ఎంసెట్ విద్యార్థులకు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం కానుంది. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు ముందుగానే బ్రాంచి ఎంపికపై అవగాహన ఏర్పరచుకోవడం తప్పనిసరి. పరిశ్రమల విస్తృతికి తగ్గట్టుగా ఎన్నో రకాల బ్రాంచిలు విద్యార్థులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తితో శ్రమించి చదివితే ఏ బ్రాంచి ద్వారానైనా ఉన్నతమైన కెరియర్‌ను అందుకోవచ్చు. విద్యార్థి కెరియర్ లక్ష్యాలు, అభిరుచి, భవిష్యత్తులో అవకాశాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని బ్రాంచీలు మీ ఆసక్తికి, లక్ష్యసాధనకు దగ్గరగా ఉంటాయి. అలాంటి వాటిని ఎంచుకుంటే మంచి కెరియర్‌కు మార్గం సుగుమం అవుతుంది.
|
|
అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా ఇంజినీరింగ్ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, తదితర సాంప్రదాయ అధ్యయన అంశాలను కోర్ బ్రాంచీలుగా పిలుస్తున్నారు. ఆధునిక పారిశ్రామిక రంగం ఆవిర్భావంతో కంప్యూటర్స్, ఐటీ, ఆటోమొబైల్, ఏరోనాటికల్, బయోటెక్నాలజీ, మెకట్రానిక్స్, తదితర బ్రాంచీలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థి తన ఆసక్తి, విద్యానేపధ్యం, స్థిరపడాలనుకుంటున్న రంగం, మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్రాంచీలను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఈసీఈకి నిరంతర డిమాండ్
ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచికి విద్యార్థుల నుంచి విపరీతంగా డిమాండ్ ఉంది. ఈసీఈ సంబంధిత పారిశ్రామిక, సేవా రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా టెలికాం రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం వృద్ధి చెందుతోంది. అనుకున్న సమయం కంటే వేగంగా, లక్ష్యానికి మించి ఫలితాలు ఈ రంగంలో కనిపిస్తున్నాయి. టెలికాం రంగంలో జరిపే పరిశోధన, అభివృద్ధి ఫలితాలు తక్షణం సాధారణ ప్రజానీకానికి చేరువలోకి వస్తున్నాయి. 3జీ, 4జీ, ఎల్‌టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుంది. వినియోగదారుల మార్కెట్ విస్తృతంగా ఉండటం, రోజురోజుకూ ఇది వృద్ధి చెందుతుండటం వల్ల ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి.
టెలికాం రంగంతోపాటు అనేక ఇతర పరిశ్రమలు, విభాగాలు ఈసీఈ విద్యార్థులకు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్ ప్రాసెసింగ్, డిజిటల్ సిస్టమ్స్, మైక్రోవేవ్, శాటిలైట్, టెరెస్ట్రియల్, ఆప్టికల్ ఫైబర్ లాంటి అనేక రకాల కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ప్రభుత్వ రంగంలోని బీఈఎల్, ఇస్రో, ఈసీఐఆర్, డీఆర్‌డీఓ లాంటి కంపెనీల్లో కూడా స్థిరపడవచ్చు. ఇన్‌స్ట్రుమెంటేషన్ సంబంధిత విభాగాల్లోకి కూడా ఈసీఈ విద్యార్థులు ప్రవేశించవచ్చు. తద్వారా ఉద్యోగ అవకాశాల పరిధిని పెంచుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా...
ఈసీఈ విద్యార్థులకు ప్రోగ్రామింగ్‌పై కూడా పట్టు ఉంటుంది. సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచి విద్యార్థులకు తీసిపోని రీతిలో ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. తద్వారా ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో కూడా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. అవకాశాలతోపాటు ఈసీఈ చదివే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులే మంచి అవకాశాలను పొందే పరిస్థితి ఉంది.
పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఈసీఈ విద్యార్థులకు విద్యావకాశాలు విస్తృతం. ఎం.టెక్. లేదా ఎం.ఎస్.లో వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్ ప్రాసెసింగ్, టెలి కమ్యూనికేషన్స్, సీఎస్‌ఈ, ఐటీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, పవర్ సిస్టమ్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్, రాడార్, మైక్రోవేవ్ ఇంజినీరింగ్, ఆప్టికల్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, తదితర స్పెషలైజేషన్‌లను ఎంచుకోవచ్చు. మనదేశంలో, విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులు చేసినవారికి అవకాశాలు బాగుంటాయి.
నిత్య జీవితంలో సివిల్
మనిషి నిత్యజీవితంతో ముడిపడి ఉన్న సబ్జెక్టు సివిల్ ఇంజినీరింగ్. మనం నిరంతం చూసే, ఉపయోగించే రోడ్లు, భవనాలు, పరిశుద్ధమైన నీరు, ప్రాజెక్టులు, వంతెనలు, ఎయిర్‌పోర్టులు, తదితరాలన్నీ కూడా సివిల్ ఇంజినీరింగ్ ఫలాలే. ఇతర ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి సివిల్ ఇంజినీర్లు మానవ జీవితాన్ని సుఖవంతం చేయగలుగుతారు. దీనిలో భాగం కావాలంటే సివిల్ ఇంజినీరింగ్ చదవాలి. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చేపట్టే ప్రాజెక్టుల్లో పనిచేయడం ద్వారా వివిధ సమస్యలకు సృజనాత్మక రీతిలో పరిష్కారాలు కనుక్కోవడం సివిల్ ఇంజినీర్లకు సాధ్యమవుతుంది. మేథ్స్, సైన్స్, టెక్నాలజీ పరిజ్ఞానం ఈ అభ్యర్థులకు అవసరం. ఉన్నత విద్యలో అభ్యర్థులు తమకు ఇష్టమైన స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వీలుంది.
సివిల్ ఇంజినీరింగ్ ఎప్పటినుంచో కొనసాగుతోన్న సాంప్రదాయ సబ్జెక్టు. నిర్మాణాల ప్రణాళిక, రూపకల్పన, అమలు ఇందులో కీలకం. ఈ సబ్జెక్టు ద్వారా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, అంచనా, సంబంధిత అంశాల్లో గట్టి పునాది ఏర్పడుతుంది. సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు బీటెక్ తర్వాత మనదేశంలో లేదా విదేశాల్లో ఉన్నత కోర్సులు చేయవచ్చు. స్ట్రక్చరల్, వాటర్ రిసోర్సెస్, ఎన్విరాన్‌మెంటల్, కన్‌స్ట్రక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్, జియో టెక్నికల్ ఇంజినీరింగ్, తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.
* బీటెక్ తర్వాత ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం, రైల్వేలు, రక్షణ, పీడబ్ల్యుడీ, తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలోని వ్యవసాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, భూగర్భ జలవనరుల విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.
* ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఓఎన్‌జీసీ, సెయిల్, జిందాల్ గ్రూప్ కంపెనీలు కూడా సివిల్ ఇంజినీర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. స్వయంగా కన్సల్టింగ్ సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి కూడా సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచి అనువైనది.
మక్కువతో బయోటెక్నాలజీ
ఇటీవలి కాలం వరకు బయోటెక్నాలజీని విద్యావిషయకంగా మాత్రమే భావించేవారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ విస్తృతమైన పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపంగా మారింది. బయోటెక్నాలజీలో మనదేశం వేగంగా ప్రగతి సాధిస్తోంది. ముఖ్యంగా వ్యాక్సీన్ల ఉత్పత్తి, బయో పార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ ఎంజైమ్స్, హైబ్రీడ్ వంగడాల ఉత్పత్తి, తదితర విభాగాల్లో మనదేశంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాల సరసన ఉంది. దీని ఫలితంగా బయోటెక్నాలజీ అభ్యర్థులకు భవిష్యత్తులో అవకాశాలు పెరగనున్నాయి.
బయోటెక్నాలజీలో రాణించాలంటే విద్యార్థులకు సబ్జెక్టుపై మక్కువ తప్పనిసరి. బీటెక్‌లో బయోటెక్నాలజీ చదివిన అభ్యర్థులు ఉన్నత కోర్సుల్లో మెడికల్ అండ్ ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, ఇండిస్ట్రియల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, బయోఎలక్ట్రానిక్స్, తదితర స్పెషలైజేషన్లు చేయవచ్చు. మెడిసిన్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ రంగాల్లో బయోటెక్నాలజీ పరిశోధన ప్రభావం ఉంటుంది.
* మనదేశంలో సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలోని అనేక సంస్థలు బయోటెక్నాలజీలో విస్తృతంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. సీఎస్‌ఐఆర్, కేంద్ర బయోటెక్ విభాగం అనేక ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి. వీటి ద్వారా పరిశోధనలు చేస్తే బయోటెక్నాలజీలో మంచి కెరియర్‌ను అందుకోవచ్చు.
కంపెనీలకు ఏమి కావాలి?
ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి ఎంచుకున్నా విద్యార్థి అంతిమ లక్ష్యం... కోర్సు పూర్తయ్యేనాటికి మంచి కంపెనీలో ఉద్యోగం సాధించడమే. మంచి పని సంస్కృతి, ఆకర్షణీయమైన వేతనం, ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న కంపెనీలో చేరడం ద్వారా తమ కెరియర్ వృద్ధి అవకాశాలను మెరుగు పరచుకోవాలని విద్యార్థులు భావిస్తుంటారు. విద్యార్థి మాదిరిగానే కంపెనీలు కూడా నియామకాలు చేపట్టేటప్పుడు అనేక రకాలుగా ఆలోచిస్తాయి. సానుకూల దృక్పథం, ఉత్సాహం, చురుకుదనం, మంచి కమ్యూనికేషన్ సామర్థ్యాలు, నేర్చుకోవాలనే తపన, సబ్జెక్టు ప్రాథమిక అంశాల్లో పట్టు, లక్ష్యాల పట్ల స్పష్టత ఉన్న అభ్యర్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాయి.
కంపెనీలు నియామకాల సమయంలో అనేక పద్ధతులను అనుసరిస్తాయి. వివిధ దశల్లో వడపోతల ద్వారా తమకు సరిపోయే అభ్యర్థులను ఎంచుకుంటాయి. విద్యార్థులు వీటిపై అవగాహన ఏర్పరచుకొని మొదటి నుంచే సంబంధిత సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. కంపెనీల నియామక ప్రక్రియల్లో ఈ దశలు ఉంటాయి...
* ప్రీ-ప్లేస్‌మెంట్ టాక్ (కార్పొరేట్ ప్రెజెంటేషన్): నియామకం జరిపే కంపెనీ మానవ వనరుల విభాగ అధిపతి కంపెనీ ప్రొఫైల్, వృద్ధి, నియామక ప్రక్రియ, సీటీసీ, భవిష్యత్తు అవకాశాలు, సర్వీస్ బాండ్, తదితర అంశాల గురించి వివరిస్తారు. విద్యార్థులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడటానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఇందులో అవకాశం లభిస్తుంది.
* రాత పరీక్ష (ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్): ఇందులో ఆప్టిట్యూడ్ స్కిల్స్ టెస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ టెస్ట్, కోర్ సబ్జెక్టు నాలెడ్జ్ టెస్ట్ ఉంటాయి. ఆప్టిట్యూడ్ స్కిల్స్ టెస్ట్‌లో క్వాంటిటేటివ్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అంశాలు ఉంటాయి.
* గ్రూప్ డిస్కషన్: ఇందులో అభ్యర్థులకు ఒక అంశం ఇస్తారు. దాని గురించి చర్చించాలి. దీని ద్వారా అభ్యర్థిలోని బృంద తత్వం (టీమ్ స్పిరిట్), రీజనింగ్ ఎబిలిటీ, నాయకత్వ లక్షణాలు, చొరవ, స్వభావం, అవగాహన స్థాయి, కమ్యూనికేషన్, తదితర సామర్థ్యాలను అంచనా వేస్తారు.
* సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూ: గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థి చదివిన సబ్జెక్టులోని ప్రాథమిక భావనలు, వాటిని ఆచరించడానికి అవసరమైన (ప్రాక్టికల్ అప్లికేషన్) నైపుణ్యాలను పరీక్షిస్తారు.
* హెచ్.ఆర్. నిపుణుల ఇంటర్వ్యూ: ఇది చివరి ఇంటర్వ్యూ. నియామక ప్రక్రియలో అంతిమ దశ. దీనిలో అభ్యర్థి ఆలోచన దృక్పథం, ఆత్మ విశ్వాసం స్థాయి, లక్ష్యాలను ఏర్పరచుకునే విధానం, జనరల్ అవేర్‌నెస్, కమ్యూనికేషన్, తదితర అంశాలను మానవ వనరుల విభాగం నిపుణులు పరీక్షిస్తారు.
ఇప్పటి నుంచే అవగాహన
ఇంజినీరింగ్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లపై మొదటి ఏడాది నుంచి అవగాహన కల్పించుకోవాలి. ప్లేస్‌మెంట్లు జరిగేది కోర్సు చివరలో కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. కమ్యూనికేషన్ సామర్థ్యాలపై మొదటి నుంచి దృష్టిపెడితేనే క్రమేణా పెంపొందించుకోగలరు. నియామక ప్రక్రియను ధైర్యంగా ఎదుర్కోవాలంటే కమ్యూనికేషన్ సామర్థ్యాలు తప్పనిసరి.
వివిధ కంపెనీల నియామక ప్రక్రియల్లో పాల్గొనడానికి అవసరమైన అర్హతలపై అవగాహన ఏర్పరచుకోవాలి. చాలావరకు కంపెనీలు పదో తరగతి నుంచి, ఇంటర్, డిగ్రీలలో కనీసం 60 శాతం మార్కులను అడుగుతాయి. బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, క్యాపిటల్ ఐక్యూ లాంటి అగ్రశ్రేణి కంపెనీలు అకడమిక్స్‌లో 80 శాతం లేదా 70 శాతం మార్కులుంటేనే పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల మొదటి ఏడాది నుంచీ ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు లేకుండా అవసరమైన మార్కులు సాధిస్తేనే ప్లేస్‌మెంట్లలో పాల్గొనడానికి అర్హత లభిస్తుంది.
* ఎల్లప్పుడూ వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి... రెండు ప్రతుల రెజ్యూమెలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, అన్ని సర్టిఫికెట్ కాపీలు రెండు సెట్‌లు, ప్రాజెక్టు రిపోర్ట్, కాలేజ్ ఐడీ కార్డు లేదా ఇతర ఫొటో ఐడీ కార్డు. ఇంజినీరింగ్ అభ్యర్థులకు సరైన డ్రస్ కోడ్ చాలా ముఖ్యం. అలాగే బాడీ లాంగ్వేజ్ పట్ల శ్రద్ధ వహించాలి. కాలేజీలో నిర్వహించే అన్ని క్యాంపస్ రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. దీనివల్ల ఆప్టిట్యూడ్‌తోపాటు ఉద్యోగ సామర్థ్యాలు పెంపొందుతాయి. సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. వీలైనప్పుడల్లా పునశ్చరణ చేస్తుండాలి. ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను పెంచుకోవాలి.
* విద్యార్థులు రోజూ దినపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల జనరల్ అవేర్‌నెస్ పెరుగుతుంది. నియామకాల సమయంలో వర్తమాన అంశాలపై అవగాహనను కూడా కంపెనీలు పరిశీలిస్తాయి.
* మొదటినుంచి సానుకూల ఆలోచన ధోరణిని అలవాటు చేసుకోవాలి. క్యాంపస్ నియామకాల్లో ఒక కంపెనీకి ఎంపిక కాకపోతే నిరుత్సాహపడే విధంగా ఉండకూడదు. సానుకూల దృక్పథంతో మరో కంపెనీకి ప్రయత్నించాలి.
కంపెనీల ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కానీ సమాధానాన్ని వివిధ రకాల అభ్యర్థులు ఎలా ప్రెజెంట్ చేశారనేది కంపెనీలు పరిశీలిస్తాయి. ప్రతి అభ్యర్థిలోనూ ప్రత్యేక లక్షణం కోసం కంపెనీలు వెతుకుతుంటాయి. అందువల్ల క్యాంపస్ నియామకాల్లో అభ్యర్థులు తమ ప్రత్యేకతలను చాటడం కీలకం. చివరిగా... Dream high, work hard and learn with passion. Success will be surely yours.
సవాళ్లు, సృజనకు ప్రాధాన్యం...
దశాబ్దాల నుంచి అధ్యయనం చేస్తున్నప్పటికీ, ఈమధ్యనే వెలుగులోకి వచ్చిన బ్రాంచి... మెకానికల్ ఇంజినీరింగ్. దేశంలో మౌలిక పారిశ్రామిక రంగం బాగా విస్తరిస్తుండటంతో మెకానికల్ ఇంజినీరింగ్‌కు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరిగింది. మెకానికల్ బ్రాంచి మరుగున ఉంటూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోన్న మరో బ్రాంచి.. ఆటోమొబైల్ ఇంజినీరింగ్. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత సవాళ్లతో కూడిన రంగంగా మారుతోంది. పనిలో నవ్యత్వం, సృజనాత్మకత చూపించే అభ్యర్థులకు ఈ రంగంలో డిమాండ్ పెరుగుతోంది. వాహనాల డిజైనింగ్, కొత్త వాహనాల ఉత్పత్తి, సర్వీసింగ్, తదితర అంశాలను ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో అధ్యయనం చేస్తారు. మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్, డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ ఇందులో రెండు ప్రధాన విభాగాలు. ఈ అభ్యర్థులు భవిష్యత్తులో ఏరోడైనమిక్స్, ఫ్యుయల్స్, ఛేసిస్, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, తదితర స్పెషలైజేషన్లు చేయవచ్చు.
మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్‌పై మంచి పట్టు సాధిస్తే ఈ విభాగంలో రాణించవచ్చు. అభ్యర్థులకు మంచి సృజనాత్మకత, కమ్యూనికేషన్ సామర్థ్యాలు అవసరం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపచేయగలగాలి. శారీరక సమర్థత కూడా అవసరం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని రవాణా కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, సర్వీస్ స్టేషన్లు, కన్సల్టింగ్ రంగాల్లో ఆటోమొబైల్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. బీటెక్ తర్వాత ఆటోమొబైల్ స్పెషలైజేషన్‌తో ఎం.టెక్., పీహెచ్‌డీ కూడా చేయవచ్చు.
* మంచి విశ్లేషణ సామర్థ్యాలు గల అభ్యర్థులకు అనువైన బ్రాంచీలు మెకానికల్, ఆటోమొబైల్. ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, ఫియట్, అశోక్ లేలాండ్, హీరో, టీవీఎస్, బజాజ్, ఆది, హ్యుండాయ్, ఫోర్డ్, హోండా, టయోటా, సుజుకి, నిసాన్, యమహా, తదితర కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఎనలిటికల్ స్కిల్స్, క్యాడ్, క్యామ్ సామర్థ్యాలున్న అభ్యర్థులు మంచి అవకాశాలను పొందవచ్చు.
నవతరం బ్రాంచీలు కంప్యూటర్స్, ఐటీ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగానికి ప్రతీకలుగా నిలిచిన బ్రాంచీలు సీఎస్‌ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ). డేటా మేనేజ్‌మెంట్, కంప్యూటర్ హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ డిజైన్, మేనేజ్‌మెంజ్, అడ్మినిస్ట్రేషన్, తదితర నైపుణ్యాలు ఐటీ ప్రొఫెషనల్స్‌కు కీలకం. ఈ అంశాల్లో అద్భుత నైపుణ్యాలు గల అభ్యర్థులకు అత్యద్భుత అవకాశాలను సాఫ్ట్‌వేర్, ఐటీ పరిశ్రమలు అందిస్తున్నాయి. అవకాశాల పరంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటున్నప్పటికీ, ప్రతిభావంతులైన అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను అందించడానికి కంపెనీలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాయి.
కంప్యూటర్ సైన్స్‌లో ప్రధానంగా డిజైన్, ఇంజినీరింగ్, డెవలప్‌మెంట్, ఇంటెగ్రేషన్, టెస్టింగ్ సూత్రాలను అధ్యయనం చేస్తారు. మేథ్స్, సైన్స్ అప్లికేషన్‌లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ థియరీ, మెటీరియల్స్ ఇంజినీరింగ్, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఈ బ్రాంచీలో ముఖ్యమైన అంశాలు. వ్యాపారానికి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను ఉపయోగించడం ఎలాగో నేర్పే బ్రాంచి ఐటీ. ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ డివైజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్ చేయడం ఐటీ బ్రాంచిలో ప్రధాన అధ్యయన అంశం.
మేథ్స్‌లో మంచి పట్టున్న అభ్యర్థులకు సీఎస్‌ఈ బ్రాంచీ బాగా సరిపోతుంది. ఐటీ బ్రాంచిలో ప్రోగ్రామింగ్, డిజైన్, ఆల్గోరిథమ్స్, డేటాబేస్ డిజైన్‌తోపాటు టెక్నాలజీ మేనేజ్‌మెంట్ కూడా నేర్చుకోవచ్చు. ఈ అభ్యర్థులకు డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, వెబ్‌మాస్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఐటీ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సెక్యూరిటీ ఎనలిస్ట్, హార్డ్‌వేర్ ఇంజినీర్, ప్రొఫెసర్, ప్రోగ్రామర్, తదితర ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
* ఇటీవలి కాలంలో విద్యార్థులను ఆకర్షిస్తోన్న మరో బ్రాంచి... కెమికల్ ఇంజినీరింగ్. ఫిజిక్స్, మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి భిన్న అంశాల కలయిక ఈ బ్రాంచి. పెట్రోకెమికల్, ఫార్మసీ, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్ లాంటి భిన్న రంగాలు కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశాలను కల్పిస్తున్నాయి.
ఏరోస్పేస్ మేలు
విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్లు, మిసైల్స్, స్పేస్ స్టేషన్లు, స్పేస్ షటిల్, తదితర విభాగాల్లో ఏరోస్పేస్ ఇంజినీర్లకు అవకాశాలు ఉంటాయి. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పరిధి విస్తృతం. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కూడా ఇందులో ఒక భాగం. అందువల్ల ఈ రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏరోనాటికల్ కంటే ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఎంచుకోవడం మేలు. ఇది కేవలం శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినదే కాదు, అత్యంత సృజనాత్మకతతో కూడిన కెరియర్.
మనదేశంలో ఏరోస్పేస్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. అయితే ఐరోపా, అమెరికాలతో పోల్చుకుంటే మనదేశంలో ఇది చాలా చిన్న రంగం. ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్‌డీఓ, ఇస్రో, హెచ్‌ఏఎల్, ఎన్‌ఏఎల్, తదితర సంస్థల్లోనే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్ లాంటి కంపెనీల్లో కూడా స్థిరపడవచ్చు. విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి అవకాశాలు విస్తృతం. నాసాలో భారతీయ ఇంజినీర్లు చాలామంది ఉన్నారు. బోయింగ్, మెక్‌డోనెల్ డగ్లస్ కంపెనీల్లో కూడా మనదేశ నిపుణులు ఎక్కువగా ఉన్నారు. ఐఐటీలు, ఏరోనాటికల్ రంగంలో శిక్షణ ఇచ్చే ప్రత్యేక సంస్థల్లో చదువుకున్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి.
ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్
సమాజానికి సంబంధించిన వివిధ అంశాలను సమీకృతంగా అధ్యయనం చేయడానికి ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఉపయోగపడుతుంది. ఇందులో ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ సైన్స్, ఆపరేషన్స్ రిసెర్చ్, సిస్టమ్స్ ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్, సేఫ్టీ ఇంజినీరింగ్ లాంటి అనేక సబ్ స్పెషలైజేషన్లు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని అన్ని రకాల ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో ఇండస్ట్రియల్ ఇంజినీర్లకు అవకాశాలు ఉంటాయి. టాటా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ ఉద్యోగ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, రైల్వేలు, బీఎస్‌ఎన్‌ఎల్, ఓఎన్‌జీసీ, ఇస్రో, డీఆర్‌డీఓ, తదితర కంపెనీలు ఈ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ సంస్థల్లో కోర్సులు చేసినవారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయి.
* డ్యుయల్ డిగ్రీ కోర్సులు: ఇటీవలి కాలంలో మనదేశంలో అనేక సంస్థలు డ్యుయల్ డిగ్రీ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. పరిశోధనలవైపు వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. బీటెక్, ఎంటెక్ కలిపి ఐదేళ్లలో దీన్ని పూర్తిచేయవచ్చు. తద్వారా ఓ ఏడాది సమయం కలిసొస్తుంది. ఉద్యోగ అవకాశాల్లో కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఇంటెగ్రేటెడ్ కోర్సుల్లో ఉండే మంచి లక్షణం ఏమిటంటే... మల్టీ డిసిప్లీనరీ స్వభావం. కోర్సులను వైవిధ్యంగా రూపొందించవచ్చు.
సర్క్యూట్ సబ్జెక్టుల వైపు...
ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులను పూర్తి చేస్తున్నారు. వీరిలో కొందరు మాత్రమే మంచి కార్పొరేట్ కంపెనీలు, పేరున్న సంస్థల్లో ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. బ్రాంచిల ఎంపిక సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కెరియర్‌లో అనుకున్న స్థాయికి చేరుకోలేని విద్యార్థులు చాలా మంది ఉంటారు. ఇంజినీరింగ్ బ్రాంచీల్లో డిమాండ్ ఉన్నవీ, లేనివీ అంటూ తేడా లేదు. విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టుపై ఆసక్తి ఏ మేరకు ఉందనేది ముఖ్యం. సబ్జెక్టుపై మంచి పట్టుతోపాటు కంపెనీలకు అవసరమైన సామర్థ్యాలు పెంపొందించుకుంటే ఏ బ్రాంచితోనైనా మంచి కెరియర్‌ను అందుకోవడం వీలవుతుంది. బ్రాంచి ఎంపికలో విద్యార్థి అభిరుచి, ఆసక్తి చాలా ముఖ్యం.
* ప్రోగ్రామింగ్ పట్ల ఆసక్తి ఉంటే సీఎస్‌ఈ లేదా ఐటీ ఎంచుకోవచ్చు.
* ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధిత అంశాలపై ఆసక్తి ఉంటే ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ, ఈసీఎం, సంబంధిత బ్రాంచీల వైపు మొగ్గు చూపవచ్చు.
* యంత్రాలు, యంత్ర పరికరాల డిజైనింగ్, బాగుచేయడం అంటే ఇష్టమైతే మెకానికల్, ఆటోమొబైల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ బ్రాంచిలను పరిశీలించవచ్చు.
* రసాయనాలు, ఎరువులు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల రూపకల్పన, తయారీ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే కెమికల్ ఇంజినీరింగ్ తీసుకోవచ్చు.
* బయోటెక్నాలజీ ఎదుగుతోన్న సబ్జెక్టు. బయో ఎనర్జీ, బయో డీజిల్, డ్రగ్ డిజైనింగ్, బయో డ్రగ్స్, తదితర అంశాలపై ఆసక్తి ఉంటే బయోటెక్నాలజీని పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్స్‌కు ఆదరణ
ఈసీఈ, ఈఈఈ, ఈఐఈలను సర్క్యూట్ బ్రాంచీలు అంటారు. ఎక్కువ మంది విద్యార్థులు ఈ బ్రాంచీలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మనదేశంలో, విదేశాల్లోనూ వైవిధ్య రంగాల్లో, మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ రంగాలు మరింత వృద్ధి చెందుతుండటం వల్ల అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిలో మాంద్యం కనిపించదు. పరిశోధన, పేటెంట్, ప్రొడక్ట్ రియలైజేషన్‌కు ఈ బ్రాంచిల్లో అవకాశాలు ఎక్కువ. ఇంజినీరింగ్‌లో నవ్యత్వానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. నవ్యత్వం చూపలేని రంగం వృద్ధి చెందలేదు. సర్క్యూట్ బ్రాంచిల్లో నవ్యత్వానికి, సృజనాత్మకతకు అవకాశం ఎక్కువ. ఎలక్ట్రానిక్స్ రంగంలో నిత్యం వస్తోన్న కొత్త ఉత్పత్తులే దీనికి మంచి ఉదాహరణ.
ఈసీఈ: ఈ బ్రాంచి ద్వారా ఆధునిక టెక్నాలజీ సంబంధిత అంశాలను అధ్యయనం చేయవచ్చు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లీనియర్ ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఆప్టికల్ కమ్యూనికేషన్, శాటిలైట్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్, సీ, సీ++, సీఓ అండ్ సీఎన్, వీఎల్‌ఎస్‌ఐ, తదితర అంశాలను నేర్చుకోవచ్చు. ఈసీఈ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతం. సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు, ఆడియో, వీడియో సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పెరిగేకొద్దీ ఈసీఈకి అవకాశాలు అధికం అవుతుంటాయి.
ఈఈఈ: విద్యుత్తు లేని ఆధునిక జీవనాన్ని ఊహించలేము. రోజురోజుకూ పెరుగుతోన్న విద్యుత్తు అవసరాలను తీర్చాలంటే నిరంతరం కొత్త విద్యుత్తు ప్రాజెక్టులు అవసరం. అందుకే ఈఈఈ ఇంజినీర్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వ రంగంలోని ఏపీఎస్‌ఈబీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్, సీపీఆర్‌ఐ, బీఎస్‌ఎన్‌ఎల్, తదితర కంపెనీలు ఈఈఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రైవేటు రంగం కూడా విద్యుదుత్పాదన రంగంలో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. ఎల్ అండ్ టీ, టాటా పవర్, ఎస్సార్ గ్రూప్, రిలయన్స్, ఐటీసీ, తదితర కంపెనీలు ఈఈఈ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా స్థిరపడవచ్చు.
* ఎం.టెక్. స్థాయిలో మైక్రో ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఐ, డీఎస్‌పీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, రోబోటిక్స్, తదితర స్పెషలైజేషన్లకు మంచి డిమాండ్ ఉంది.
ఈఐఈ: ఇన్‌స్ట్రుమెంటేషన్ విద్యార్థులకు కెమికల్, డ్రగ్స్, ఫార్మా, ఉక్కు, టెక్స్‌టైల్, రక్షణ, ఏరోస్పేస్, న్యూక్లియర్ పవర్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, పేపర్ పరిశ్రమలు, ఆయిల్, నేచురల్ గ్యాస్, ప్రొడక్షన్ అండ్ మైనింగ్ రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఆయా రంగాలకు అవసరమైన పరికరాల అభివృద్ధి, ఆచరణ ఈ నిపుణుల పరిధిలోకి వస్తాయి. బీటెక్ స్థాయిలో ఈ విద్యార్థులు ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్స్, ట్రాన్స్‌డ్యూసర్స్, ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ, డీఎస్‌పీ, సీ, సీ++ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తారు. ఎం.టెక్.లో ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, బయోమెడికల్ ఇంజినీరింగ్, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, డీఎస్‌పీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, తదితర స్పెషలైజేషన్లకు డిమాండ్ ఉంటుంది.
* ఐఐటీలు, ఎన్‌ఐటీలు, పేరొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎం.టెక్. చేస్తే ప్రయోజనం ఉంటుంది. దీనికి విద్యార్థులు బీటెక్ స్థాయిలో సబ్జెక్టుపై మంచి పట్టు సాధించాలి.
|