Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

వ్యాకరణ సాహిత్యాంశాలకే పెద్దపీట!
         ఏ ఉపాధ్యాయ ఉద్యోగానికైనా తెలుగు భాషా సాహిత్యాలు తప్పనిసరి చేశారు. తెలుగు పండితులకు డెబ్బై మార్కులుంటే మిగిలినవారికి ముప్పై మార్కులే. మార్కులు తక్కువే కానీ పాఠ్యాంశాలు దాదాపుగా ఒకటే. వ్యాకరణం, సాహిత్యాంశాలే ఉపాధ్యాయ పరీక్షకు కీలకం. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు డా. ద్వా.నా. శాస్త్రి.
తెలుగు పాఠ్యప్రణాళిక చూసి నిరాశ చెందడమో, అధైర్యపడడమో సమంజసం కాదు. నిజానికి పాఠ్యాంశాల్లోని సగానికి పైగా ఇంతకుముందు ప్రతి అభ్యర్థీ చదివినవే! వాటితో పనిలేదు కాబట్టి మరచిపోవడం సహజం. బాగా అధ్యయనం చేస్తే 'ఇంతేనా?!' అనిపిస్తుంది.
తెలుగు అంటే సాహిత్యమే! సాహిత్యంలో కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం అనేవి భాగాలు. వీటిల్లో మరీ ముఖ్యమైనది కవిత్వం. అందుకే- కవులు- రచయితలు- కావ్యాలు- రచనలు అనే అధ్యాయం విస్తృతంగా ఉంది. ఏయే అంశాలపై దృష్టి ఉంచాలో సిలబస్‌లోనే ఇచ్చారు- 'పాత్రలు, నేపథ్యం, పూర్వాపరాలు, ఇతివృత్తాలు, సందర్భ వాక్యాలు, విశేషాలు'. అయితే అధ్యయనం చేసేటపుడు మరింతగా వింగడించుకుని లోతుగా చదవాలి.
ఉదాహరణకు 'కవులు' అన్నారు. ఏ కవులు? ఎంతమంది? అనే సందేహం వస్తుంది. సామాన్యంగా ప్రసిద్ధ కవులనే చదవాలి కానీ ఎక్కువ మార్కులు రావాలంటే అంతగా ప్రసిద్ధికెక్కని వారినీ తెలుసుకోవాలి.
ఇతివృత్తం అంటే కథ. కథల పేర్లు, అందులోగల ముఖ్య పాత్రలు తెలుసుకోవాలి.
* నిగమశర్మ కథ ఎందులోది?
1. మనుచరిత్ర 2. వసుచరిత్ర 3. పాండురంగ మాహాత్మ్యం 4. పారిజాతాపహరణం
జవాబు: 3
కవుల కవిత్వంలో ముఖ్యమైన, ప్రసిద్ధమైన పంక్తులుంటాయి. వాటినే 'సందర్భ వాక్యాలు' అంటారు.
ఉదా: 'కాదేదీ కవితకనర్హం' అన్న కవి? (శ్రీశ్రీ)
విశేషాంశాలు అనే అంశంలో కవుల వివరాలు తెలుసుకోవాలి. కవి అనగానే జన్మస్థలం, ఆస్థాన పదవి, కాలం, బిరుదులు, తొలి రచన, మిగిలిన రచనలు, కవితా గుణాలు చదవాలి. ఈ విధంగా ఒక్కో కవి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే మరొక కవిని చదవాలి. ఈ వివరాలు ప్రాచీన కవులకు ఎక్కువ. ఆధునిక కవుల గురించి అంతగా తెలుసుకోనవసరం ఉండదు.
పాఠాల పరిచయ వాక్యాలు
ప్రక్రియలు అనే అధ్యాయంలోని అంశాల్లో చాలావరకు కవులలో వచ్చేస్తాయి. కథ, నవల, నాటకం, వ్యాసం వంటి వాటిపై శ్రద్ధ వహించాలి. 8, 9, 10 తెలుగు వాచకాల్లోని పాఠాలు ఈ ప్రక్రియలతోనే ఉంటాయి. అందుకని ఆ పాఠాల పరిచయ వాక్యాలు చదివితే చాలు.
ఆధునిక కవిత్వ ఉద్యమాల గురించి అవగాహన ఉండాలి. పైన పేర్కొన్న ఆధునిక కవులలోకి ఈ ఉద్యమ కవులు వస్తారు. ఏ ఉద్యమం గురించి చదివినా ఉద్యమ ఆశయాలు- నాయకుడు- కావ్యాలు- సందర్భ వాక్యాలు అనేవిధంగా తెలుసుకోవాలి.
* భావకవిత్వం అనగానే ప్రేమ- ప్రకృతి, స్వేచ్ఛ, ఆత్మాశ్రయత్వం వంటివి తెలుసుకుని రాయప్రోలు నాయకుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రచారకుడని తెలుసుకోవాలి.
'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' (కృష్ణశాస్త్రి) వంటి ఉక్తులు చాలా ముఖ్యం.
భాషపై నాలుగు అధ్యాయాలున్నాయి. అయితే అన్నింటిని లోతుగా, విస్తారంగా తెలుసుకోనక్కర్లేదు. తెలుగులోని పారశీ, తమిళ, కన్నడ, మరాఠీ పదాలు ముఖ్యం. మాండలిక పదాల గురించి తెలుసుకోవాలి. ఒకే పదం ఏ ప్రాంతంలో ఎలా వాడుకలో ఉందో గ్రహించాలి.
* బేడ- కోస్తాలో ఒకనాటి నాణెం- రూపాయిలో ఎనిమిదో వంతు; రాయలసీమలో పప్పు అని అర్థం- కంది బేడ అంటారు.
* 'పుంటికూర' అనేది గోంగూరకు బదులుగా ఏ మాండలికంలో కనిపిస్తుంది? (తెలంగాణ)
'సాహిత్య విమర్శ' అనే అధ్యాయం తెలుగు పండితులకు చాలా అవసరం. మిగిలినవారు అవగాహన కోసం చదివితే చాలు. 'కావ్య నిర్వచనాల'పై ప్రశ్నలు రావచ్చు.
అతి ముఖ్యం.. వ్యాకరణం
ఇక కంటెంట్‌లో సాహిత్యం తరువాత వ్యాకరణం అతి ముఖ్యమైనది. సంధులు, సమాసాలు, ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు, ప్రకృతి- వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యాకరణ పరిభాష అనేవి క్షుణ్ణంగా చదవాల్సినవే. అందరూ లోగడ వీటిని చదివినవారే. అయితే అప్పుడు చదివే పద్ధతీ, ప్రశ్నలు అడిగే పద్ధతీ వేరు. ఇప్పుడు 'ఆబ్జెక్టివ్‌ పద్ధతి' కాబట్టి నిశితంగా చర్చించుకుంటూ అధ్యయనం చేయాలి. వ్యాకరణానికి అధ్యయనం ఒక్కటే చాలదు. గణిత శాస్త్రంలా అభ్యాసం చాలా ముఖ్యం. 'అభ్యాసం కూసు విద్య' అన్నారు కదా!
ఇక ప్రశ్నలడిగే పద్ధతి చూడండి:
* స్వాగతం విడదీయండి
1. స్వ+ ఆగతం 2. స+వాగతము 3. సుః+ఆగతం 4. సు+ఆగతం
జవాబు: (4)
* గోరంతలు కొండంతలుగా చెప్పడాన్ని ఏ అలంకారమంటారు?
2. అతిశయోక్తి 2. శ్లేష 3. విశేషోక్తి 4. ఉత్ప్రేక్ష
జవాబు: (1)
* పద్మమునకు పర్యాయపదం?
3. అంబుజం 2. పంకజం 3. రెండూ 4. రెండూ కావు
జవాబు: (3)
ఈవిధంగా తిరగేసి కొన్ని, అయినది అంటూ కొన్ని, కానిదంటూ మరికొన్ని ప్రశ్నలు వస్తాయి. అందువల్ల వ్యాకరణం అంతా చదవాలి తప్ప ముఖ్యమైనవి అనే ఆలోచన ఉండకూడదు.
అనువాదం ఆంగ్లం నుంచి తెలుగులోకి గానీ, తెలుగు నుంచి ఆంగ్లానికి గానీ అడగవచ్చు. అనువాద పద్ధతుల గురించి స్థూలంగా తెలుసుకోవాలి. కొన్ని పదాలను ఇచ్చి అనువదించమని అడుగుతారని అనుకుని దానికి అనుగుణంగా నేర్చుకోవాలి.
'పఠనావగాహనం' అనేది కంటెంట్‌లో చివరి భాగం. ఒక పేరా వచనభాగం ఇచ్చి- కిందగల నాలుగైదు ప్రశ్నలకు పై వచనంలోగల సరైన సమాధానాన్ని గుర్తించడం. ఇది సరిగా చదివితే చాలా తేలిక.
ఆబ్జెక్టివ్‌ విధానపు పరీక్షలో ఛాయిస్‌ అనేది ఉండదని గ్రహించాలి. ఇప్పటివరకూ చదివినది డిగ్రీ కోసం మాత్రమే. ఇప్పుడు ఉద్యోగం కోసం, స్థిరజీవితం కోసం చదువుతున్నామనే లక్ష్యం అవసరం.
ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో.
* సామాన్యమైన ప్రశ్నలు (తేలిక ప్రశ్నలు)
* క్లిష్టమైన ప్రశ్నలు
* తికమకపెట్టే ప్రశ్నలు
* లోతైన ప్రశ్నలు ఉంటాయి. వీటిని బట్టి పరీక్షకు సన్నద్ధం కావాలి.
శ్రీశ్రీ కవిత్వపాదాన్ని పోటీ పరీక్షలకు అన్వయిస్తే... వీటిలో ఒకరిని మరొకరు తోసుకుపోవాలి! అప్పుడు ఉద్యోగమనే 'మరో ప్రపంచం'లోకి అడుగుపెడతారు.

Posting on 22.12.2014