Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

30 మార్కులకు మెరుగైన సన్నద్ధత
         ఏపీ టెట్ కమ్ టీఆర్‌టీ -2014లో ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్స్‌, లాంగ్వేజ్‌ పండిట్లకు శిశువికాసం - అధ్యాపనశాస్త్రానికి 30 మార్కులు కేటాయించారు. దీని సన్నద్ధతకు ఉపకరించే అంశాలు పరిశీలిద్దామా?
టెట్‌ సిలబస్‌లోని శిశువికాసం - అధ్యాపనశాస్త్రం (చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ) విభాగాన్ని తాజా టెట్ కమ్ టీఆర్‌టీ లో యథావిధిగా ఏ మాత్రం మార్పు లేకుండా అలానే చేర్చారు. సిలబస్‌ మొత్తాన్ని 3 భాగాలుగా వర్గీకరించారు. 1) శిశువికాసం 2) అభ్యసన అవగాహన 3) బోధనాశాస్త్ర సంబంధమైన అంశాలు శిశువికాసం, అభ్యసన అవగాహన విభాగాల్లోని అంశాలు ఎక్కువ భాగం డీఈడీ, బీఈడీ - విద్యామనోవిజ్ఞాన శాస్త్రంలోని పాఠ్యాంశాలే. టెట్ కమ్ టీఆర్‌టీ సిలబస్‌ ఆధారంగా అదనంగా ఉన్న అంశాలను ప్రామాణిక పుస్తకాల ఆధారంగా అభ్యసించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు... పెరుగుదల- వికాసం అనే అధ్యాయంలో ఛామ్‌స్కీ వికాస సిద్ధాంతం, కార్ల్‌ రోజర్స్‌ ఆత్మభావనా సిద్ధాంతం; అభ్యసన సిద్ధాంతాల్లో వైగాట్‌స్కీ నిర్మాణాత్మక దృక్పథం, కోఫ్కా గెస్టాల్ట్‌ సిద్ధాంతం మొదలైనవి ప్రత్యేక దృష్టితో అభ్యసించి సాధన చేయాల్సి ఉంది.
బోధనాశాస్త్ర సంబంధమైన అంశాల్లో చేర్చిన ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, సహిత (లేక) సమ్మిళిత విద్య, వైయక్తిక, సామూహిక అభ్యసనం మొదలైన అంశాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాల నుంచే సంగ్రహించవచ్చు.
నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఎన్‌సీఎఫ్‌- 2005, ఆర్‌టీఈ- 2009 మొదలైన నూతన విద్యా విషయాలను ఉపాధ్యాయ శిక్షణల కోసం ప్రత్యేకమైన మెటీరియల్‌ రాష్ట్రప్రభుత్వం ముద్రించింది. దాన్ని అనుసరిస్తే సమగ్ర సమాచారం పొందవచ్చు. అభ్యర్థులు నిర్ణీత సిలబస్‌ మేరకు పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి. కేవలం డీఈడీ, బీఈడీ సిలబస్‌లోని విద్యా మనోవిజ్ఞానశాస్త్రం, బోధన పద్ధతులు (టీచింగ్‌ మెథడ్స్‌)పై మాత్రమే ఆధారపడకుండా విస్తృతంగా అభ్యసించాల్సి ఉంటుంది.
సన్నద్ధత ఎలా ఉండాలి?
శిశువికాసం అనే అధ్యాయంలో వికాస సూత్రాలు లేదా వికాస నియమాలు, వికాసం- వివిధ దశలు, శారీరక పెరుగుదల నియమాలు, భాషా వికాసంలో నోమ్‌ ఛామ్‌స్కీ సిద్ధాంతం ప్రతిపాదనలు, పియాజె- సంజ్ఞానాత్మక వికాసం- వికాస దశలు, కార్ల్‌ రోజర్స్‌- వ్యక్తి కేంద్రక సిద్ధాంతం, కోల్‌బర్గ్‌ నైతిక వికాసం- దశలు అనే అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. వైయక్తిక భేదాలు- భావన; ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞామాపనం- విభాజన, వివిధ ప్రజ్ఞా పరీక్షలు, సృజనాత్మకత; మూర్తిమత్వ సిద్ధాంతాలు; సంఘర్షణలు, రక్షక తంత్రాలు, మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు, విశ్లేషణతో పరీక్ష అంశాల దృష్ట్యా అభ్యసించాలి. శిశువికాస అధ్యయన పద్ధతుల్లో అంతః పరిశీలన, ప్రయోగ పద్ధతి భావనలను నేర్చుకోవాల్సి ఉంటుంది. అభ్యసనం- అవగాహన అనే అధ్యాయంలో అభ్యసన లక్షణాలు, అభ్యసన సిద్ధాంతాలు- అనువర్తనాలు, అభ్యసన బదలాయింపు, స్మృతి - రకాలు, విస్మృతికి గల కారణాలు ప్రధానం.
చివరగా పెడగాజీలోని కొన్ని అంశాలు మాత్రమే విద్యార్థులు బీఈడీ/ డీఈడీ కోర్సులో భాగంగా బోధన పద్ధతులలో అధ్యయనం చేసుంటారు. అందువల్ల నిర్ణీత సిలబస్‌ ప్రకారం సహిత విద్య, బోధనా పద్ధతులు, బోధనలోని దశలు, తరగతి నిర్వహణ, సామూహిక గతిశీలత, మార్గదర్శకత్వం, మూల్యాంకనం- సీసీఈ, ఎన్‌సీఎఫ్‌- 2005, ఆర్‌టీఈ- 2009 ప్రధాన అంశాలుగా అభ్యసించి సాధన చేయాలి.
ఇవి పాటించాలి
* గత టెట్‌, డీఎస్‌సీకి సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించడం.
* పరీక్షల్లో ప్రశ్నలడిగే భావనలను గుర్తించడం.
* అర్థవంతంగా అవగాహనపరచుకోవడం.
* కేవలం జ్ఞానానికి చెందిన ప్రశ్నలనేకాక అవగాహన, అనుప్రయుక్తానికి చెందిన సమస్యలకు కూడా జవాబిచ్చేవిధంగా సన్నద్ధత ఉండాలి.
* నమూనా ప్రశ్నలను అధ్యాయాల వారీగా అభ్యాసం చేయడం.
* సిలబస్‌ చదవడం పూర్తయిన తర్వాత మాదిరి పరీక్షలు రాయడం.
* ఆ పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం.
ఇటీవల పోటీ పరీక్షల్లో (టెట్, డీఎస్‌సీ) వచ్చిన ప్రశ్నల సరళిని పరిశీలిస్తే ఏం తెలుస్తుంది? శిశువికాసం- అధ్యాపన శాస్త్రంలోని ప్రశ్నలు పాఠ్యపుస్తకంలోని వాక్యాలను నేరుగా ప్రశ్నల రూపంలో అడిగిన సందర్భాలు తక్కువ. కాబట్టి అభ్యర్థులు మొదట ప్రాథమిక అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి. తరువాత పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా, సరైన ప్రణాళిక, సమయపాలనతో చదవడం అవసరం. సొంతంగా నోట్సు తయారుచేసుకోవడం వల్ల పరీక్షల ముందు సమయం ఆదా అవడం, ఒత్తిడి తగ్గడం జరిగి, పునశ్చరణ సులభమవుతుంది. ప్రధానంగా అవగాహన, అనుప్రయుక్త ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంలో నిరంతర సాధన తప్పనిసరి. అప్పుడే విజయం సొంతమవుతుంది!
మాదిరి ప్రశ్నలు
* జెడ్‌ పీ డీ- జోన్‌ ఆఫ్‌ ప్రాక్సిమల్‌ డెవలప్‌మెంట్‌ (సామీప్య వికాస మండలం) భావన ఎవరిది?
1. బ్రూనర్‌ 2. ఛామ్‌స్కీ 3. వైగోట్‌స్కీ 4. పియాజె
జవాబు: 3
* గవర్నమెంట్‌ బైండింగ్‌ థియరీ అని ఎవరి సిద్ధాంతాన్ని పిలుస్తాం?
1. స్కిన్నర్‌ 2. ఛామ్‌స్కీ 3. పియాజె 4. కోఫ్కా
జవాబు: 2
* వ్యక్తి అవసరాలే గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశిస్తాయని, దానివల్లనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందనేది ఎవరి ముఖ్య భావన?
1. గాల్టన్‌ 2. వాట్సన్‌ 3. కార్ల్‌రోజర్స్‌ 4. పియాజె
జవాబు: 3
రెఫరెన్స్‌ పుస్తకాలు
1. డీఈడీ, బీఈడీ, తెలుగు అకాడమీ విద్యా మనోవిజ్ఞానశాస్త్రం పుస్తకాలు
2. ఎన్‌సీఈఆర్‌టీ 10+ 2 సైకాలజీ పాఠ్యపుస్తకాలు
3. ఎన్‌సీఎఫ్‌- 2005, ఆర్‌టీఈ- 2009, సీసీఈ ఇన్‌సర్వీస్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ మాడ్యూల్స్‌ మొదలైనవి.

------- డా.వి.బ్రహ్మం