line decor
  HOME  ::  
line decor
   

 మంచి కళాశాల... ఎంచుకునేదెలా?

సాధారణంగా విద్యార్థులు ఏం చేస్తుంటారంటే... తమకో, తమ స్నేహితులకో తెలిసిన పది పన్నెండు కళాశాలలను ఓ మారు సందర్శించి, వాటిలో ఒకదాన్ని ఎంచుకుంటుంటారు. కిందటేడాది ప్లేస్‌మెంట్ల సంగతి... ఉద్యోగాలు వచ్చివారికి కనిష్ఠ, గరిష్ఠ జీతం ఎంతో కనుక్కుంటారు. ఇంతటితో మంచి కళాశాల గురించిన విచారణ ముగిసినట్లు భావిస్తుంటారు.
కానీ ఇంత తేలిగ్గా తేల్చుకోగలిగిన విషయం కాదిది! విభిన్న అంశాలను సూక్ష్మంగా పరిశీలించాకే ఒక నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. కళాశాలల తీరుపై కింది అభిప్రాయాలు చూడండి -

'బాగా పేరున్న కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాలున్న విద్యను అందిస్తాయి. అక్కడ చదివినవారు వృత్తి ఉద్యోగాల్లో విజయవంతంగా స్థిరపడతారు'.
'ఉత్తమ బోధనను ఏయే కళాశాలలు అందిస్తాయో ఉద్యోగ నియామక సంస్థలకు బాగా తెలుసు. అందుకే ఆ క్యాంపస్‌లకు వెళ్ళి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి'.
ఈ రెండు అభిప్రాయాల్లోనూ పూర్తి వాస్తవం లేదు.
ఐఐటీల్లాంటి కొన్ని సంస్థల బ్రాండ్ ఇమేజ్ వాటి బోధన ప్రమాణాల వల్ల వచ్చింది. అది అక్కడి పూర్వవిద్యార్థుల విజయాల్లో, ఫ్యాకల్టీ- గ్రాడ్యుయేట్ విద్యార్థుల పరిశోధన ఫలితాల్లో ప్రతిఫలిస్తుంది.
విస్తృతంగా ఇచ్చే వాణిజ్య ప్రకటనల్లో తమ ప్రత్యేకతలను వివరించటం మూలంగా కొన్ని సంస్థల ఇమేజ్ పెరుగుతుంది. కానీ మంచి విద్యను అందిస్తున్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక ప్రచారం కల్పించుకోలేని చిన్న కళాశాలలు కూడా ఉంటాయని గుర్తించాలి.
చిన్న, కొత్త కళాశాలలు తగినన్ని నియామక సంస్థలను ఆకర్షించలేవు. ఏటా క్యాంపస్‌ల నుంచి వేలమంది విద్యార్థులను ఎంచుకునే కంపెనీలు 5-10 మంది సమర్థులు దొరికే క్యాంపస్‌లకు వెళ్ళవు. తక్కువమందినే నియమించుకునే సంస్థలు కూడా ఏ కొత్త కళాశాలనూ తమ 'రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌'లో చేర్చుకోవు.
ఈ పరిస్థితుల్లో ఏ కళాశాల నాణ్యమైన విద్యను అందిస్తోందో కనుక్కునేదెలా?
కీలకమైన కొన్ని అంశాలు కళాశాలలను పోల్చి చూడటానికి ఉపకరిస్తాయి. అత్యధిక సమాచారం ఆ కాలేజీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే అక్కడ చదువుతున్న విద్యార్థుల ద్వారా, పూర్వ విద్యార్థుల ద్వారా తెలుసుకోవచ్చు. కళాశాలను స్వయంగా సందర్శించటం ఉత్తమం. ఇవన్నీ చేయటానికి శ్రద్ధా, ఓపికా ఉండాల్సిందే. కానీ విద్యార్థుల కెరియర్ మొత్తం ప్రభావితమయ్యే విషయం కాబట్టి కళాశాల గురించి సమగ్ర సమాచారం గ్రహించటం తప్పనిసరి.
ఇవే కాకుండా....
బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాల తర్వాత ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఇతర అంశాలు...
విద్యాసంస్థ హోదా: విశ్వవిద్యాలయ స్థాయి అయితే విద్యాపరంగా నవ్యత చూపటానికి అధిక ఆస్కారం ఉంటుంది.
క్యాంపస్: పూర్తిస్థాయి రెసిడెన్షియల్ క్యాంపస్ అయితే మెరుగైన అభ్యాసానికి వీలు కల్పిస్తుంది.
కరిక్యులమ్: ఎంత తరచూ దీన్ని నవీకరిస్తున్నారు? ఎన్ని కోర్సులు బోధిస్తున్నారు? మరీ అత్యధిక సంఖ్యలో కోర్సులను అందించే విద్యాసంస్థ అయితే నాణ్యమైన బోధనను అందించే అవకాశం తక్కువ.
ఎలక్టివ్స్ ఎన్ని అందిస్తున్నారు? అక్కడ చదివినవారందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారా? లేక ఉన్నతవిద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారా? ఎక్కువవమంది ఉన్నత విద్యాభ్యాసాన్ని ఎంచుకుంటుంటే ఆ విద్యాసంస్థ విద్యార్థుల్లో నేర్చుకునే దృష్టిని పెంచటంలో విజయవంతమవుతోందని సంకేతం.
ప్రవేశ పరీక్షలు: అక్కడి విద్యార్థులు GATS, CAT లాంటి ప్రవేశ పరీక్షల్లో ఎలా ప్రతిభ చూపుతున్నారన్నది కూడా ఒక కీలక అంశం.
పూర్వవిద్యార్థులు: పూర్వ విద్యార్థుల సంఘం (అలమ్నై అసోసియేషన్) క్రియాశీలకంగా ఉందా? ముఖ్యంగా 10-15 ఏళ్ళ చరిత్ర ఉన్న కళాశాలలను పూర్వవిద్యార్థులే పట్టించుకోకపోతే ఇతరులెవరో మాత్రం ఎందుకు శ్రద్ధ తీసుకుంటారు?
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్: దీన్ని ప్రముఖంగా పట్టించుకోవాల్సిందే. అయితే ఈ ఒక్క అంశాన్నే పరమ ప్రమాణంగా భావించకూడదు. ఏయే ప్రసిద్ధ సంస్థలు ఎంతమంది విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకున్నాయో వివరాలు తీసుకోవాలి.
గుర్తింపు: NAAC లేదా NBA అక్రిడిటేషన్ పొంది ఉందా? ఉత్తమ ప్రమాణాలుంటే గానీ ఈ గుర్తింపు రాదు కాబట్టి ఇవి ఉన్న కళాశాలలకు ప్రాధాన్యం ఇవ్వటం మేలు.
ఇతర కార్యకలాపాలు: విద్యార్థులు ప్రయోగశాలల్లో, గ్రంథాలయాల్లో మాత్రమే నాలుగేళ్ళూ గడపరు. క్యాంపస్ జీవితం ఉల్లాసభరితంగా ఉండాలి. అందుకే కళాశాలలో పాఠ్యప్రణాళికేతర (extra - curricular) కార్యకలాపాలు చాలినన్ని ఉన్నాయో లేదో ధ్రువీకరించుకోవాలి.
విద్యార్థుల భాగస్వామ్యం: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందటం కూడా కళాశాలలోనే జరుగుతుంది. కళాశాల నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం ఏమేరకు ఉందో గ్రహించటం కూడా ముఖ్యమే.
ఇవన్నీ తెలుసుకోవటం కష్టమని మీరు భావిస్తూ ఉండవచ్చు. అయితే 'ఏదో' ఒక కాలేజీలో చదవటం కాకుండా 'ఉత్తమ' కళాశాలలోనే చదవాలని పట్టుదల, శ్రద్ధ ఉంటే సమాచారం సేకరించటం కష్టమేమీ కాదు.
ఒక కాలేజీ వెబ్‌సైట్‌లో చాలా తక్కువ సమాచారం ఉంటే... అది ఆ యాజమాన్య అనాసక్తిని గానీ, సమాచార అలభ్యతను గానీ సూచిస్తుందని గ్రహించాలి. చాలా కళాశాలలు ఫేస్‌బుక్ లాంటి సామాజిక నెట్‌వర్క్ సైట్లలో కనపడుతుంటాయి. ఆ సంస్థల బాధ్యులతో విద్యార్థులు అనుసంధానం ఏర్పరుచుకోవటానికి వీలు కల్పిస్తాయి.
కొంత సమయం ఇలా కళాశాల వివరాలు సేకరించటంపై వెచ్చించటం ప్రయోజనకరమే. అప్పుడు నాలుగేళ్ళ తర్వాత 'సరైన కాలేజీలో చేరే విషయంలో పొరపాటు చేశానే' అని చింతించే అవసరం ఉండదు!
వికసించే ప్రతిభ
ప్రతి విద్యార్థిలోనూ తెలివితేటలు అంతర్గతంగా ఉంటాయి. చేయాల్సింది- ముడిరూపంలో ఉన్న వాటిని సానపట్టటమే! మెదడులో విజ్ఞానజ్యోతిని వెలిగించటమే! విద్యార్థి కుటుంబ నేపథ్యం, లక్ష్యం ఏర్పరచుకునే పరిస్థితులు... ఇవన్నీ దీనిలో ముఖ్యభూమిక వహిస్తాయి.
చాలా సందర్భాల్లో విద్యార్థిలో ఉన్న నిజమైన ప్రతిభ కళాశాల అతడు/ఆమె చదువు ముగించేదాకా బయటకు రానే రాదు. అలా కాకుండా ఉత్తమ విద్యాసంస్థలు వారిలోని ప్రతిభాసంపత్తులు పూర్తిగా వికసించేలా చేస్తాయి. ఆ విద్యార్థులు తమ విద్యాభ్యాస కాలంలో... అవగాహన నైపుణ్యం, విశ్లేషణ, అన్వయ సామర్థ్యం పెంచుకుంటారు. క్యాంపస్ పరిమాణం ఎంత ఉందనేదానికంటే విజ్ఞాన సముపార్జనకు ఏమేరకు వీలు కల్పిస్తున్నారన్నది ప్రధానమైన విషయం. నాణ్యమైన బోధన, ఫ్యాకల్టీ సభ్యుల అంకితభావం, నేర్చుకునే పరిసర వాతావరణం, గ్రంథాలయం, విద్యాపరంగా ఉత్తమ సంస్కృతి... ఇవన్నీ పరిశీలించాలి.
ఇన్ని వడపోతల తర్వాత ఎంచుకునే కళాశాల మెరుగైన భవితను నిశ్చయంగా అందిస్తుంది!