ఏపీ డీఎస్సీ కొత్త పరీక్ష విధానం !

ఈనాడు-హైదరాబాద్‌: టెట్‌ తీసేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే డీఎస్సీ రాతపరీక్షలో అంతర్భాగం చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్‌, డీఎస్సీలను వేర్వేరుగా నిర్వహించారు. ఇకపై డీఎస్సీ ఎంపిక పరీక్షను టెట్‌తోసహా 180 మార్కులకు నిర్వహించనున్నారు. టెట్‌లోని కొన్ని విభాగాలను, డీఎస్సీలోని మరికొన్ని భాగాలను కలిపి రాతపరీక్ష నిర్వహిస్తారు. ఉదాహరణకు గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు టెట్‌లో పేపరు-1 రాయాల్సి ఉండేది. దీనిలో శిశు వికాసం-బోధనా శాస్త్రం, భాషా సామర్థ్యం-1, భాషా సామర్థ్యం-2, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాలు కలిపి 150 మార్కులకు పరీక్ష నిర్వహించేవారు. డీఎస్సీలో ఎస్జీటీ పేపరులో జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, తెలుగు, ఇంగ్లీష్‌, భాషాసామర్థ్యాలు, 1-8వ తరగతి వరకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం, కంటెంట్‌, బోధనా విధానాలు (డీఎడ్‌ సిలబస్‌) అంశాలను 80 మార్కులకు రాయాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదించిన నూతన విధానం ప్రకారం రెండింటినీ మిళితంచేసి, కొత్తగా పేపరు స్వరూపాన్ని కూర్పుచేశారు. మూడు గంటల సమయాన్ని కేటాయిస్తూ 180 మార్కులకు 180 ప్రశ్నలను ఎదుర్కొనేలా ప్రశ్నపత్రం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్స్‌ మేథమేటిక్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, బయోలాజికల్‌ సైన్సెస్‌, సోషల్‌ స్టడీస్‌, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ల విషయంలో ఇదే పంథాను అనుసరిస్తూ సబ్జెక్టులను మార్చారు.
నూతన విధానం ప్రకారం రాతపరీక్షను మొత్తం 180 మార్కులకు నిర్వహిస్తారు. 20 మార్కులను గతంలో టెట్‌ రాసిన వారికి వెయిటేజి కింద పరిగణిస్తారు. గతంలో టెట్‌ రాసిన అభ్యర్థులు సైతం ఈ పేపరు మొత్తాన్ని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈసారి డీఎస్సీలో అంతర్భాగంగా ఉన్న టెట్‌ కంటే గతంలో ఎక్కువ స్కోర్‌ ఉంటే దానినే తుది మార్కులకు కలుపుతారు. లేదా ఈ సారి ఎక్కువ వస్తే పాత టెట్‌ స్కోరును పరిగణనలోనికి తీసుకోబోరు. టెట్‌ ప్రాధాన్యాన్ని ఆయా నియామకాలకు మాత్రమే గుర్తిస్తారు. ప్రైవేట్‌, ఆన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల కోసం ఉపయోగపడేలా టెట్‌లో అర్హతకు గుర్తుగా ధ్రువపత్రాన్ని అందచేస్తారు. అయితే పేపరు స్వరూపంలో టెట్‌ను ప్రత్యేకంగా వేరుచేసి, చూపనందున ఆ స్కోరును ఎలా గుర్తిస్తారో స్పష్టత రావాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 2012 డీఎస్సీకి ఉన్న సిలబస్‌ ప్రకారమే డీఎస్సీ-2014 రాతపరీక్షల సిలబస్‌ ఉండనుంది.
డీఎస్సీ-2014ను సెప్టెంబరు 5వ తేదీన జారీచేసి, దరఖాస్తుల విక్రయాన్ని సెప్టెంబరు 16వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. రాత పరీక్షలను డిసెంబరు 13,14,15 తేదీల్లో 'నిర్వహించి ఫలితాలను జనవరి 24వ తేదీనాటికి విడుదల చేయాలని విద్యాశాఖ సంకల్పిస్తోంది. దీనిపై త్వరలో ఉన్నత స్థాయిలో సమీక్ష జరగనుంది. అందులో మరోసారి సమీక్ష జరిపి ఈ తేదీలను ఖరారు చేయనున్నారు.