Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

కొలువుల నగారా
        డీఎస్‌సీ పరీక్షకు సంబంధించి ఉపాధ్యాయ నియామక మార్గదర్శక నిబంధనలనూ, ప్రకటననూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. టెట్‌ కమ్‌ టీఆర్‌టీ ద్వారా మునిసిపల్‌ ఉద్యోగాలతో కలిపి మొత్తం 10,313 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్షలు 2015 మే 9, 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలు పూర్తయ్యాయి కాబట్టి కొత్త పరీక్ష విధానం, సిలబస్‌ పరిమితులు మొదలైనవాటిపై అవగాహన పెంచుకోవాలి; విజయానికి బాటలు వేసుకోవాలి!
పరీక్ష నిర్మాణాంశాలను నిశితంగా పరిశీలిస్తే టెట్‌ సిలబస్‌ను యధాతథంగా తీసుకున్నట్టు గ్రహించవచ్చు. సిలబస్‌ అంశాల్లో పేర్కొన్న విభాగాల్లో పేర్లు కూడా యథాతథమే. అదనంగా జనరల్‌ నాలెడ్జ్‌ను 10 మార్కులకు చేర్చారు. 'భాష' పేపర్లలో 10 మార్కులు, పరిసరాల విజ్ఞానంలో మరో 10 మార్కులు అదనంగా కలపడం ద్వారా టెట్‌ గరిష్ఠ మార్కులు 150ను ఈ పరీక్షలో 180కు పెంచారు. ఫలితంగా అటు 'అర్హత'నూ పరీక్షిస్తున్నట్టు; ఇటు నియామక పరీక్షనూ నిర్వహిస్తున్నట్టు!
సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ నియామకాలకు డీఈడీనే ప్రామాణికంగా తీసుకున్నందువల్ల పోటీ తీవ్రంగా ఉండదు అనేది సత్యమే కావచ్చు. కానీ అర్హత మార్కులు పొందాలనే విషయాన్ని మరచిపోవద్దు. అందువల్ల శాస్త్రీయంగా చదివితే ఉద్యోగం పొందటమే కాకుండా సీనియారిటీలో కూడా ముందుంటారు!
జీకే, వర్తమానాంశాలు: టెట్‌ సిలబస్‌కు అదనంగా ఈ విభాగాన్నే పేర్కొన్నారు. అయితే 10 మార్కులకే పరిమితం చేశారు. అందువల్ల గతంలో చదివినంత లోతుగా, విస్తృతంగా చదవాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి మార్కూ విలువైనదే కాబట్టి జాగ్రత్తలతో అభ్యాసం చేయాలి. పరీక్ష మే 2015లో కాబట్టి 2014 నవంబర్‌ నుంచి వర్తమానాంశాలు క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తే సరిపోతుంది. 5 ప్రశ్నల వరకూ జీకే కింద అడిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ స్థాయి కలిగిన జీకే పుస్తకం చదివితే మిగతా 5 ప్రశ్నలు కూడా ఎదుర్కొనవచ్చు.
భాష-1, 2: గత టెట్‌ పరీక్షల్లో అభ్యర్థులకు మింగుడుపడని విభాగాలు ఈ రెండే. పైగా ఈ పరీక్షలో వీటి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఒక్క భాషా విభాగంలో మరో 5 ప్రశ్నలు అదనంగా పెంచడంలో ఈ భాషల పాత్ర ఉద్యోగం పొందడంలో కీలకంగా మారింది. పైగా పెడగాజి కింద భాషల భావనకు సంబంధించిన బోధన పద్ధతులు, ఇతర ప్రభావిత అంశాలను అధ్యయనం చేయడం కూడా విజయాన్ని నిర్ణయించేవే. టెట్‌ పరీక్షకు నిర్దేశించిన రీతిలో పెడగాజి విభాగం నుంచి తప్పనిసరిగా ప్రశ్నల సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు కానీ తగ్గే అవకాశం లేదు. అందువల్ల అభ్యర్థులు భాషలను గత టెట్‌ ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రమాణాలు నిర్దేశించుకుని చదవడం తప్పనిసరి.
* సాహిత్య, వ్యాకరణ అంశాలు పాఠ్యపుస్తకాల ఆధారంగా అధ్యయనం చేయాలి. అంటే సాధారణ అధ్యయనం సరిపోదు.
* సన్నివేశ ఆధారిత సమానార్థాలు/ వ్యతిరేకార్థాలు/ ఇతర భాషాంశాలపై గత టెట్‌లో వచ్చాయి. అదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది.
* ముఖ్యంగా తెలుగు భాష ప్రశ్నలే... ఇంగ్లిష్‌ భాష ప్రశ్నల కంటే ఎక్కువ కఠినంగా ఉంటున్నాయి. అందుకు అనుగుణంగా సన్నద్ధతను సానబెట్టుకోవాలి.
శిశువికాసం- పెడగాజి: టెట్‌లో మాదిరిగానే 30 ప్రశ్నలకు ఈ విభాగాన్ని పరిమితం చేశారు. ఎన్‌సీటీఈ ప్రమాణాల్ని పాటించాలి కాబట్టి ఈ విభాగం టెట్‌లో మాదిరిగానే కఠినమైన ప్రశ్నలు ఉండవచ్చు. అభ్యర్థి భావన వికాసం (కాన్సెప్చువల్‌ ఫార్మేషన్‌) పరిశీలించే విధంగానే ప్రశ్నలుంటాయి. డీఎడ్‌లోని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రామాణికంగా తీసుకోవాలే తప్ప పాఠ్యపుస్తకంలో అంశాలు యథాతథంగా ప్రశ్నలుగా వస్తాయని భావించలేం. సైద్ధాంతిక కోణం కంటే అన్వయకోణం ప్రధానం. సమగ్ర సమాచారం పరిశీలించేలా ప్రశ్నలు అధికంగా ఉండే అవకాశం ఉంది.
గణితం: టెట్‌లో మాదిరిగానే ఈ విభాగాన్ని కూడా 30 మార్కులకే పరిమితం చేశారు. 1- 8 తరగతుల గణిత పాఠ్యాంశాలను అధ్యయనం చేయడం కొద్దిగా ఇబ్బందే. గత టెట్‌లలో అనుసరించిన పద్ధతిలోనే ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి ఆయా తరగతులు పుస్తకాల ఆధారంగా సానబెట్టుకోవడం మంచిది.
పరిసరాల విజ్ఞానం: టెట్‌లో 30 మార్కులకే పరిమితమైన ఈ విభాగం ఈ పరీక్షలో 40 మార్కులకు పెంచారు. అందువల్ల పాఠశాలస్థాయి పరిసరాల విజ్ఞానం కీలకం. ముఖ్యంగా సాంఘికశాస్త్ర సంబంధిత పరిసరాల విజ్ఞానంలో సరైన సమాధానాల్ని అభ్యర్థులు గుర్తించలేకపోతున్నారు. సైన్స్‌ సంబంధిత పరిసరాల జ్ఞానాన్ని ఒక మాదిరి సన్నద్ధతలో కూడా ఎదుర్కొనవచ్చు. ఈ రెండు విభాగాలకు పాఠశాల పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని చదివితే అధిక ప్రయోజనం.
పెడగాజి: బోధనా పద్ధతులు, బోధన సంబంధిత ప్రక్రియలు, పరిసర సంబంధిత అంశాల నేపథ్యంలో ఈ విభాగంలో పరీక్షిస్తారు. కేవలం బోధనా పద్ధతులకే పరిమితమై సన్నద్ధమవటం నష్టదాయకం. శిశువికాసం, భాషలతో, కంటెంట్‌లతో అంతర్లీనంగా పెడగాజికి సంబంధం ఉంటుంది. అందువల్ల దీన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయాలి. రెండు భాషల పెడగాజిని అనుసంధానం చేసుకుని చదివితే సన్నద్ధత సులభమవుతుంది. అలాగే గణితం, పరిసర విజ్ఞానం పెడగాజి సంబంధిత అంశాలను అనుసంధానించవచ్చు. ఈ విధంగా కొన్ని మెలకువలు పాటిస్తే మొత్తం పరీక్షతో ముడిపడిన ఈ విభాగాన్ని తేలికగా ఎదుర్కోవచ్చు.
భాషా పండితులు
జనరల్‌ నాలెడ్జ్‌, శిశువికాసం విభాగాలకు ఎస్‌జీటీలో మాదిరిగానే 10, 30 మార్కులు కేటాయించారు. బోధించే భాషకు 70 మార్కులకు, ఇంగ్లిష్‌ భాషకు 30 మార్కులు కేటాయించారు. గణితం, సైన్స్‌/ సాంఘికశాస్త్రాన్ని మరో 60 మార్కుల కోసం ఎంపిక చేసుకోవాలి.
ఇవి గమనించండి!
* గతంలో జరిగిన టెట్‌ పరీక్షల మార్కులకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్‌ కమ్‌ టెర్ట్‌ పరీక్షను ప్రతి అభ్యర్థీ రాయాల్సిందే. ప్రస్తుత పరీక్ష, గత టెట్‌లలో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే ర్యాంకుకు పరిగణిస్తారు.
* ఈ ఉద్యోగ నియామకాల కోసం కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు. గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు. 1.07.2014 నాటికి పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, వికలాంగులకు 50 సంవత్సరాల వరకూ అవకాశం ఉంటుంది.
* నిర్దేశిత విద్యార్హతలు 17.01.2015 నాటికి కలిగి ఉండాలి. తర్వాత వీటిని పొందినప్పటికీ ఈ అర్హత, నియామక పరీక్ష ద్వారా ఉద్యోగం పొందడానికి అర్హులు కారు.
* ఎన్‌సీటీఈ ప్రమాణాలు, నిర్దేశాలు తప్పనిసరిగా పాటిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించినందువల్ల పరీక్షపత్రం ప్రమాణాలు కచ్చితంగా సగటుస్థాయికి పైన ఉండే అవకాశం ఉంది. ఇందుకు గత టెట్‌ ప్రశ్నపత్రాలే సాక్ష్యం.
* గత టెట్‌లలో మాదిరిగానే ఈ పరీక్షలో కూడా అర్హత మార్కులను నిర్ణయించారు. ఓసీలకు 60%, బీసీలకు 50% ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌లకు 40% మార్కుల్ని కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.
* సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పరీక్షకు 180 మార్కులనూ, స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షకు 200 మార్కులనూ గరిష్ఠంగా నిర్ణయించారు.
* అభ్యర్థి గతంలో సాధించిన టెట్‌ స్కోరులో 20% మార్కుల్ని డీఎస్‌సీకి వెయిటేజీగా కలుపుతారు. అదేవిధంగా ప్రస్తుత పరీక్షలో సాధించిన మార్కులకు 20% వెయిటేజీ కలుపుతారు. ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ వెయిటేజీకి అవకాశం ఉంటే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
* పదో తరగతి, తత్సమాన అర్హత కలిగిన పరీక్షను ఏ భాషలో రాస్తే ఉత్తీర్ణులయ్యారో ఆ మీడియం పోస్టుల ఎంపికలో ప్రామాణికంగా తీసుకుంటారు.
* స్కూలు అసిస్టెంట్‌ ఇంగ్లిష్‌ మీడియం పోస్టులు పొందాలంటే టెన్త్‌, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ తప్పనిసరిగా ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివి ఉండాలి. ఏ ఒక్క స్థాయిలో చదివి ఉండకపోయినా తెలుగు మాధ్యమం పోస్టులనే పరిగణిస్తారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీలలో మొదటిభాషగా చదివిన భాషను కూడా ప్రామాణికంగా తీసుకుని పోస్టుల కేటాయింపు ఉంటుంది.
* స్పెషల్‌ డీఈడీ చదివినవారు కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హులే. అదేవిధంగా స్పెషల్‌ బీఈడీ చదివినవారు కూడా స్కూలు అసిస్టెంట్‌ పోస్టులకు అర్హులే. అయితే ప్రభుత్వం విధించే షరతుల మేరకు నియామకాలు ఉంటాయి.
* కొత్త పాఠ్యపుస్తకాలు చదవాలా? వద్దా? అనే మీమాంస విడిచిపెట్టి, ఎన్‌సీటీఈ ప్రమాణాలు ప్రశ్నపత్రంలో ఉండే అవకాశం ఉన్నందువల్ల తప్పనిసరిగా చదవడం మంచిదే.
* శిక్షణ కేంద్రాల నోట్సును బట్టీపట్టి ఆశలు పెంచుకోవద్దు. ముఖ్యంగా స్కూలు అసిస్టెంట్లకు పరిమితంగా పోస్టులు ఉన్నందువల్ల పాఠశాల పుస్తకాలు, ప్రభుత్వ ప్రచురణలు చదివి అవగాహన పెంచుకుంటే ఎంపికే కాదు, ర్యాంకు కూడా మరింత మెరుగుపడుతుంది.
స్కూలు అసిస్టెంట్లు
స్కూలు అసిస్టెంట్‌ గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, సోషల్‌స్డడీస్‌ అభ్యర్థులకు 4 విభాగాలు ఒకేరకంగా ఉన్నాయి.
ఈ నాలుగు విభాగాలే కాకుండా అదనంగా వారి సంబంధిత సబ్జెక్టుకు ఈ పరీక్షలో ప్రాధాన్యం ఇలా ఉంది...
స్కూలు అసిస్టెంట్‌ (భాషలు)
మిగతా స్కూలు అసిస్టెంట్‌ పరీక్షలకు మాదిరిగానే జనరల్‌ నాలెడ్జ్‌, శిశువికాసం విభాగాలకు 10, 30 మార్కులు కేటాయించారు. ఏ భాష స్కూలు అసిస్టెంట్‌ అయినా మరో భాషను కూడా అధ్యయనం చేయాలి. వారు బోధించే ప్రధాన భాషకు 70 మార్కులు, రెండో భాషకు 30 మార్కులు కేటాయించారు. వీటితోపాటు గణితం, సైన్స్‌/ సాంఘిక శాస్త్రాల్లో ఏదో ఒక విభాగాన్ని ఉన్నత పాఠశాల స్థాయిలో తయారవాలి. ఈ విభాగం కోసం 60 మార్కులు కేటాయించారు. ఈ మూడు విభాగాల్లో దేన్ని ఎంపిక చేసుకోవాలనే ఇబ్బంది చాలామంది అభ్యర్థుల్లో ఉంది. నిజానికి గ్రాడ్యుయేషన్‌తో ముడిపడిన సబ్జెక్టును ఎంచుకోవడం సరైన నిర్ణయం. అవకాశం ఉన్న కొంతమంది అభ్యర్థులు సులభంగా ఉంటుందని సాంఘికశాస్త్రాన్ని ఎంపిక చేసుకుంటారు. ఈ భావన సరైనదే కాబట్టి అభ్యర్థులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంది.
* గతంలో జరిగిన టెట్‌-2లతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు ఒక చిన్న ఉపశమనం దొరికింది. గతంలో స్కూలు అసిస్టెంట్‌ అర్హత కాగోరే అభ్యర్థి టెట్‌-2లో గణితం/ భౌతికశాస్త్రం/ జీవశాస్త్రాలకు సమస్థాయిలో తయారవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత పరీక్షలో బోధించే సబ్జెక్టుకు 70 మార్కులు కేటాయించడం, మిగతా రెండు విభాగాలకు కలిపి 30 మార్కులను కేటాయించడం వల్ల తమ ప్రధాన సబ్జెక్టు ద్వారా ర్యాంకును మెరుగుపరచుకునే అవకాశం బాగా పెరిగింది. అందువల్ల మిగతా రెండు సబ్జెక్టులను కూడా పరిగణిస్తూనే ప్రధాన సబ్జెక్టుపై అధికంగా దృష్టిపెట్టే వ్యూహాన్ని అనుసరించాలి.
* స్కూలు అసిస్టెంటు అభ్యర్థులు కేవలం పదోతరగతి వరకున్న పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా కొన్ని కీలక పాఠ్యాంశాలను ఇంటర్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇది తప్పనిసరి. మరింత మార్గదర్శకత్వం కోసం గత టెట్‌-2 ప్రశ్నపత్రాలు పరిశీలించవచ్చు.
* బీఈడీ స్థాయి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం శిశువికాసం కోసం కొంతవరకూ ఉపయోగపడుతుంది. అయితే పుస్తకంలోని సిలబస్‌ మొత్తం చూడకుండా పరీక్షకు ఉపయోగపడే అంశాల వరకే పరిమితమై చదవడం వల్ల శ్రమ తక్కువ; ఫలితం అధికం. పెడగాజి సంబంధిత అంశాల కోసం ఏపీ ప్రభుత్వ మెథడాలజీ పుస్తకాలు అధ్యయనం చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ సైకాలజీ పుస్తకం చదవడం మరింత ప్రయోజనం.
* ప్రస్తుత పరీక్ష నిర్మాణాంశాలను పరిశీలిస్తే మెరుగైన అభ్యర్థులు అందరూ కంటెంట్‌ విభాగంలో ఒకే స్థాయిలో మార్కులు సాధించే అవకాశం ఉంది. కానీ ర్యాంకింగ్‌ విషయంలో భాషలు కీలకపాత్ర పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు ఇంగ్లిష్‌ భాషను సరైన రీతిలో అధ్యయనం చేయకపోతే ఫలితం నిరాశజనకంగా ఉంటుంది. అందుకని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
* గత డీఎస్‌సీ ప్రశ్నపత్రాలను చూసి మెథడాలజీ ప్రశ్నలు నేరుగా ఉంటాయని భావించవద్దు. అదేస్థాయిలో తయారవొద్దు. ఎన్‌సీటీఈ ప్రమాణాలు పాటిస్తే టెట్‌లలో మాదిరే లోతైన, వాస్తవమైన, అన్వయ సంబంధిత ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ. ఆ దిశలో తయారవ్వాలి. 2012 డీఎస్‌సీలోనే ఈ మార్పు వచ్చిందని గుర్తించి అందుకు అనుగుణంగా అధ్యయనంలో మార్పులు తెచ్చుకోవాలి.

కొడాలి భవానీ శంకర్