Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

సన్నద్ధత ఒకటే!

తెలంగాణ రాష్ట్రంలోని డీఈడీ, బీఈడీ అర్హత గల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. దాదాపు ఒకే ప్రిపరేషన్‌తో ఇటు ఈ పోస్టులకూ, అటు ఉపాధ్యాయ పోస్టులకూ పోటీపడే మంచి అవకాశం ఇది!

* హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు 310
తెలంగాణలోని బీసీ సంక్షేమశాఖలో 219, గిరిజన సంక్షేమశాఖలో 91 వసతి గృహాల సంక్షేమాధికారుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. మహిళా అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. బీసీ వెల్ఫేర్‌లో 66 పోస్టులు వీరికే కేటాయించారు. అభ్యర్థులు రెండు రకాల పోస్టులకూ విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలూ, పరీక్ష విధానం అన్నింటికీ ఒకటే. ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 6
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: మార్చి 6
* వెబ్‌సైట్‌: https://tspsc.gov.in
భోజన సదుపాయాలు, వసతి కల్పించే బాధ్యతతోపాటు, బోధన, అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులకు ఉంటుంది. గ్రేడు-1 అధికారిగా ఉద్యోగం పొందేవారు తక్కువకాలంలోనే అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ స్థాయికి చేరుకోగలరు. వసతిగృహాలన్నీ మండల కేంద్రాల్లో/ పెద్దపెద్ద పంచాయతీల్లో, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఉంటాయి. జీతభత్యాలు ఎస్‌జీటీ ఉపాధ్యాయుని కంటే ఎక్కువ.
రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో రెండు పేపరు తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో అడుగుతారు.
పేపర్‌-1కు ఎలా తయారవ్వాలి?
దీనిలో జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున 150 ప్రశ్నలు. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
13 అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయానికి సంబంధించిన వర్తమానాంశాలు; అంతర్జాతీయ సంబంధాలు, సమావేశాలు; జనరల్‌ సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారత ప్రతిభ; పర్యావరణాంశాలు, విపత్తు నిర్వహణ, తెలంగాణ ప్రాధాన్యాంశంగా భారతదేశ భోగోళికం; భారత రాజ్యాంగం, తెలంగాణ స్థానిక ప్రభుత్వాలు; తెలంగాణ సమాజం, నాగరికత, కళలు, సాహిత్యం, వారసత్వం; తెలంగాణ రాష్ట్ర విధివిధానాలు, భారత స్వాతంత్య్రోద్యమం ప్రాధాన్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర; తెలంగాణ రాష్ట్రోద్యమం ముఖ్యాంశంగా తెలంగాణ రాష్ట్ర చరిత్ర; లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, బేసిక్‌ ఇంగ్లిష్‌.
* ఇంగ్లిష్‌ అంశాల కోసం 10 వ తరగతి స్థాయి ఆంగ్ల వ్యాకరణం అభ్యసించి ప్రణాళిక ప్రకారం సాధన చేయాలి.
పేపరు-2 ఇదీ తీరు
పేపరు-2 గ్రేడు-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు డీఈడీ స్థాయి సిలబస్‌లోనూ, గ్రేడు-1 అధికారికి బీఈడీ స్థాయి సిలబస్‌లోనూ ప్రశ్నల స్థాయి ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఇప్పటికే సన్నద్ధత కొనసాగిస్తున్నవారికి ఈ సిలబస్‌ సులభం. ఇందులో 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
ప్రధానంగా 4 విభాగాలు చదవాలి. 1. విద్యా ఆధారాలు 2. విద్యా మనోవిజ్ఞానశాస్త్రం 3. విద్యా సాంఖ్యకశాస్త్రం 4. విద్యలో నూతన పోకడలు. విద్యా తత్త్వశాస్త్రంలో తాత్విక దృక్పథాలు, సామాజిక/సాంఘిక దృక్పథాలు, పాఠశాల-సమాజం; విద్యా మనోవిజ్ఞానంలో విద్య- మనోవిజ్ఞానశాస్త్రం, పెరుగుదల-వికాసం, అభ్యసనం, ప్రేరణ, బోధన, మూర్తిమత్వం-వైయక్తిక/ వ్యక్తిగత భేదాలు ప్రత్యేక విద్య; విద్యా సాంఖ్యకశాస్త్రంలో వివరణాత్మక సంఖ్యాశాస్త్రం, విద్యలో నూతన పోకడలు/ సమకాలీన అంశాల్లో సార్వత్రిక విద్య, పాఠశాల-కమ్యూనిటీ సంబంధాలు, నైతిక విద్య, జీవితకాల విద్య అధ్యయనం చేయాలి.
* గ్రేడ్‌-1 అధికారి పోస్టుకు రాసే అభ్యర్థులు పై వాటికి అదనంగా పాఠశాల నిర్వహణ, పరిపాలన అభ్యసించాలి. ఈ సిలబస్‌లోని అంశాలన్నీ తెలుగు అకాడమీ డీఈడీ, బీఈడీ పుస్తకాల్లో అవసరంమేరకు తయారవ్వాలి. )
* గ్రేడ్‌ -1 అధికారి ప్రశ్నపత్రం విశ్లేషణ, అన్వయం, నైపుణ్య స్థాయులను పరీక్షించేలా ఉండొచ్చు. గతంలో ఏపీపీఎస్‌సీ ఇదే ఉద్యోగాలకు నిర్వహించిన ప్రశ్నపత్రాల ప్రశ్నల సరళిని పరిశీలించి సన్నద్ధతను ప్రారంభిస్తే మేలు. )
* గత ప్రశ్నలను మాదిరిగా తీసుకొని అవగాహనకు వస్తే ప్రధాన విషయాలు, భావనలు అభ్యసించవచ్చు. )
* ఉపాధ్యాయ శిక్షణలో అధ్యయనం చేసిన ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీలను పరీక్షిస్తారు. )
* గతంలో వ్యాసరూప, సంక్షిప్త ప్రశ్నలకు రాసే సమాధానాలను ఇప్పుడు బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలోకి మార్చుకొని, బాగా సాధన చేయాలి. పునశ్చరణ ప్రధానం.
నిరంతర ప్రేరణ కలగజేసుకుని స్వీయ మూల్యాంకనంతో కృషి కొనసాగిస్తే హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగం మీ సొంతం!

- డాక్ట‌ర్ వి. బ్ర‌హ్మం

Posting on 18.11.2017