారు. భాషోపాధ్యాయ నియామక పరీక్షలో భాషాబోధన శాస్త్రం (తెలుగు) కీలకపాత్ర పోషిస్తుంది. ముందుగా సిలబస్‌ను ఆకళింపు చేసుకుని, ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ‘తెలుగు మెథడాలజీ’లో అధిక మార్కులు సాధించే మార్గాలు ఇవిగో!

తెలుగు మెథడాలజీలో గరిష్ఠ మార్కులు సాధించడానికి పటిష్ఠ ప్రణాళిక అవసరం. సిలబస్‌లో ఏ అంశాలుంటాయి? ఏ పుస్తకాలు దానికి దోహదపడతాయి? గత ప్రశ్నల సరళి ఏమిటి?... ఈ సందేహాల నివృత్తికి ముందుగా ‘సిలబస్‌’పై అవగాహన ఏర్పరచుకోవాలి.
స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు), భాషోపాధ్యాయులు (LP) ఇద్దరి మెథడాలజీ సిలబస్‌ను విశ్లేషిద్దాం.
1. భాష - వివిధ భావనలు: ఇది సుదీర్ఘ అధ్యాయం. ఈ అధ్యాయంలో అతిముఖ్యమైన అంశం- ప్రథమభాషగా తెలుగు బోధనోద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలతోపాటు కనీస అభ్యసన స్థాయులు, ద్వితీయ భాషగా తెలుగును ఎలా బోధించాలో చదవాల్సి ఉంటుంది. ఈ అధ్యాయం నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడగడం రివాజు.
ఉదా: 1. మ్యాక్స్‌ ముల్లర్‌ ప్రతిపాదించిన భాషావాదం 1) ధ్వన్యనుకరణ సిద్ధాంతం 2) ధాతుజన్య వాదం 3) డింగ్‌డాంగ్‌ వాదం 4) భగవద్దత్త వాదం జవాబు: 3
2. భాషానైపుణ్యాలు: ఈ అధ్యాయం పూర్తిగా అవగాహనకు సంబంధించింది. దీనిలో శ్రవణ, భాషణ, పఠన, లేఖనాలనే నాలుగు భాషా నైపుణ్యాలను ఆకళింపు చేసుకోవలసి ఉంటుంది. వీటి అంతర్గత సంబంధాలనూ ప్రత్యేక దృష్టి కోణంలో చూడాల్సి ఉంటుంది. ఈ అధ్యాయంలోని ‘భాషణం’లో భాగంగా వాగుత్పత్తి, వాగింద్రియ నిర్మాణం, వర్ణోచ్చారణ స్థానాలు- వాగ్దోషాలు, వాటి నివారణోపాయాలను లోతుగా చదవాల్సి ఉంటుంది.
3. ప్రణాళికా రచన-పాఠ్యగ్రంథాలు: ఈ అధ్యాయాన్ని రెండు విభాగాలుగా చదవాల్సి ఉంటుంది. మొదటి దానిలో ప్రణాళికల్లో రకాలైన విద్యాప్రణాళిక, మౌలిక విద్యా ప్రణాళిక, పాఠ్య (విషయ) ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్‌ ప్రణాళికతోపాటు పాఠ్యపథకాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుంది.
రెండో భాగంలో పాఠ్యపుస్తకాలైన ప్రధాన వాచకం- నిర్మాణ సూత్రాలు, పాఠ్యపుస్తకాల జాతీయీకరణ, ఉపవాచకం, కృషి పుస్తకం, ఆధ్యాత్మికదర్శిని మొదలైన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ అధ్యాయం నుంచి అన్వయ ప్రశ్నలకు అవకాశం తక్కువ.
4. విద్యా సాంకేతిక శాస్త్రం - సహపాఠ్య కార్యక్రమాలు: ఈ అధ్యాయాన్ని రెండు భాగాలుగా విభజించుకుని చదవాల్సి ఉంటుంది. మొదటి భాగం బోధనోపకరణాల్లో రకాలైన శ్రవ్య, దృశ్య, దృశ్య శ్రవ్య బోధనోపకరణాలను పరిశీలనాదృష్టితో చదవాలి. ఒక్కోసారి ఈ విభాగం నుంచి కఠిన ప్రశ్నలు అడుగుతుంటారు.
రెండో భాగమైన సహపాఠ్య కార్యక్రమాల్లో భాగంగా భాషాక్రీడలు, వక్తృత్వం- ఉక్తరచన, వ్యాసరచన, పత్రిక నిర్వహణ, భాషా విహారయాత్రలు, సారస్వత సంఘాలు, గ్రంథాలు, పఠనాలయాలు, పరామర్శ గ్రంథాలు, మూల గ్రంథాల గురించి స్థూలంగా చదవాలి.
5. సాహిత్య ప్రక్రియలు - బోధనాపద్ధతులు: మెథడాలజీలో కీలకమైన అధ్యాయం ఇది. అన్వయ ప్రశ్నలకు అవకాశమిచ్చే అధ్యాయం కూడా. విస్తృతమైనది. దీనిలో పద్య బోధన, గద్య బోధన, వ్యాకరణ బోధన, వ్యాస బోధన, ఉపవాచక బోధన, కథా బోధన, నాటక బోధనలతోపాటు ఆధునిక ధోరణులైన క్రీడ, కిండర్‌ గార్టెన్‌, మాంటిసోరి, ప్రాజెక్టు, డాల్టన్‌, కృత్యాధార, నాటకీకరణ పద్ధతులను అధ్యయనం చేయాల్సివుంటుంది. ఈ అధ్యాయాన్ని సూక్ష్మంగా చదివితే ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు. ఈ అధ్యాయంలోని మరో అంశం- బోధన నైపుణ్యాలు. ఇందులో భాగంగా కార్యక్రమయుత బోధన, బృంద బోధన, సూక్ష్మ బోధనలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వీటిపై ప్రశ్నలను అన్వయాత్మకంగా ఇవ్వటానికి అవకాశం ఉంది.
6. మూల్యాంకనం: ఒక పనిని చేసిన తర్వాత అది ఎంతవరకూ ఫలవంతమైందో తెలుసుకొనే అధ్యాయమిది. దీనిలో నికష, పరీక్ష, పరిగణన, మదింపు, మూల్యాకనం అనే భావనలు, వాటి తారతమ్యాల గురించి సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుంది.
నిరంతర సమగ్ర మూల్యాకనం (C-CE) లో భాగంగా నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రశ్నా రూపాలైన వ్యాసరూప, లఘూత్తర, అతి లఘూత్తర, లక్ష్యాత్మక ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది.
సన్నద్ధత ఎలా?
* గత డీఎస్‌సీ, టెట్‌ ప్రశ్నపత్రాల్లోని మెథడాలజీ ప్రశ్నల తీరుతెన్నులను ఆకళింపు చేసుకోవాలి.
* మొత్తం ఆరింటిలో 1, 5 అధ్యాయాలపై మరింత సాధన అవసరం.
* తెలుగు మెథడాలజీ అకాడమీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి.
* ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి.
* మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయాలి.
* మెథడాలజీ నుంచి 32 ప్రశ్నలు వస్తాయి. 16 మార్కులు. నోట్సును సిద్ధం చేసుకోవాలి.
* అనువర్తిత ప్రశ్నలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
* కంటెంట్‌తో అనుసంధానం చేసుకుంటూ మెథడాలజీని చదవాల్సి ఉంటుంది.
* పాఠ్యపుస్తక నిర్మాణ సూత్రాలను చదివేటప్పుడు ప్రస్తుత పాఠ్యపుస్తక ఇతివృత్తాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
* ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా ప్రమాణాలు, సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టిసారించాలి.
* నేడు మూల్యాంకనంలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుంది.
* తెలుగు మెథడాలజీలోని యూనిట్లను వేరుగా భావించక ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుని చదవాలి.
* ‘మాట్లాడేది తెలుగే కదా!’ అని తాత్సారం చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళితే విజయం తథ్యం!

- సూరె శ్రీనివాసులు

Posting on 18.11.2017