ఎంసెట్ కౌన్సెలింగ్ ఉత్కంఠకు తెరపడింది. కౌన్సెలింగ్‌లో తగు జాగ్రత్తలు తీసుకొని, తప్పులు జరగకుండా చూసుకుంటేనే మంచి ఇంజినీరింగ్ కాలేజీలో ప్రవేశం లభిస్తుంది. తమ ర్యాంకునకు ఏయే కాలేజీల్లో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయనే సమాచారాన్ని మాక్ కౌన్సెలింగ్, గత ఏడాది ర్యాంకు ఆధారిత అడ్మిషన్లు, మిత్రులు, ఇంటర్నెట్ సహకారంతో తెలుసుకోవచ్చు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అనేక ఇతర అంశాలు కూడా మీ సీటు అవకాశాలను ప్రభావితం చేస్తాయి..
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న విద్యార్థులు రిజర్వేషన్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రతి కేటగిరీలో బాలికలకు 33.33 శాతం, సి-సర్టిఫికెట్ పొందిన ఎన్‌సీసీ వారికి 1 శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి స్పోర్ట్స్ అభ్యర్థులకు అరశాతం, మిలిటరీకి చెందిన వారి పిల్లలకు 2 శాతం, శారీరక వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఇవిగాక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నిర్దిష్ఠ సంఖ్యలో సీట్లు కేటాయిస్తారు. అలాగే విద్యార్థులు ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, ఆంధ్రా యూనివర్సిటీల్లో దేని పరిధిలోకి వచ్చేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంటర్‌లోపు వరుసగా నాలుగు సంవత్సరాలు ఏ జిల్ల్లాలో చదివారనే దాన్ని బట్టి యూనివర్సిటీ పరిధిని నిర్ణయిస్తారు. అలా చదివుంటే 85 శాతం స్థానిక రిజర్వేషన్ ఉంటుంది. కౌన్సెలింగ్ ఫారమ్‌లో ఈ వివరాలు తప్పుగా నింపితే నాన్ లోకల్ కేటగిరీలోకి వెళ్లి కేవలం 15 శాతం రిజర్వేషన్ (స్థానికేతర) పొందుతారు. ఎంసెట్‌లో క్వాలిఫై కాని, పరీక్ష రాయని మైనారిటీ విద్యార్థులు (ఇదివరకే కన్వీనర్‌కు దరఖాస్తు చేసినవారు) కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో లోకల్ ఏరియా, మైనారిటీ, రిజర్వేషన్, కేటగిరీ, పుట్టినతేదీ, స్క్రాచ్ కార్డు నంబరు, మొబైల్ నంబరు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ అర్హత, కులం, ఇతర కేటగిరీ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారు. ఇది ముగిశాక మీ దగ్గర నుంచి తీసుకున్న సర్టిఫికెట్ల వివరాలతో రశీదు ఇస్తారు. అందులో తప్పులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. తప్పులుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. తర్వాత ఈ వివరాలను మార్చుకోవడం వీలు కాదు. కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు కూడా వీటి ఆధారంగానే జరుగుతుంది. అందువల్ల అన్ని వివరాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ దశలో మీ వివరాలను సరిగా నింపకపోతే కౌన్సెలింగ్‌లో చాలా నష్టపోతారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడం, ప్రాధాన్యతలు ఇచ్చే తీరును వెరిఫికేషన్ సమయంలో వివరిస్తారు. దీన్ని శ్రద్ధగా వినాలి.
|
మంచి కాలేజీకి ప్రాధాన్యం...
సరైన కాలేజీని ఎంచుకుంటే ఇంజినీరింగ్ తర్వాత కెరియర్‌లో స్థిరపడటం సులువవుతుంది. మీరు ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన కాలేజీల చరిత్ర, అధ్యాపకుల బోధన, కోర్సుకుండే భవిష్యత్తు, ఇంటి నుంచి కాలేజీకి దూరం, హాస్టల్ వసతి, బస్సు సౌకర్యం, తదితర అన్ని వివరాలను మిత్రులు, గురువులు, తల్లిదండ్రుల ద్వారా సేకరించాలి. మీ ర్యాంకునకు సీటు వచ్చే అవకాశం లేని (కొంచెం పైనున్న) కాలేజీల్లో కోర్సులకు కూడా ఆప్షన్స్ ఇవ్వండి. ఒక మాదిరి ర్యాంకు వచ్చినవారు, మంచి ర్యాంకు రానివారు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్‌లు ఇస్తే సీటు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. మీ ర్యాంకు, లోకల్ ఏరియా, రిజర్వేషన్ కేటగిరీ, ఇచ్చిన ఆప్షన్ల ప్రాధాన్యతా క్రమం, తదితర అంశాలను అనుసరించి సీటు అలాట్‌మెంట్ జరుగుతుంది.
కోర్సుల ఆప్షన్స్ ఒకే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇష్టమైన కోర్సుల్నే ముందు వరుసలో ఉంచడం మంచిది. అవసరం లేని కోర్సుల జోలికి వెళ్లొద్దు. కంప్యూటర్‌లో ఆప్షన్లను ప్రవేశపెట్టడానికి ముందే, చేతి రాత ఆప్షన్ ఫారమ్‌లో వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే, తర్వాత తప్పులు జరగవు. సమయం కూడా ఆదా అవుతుంది. ముఖ్యంగా హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చే అభ్యర్థులు కాలేజీలు, బ్రాంచీల విషయంలో పూర్తిస్థాయిలో సంసిద్ధులై కేంద్రాలకు వెళ్లాలి.
పాస్‌వర్డు జాగ్రత్త...
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఇంటర్నెట్ ద్వారా ఆప్షన్లను నమోదు చేయడం కీలకమైన ప్రక్రియ. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (6.0 నుంచి 8.0 వెర్షన్లు) మాత్రమే దీనికి ఉపయోగించాలి. నెట్‌స్కేప్ నేవిగేటర్, క్రోమ్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ల ద్వారా ఆప్షన్లు ఇవ్వడం వీలుకాదు. వెబ్‌సైట్ ద్వారా పాస్‌వర్డ్ జనరేట్ చేసుకునేటప్పుడు గోప్యత పాటించాలి. ఈ పాస్‌వర్డ్ ఏటీఎం పిన్ లాంటిది. వెబ్‌సైట్‌లో లాగిన అవడం దగ్గర్నుంచి ఆప్షన్లు ఇవ్వడం, మార్చడం, ఆప్షన్లను తొలగించడం, అలాట్‌మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకోవడం... ఇలా ప్రతి దశలోనూ పాస్‌వర్డ్ తప్పనిసరిగా అవసరం. పాస్‌వర్డ్‌లో 8 నుంచి 10 అక్షరాలు ఉండాలి. వీటిలో అంకెలు కూడా ఉంటే మంచిది. ఈ పాస్‌వర్డ్‌ను, లాగిన్ ఐడీ ఉన్న స్క్రాచ్ కార్డును అత్యంత గోప్యంగా ఉంచుకోవాలి. మీ మిత్రులకు కూడా తెలియకుండా ఉంచుకోవడం మేలు.
వెబ్‌సైట్ ద్వారా ఇచ్చే ఆప్షన్లు సేవ్ అవుతుందీ, లేనిదీ తెలుసుకోవాలి. ఆప్షన్లను నమోదు చేసేటప్పుడు 'సేవ్ అండ్ లాగ్ అవుట్' మీద క్లిక్ చేస్తే అప్పటివరకు ఇచ్చిన ఆప్షన్లు సేవ్ అవుతాయి. మీ ఆప్షన్లను నిర్ణీత గడువులోపు ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. అయితే మార్చుకున్న ప్రతిసారీ సరిగా సేవ్ చేయడం, ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు. లేకపోతే ఎక్కడ, ఏమి మారుస్తున్నారో అర్థం కాదు.
మలిదశ కౌన్సెలింగ్‌లో...
సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత వెబ్‌సైట్ ద్వారా అలాట్‌మెంట్ వివరాలను తెలుసుకోవచ్చు. మీకు లభించిన కాలేజీ, కోర్సుతో తృప్తి చెంది, వాటిలో చేరాలనుకుంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫీజు (వర్తిస్తే) చలానాను కూడా ప్రింటవుట్ తీసుకోవాలి. ఆంధ్రా బ్యాంకు లేదా ఇండియన్ బ్యాంకు శాఖలో ఫీజు చెల్లించి, చలానాను, అలాట్‌మెంట్ ఆర్డర్‌ను నిర్ణీత గడువులోగా కాలేజీలో సమర్పించాలి. దీంతో మీరు ఆ కాలేజీలో చేరినట్లు పరిగణిస్తారు. గడువు తేదీలోగా ఇవి కాలేజీలో సమర్పించకపోతే మీ సీటు రద్దవుతుంది.
ఒకవేళ కేటాయించిన సీటు మీకు నచ్చకపోతే, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ కాలేజీకి వెళ్లవద్దు. మళ్లీ కౌన్సెలింగ్ కోసం వేచి చూడాలి. మలిదశ కౌన్సెలింగ్ ఉంటే అందులో పాల్గొనవచ్చు. అప్పటివరకు అసలు కౌన్సెలింగ్‌లో పాల్గొననివారు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొని సీటు అలాట్ కానివారు కూడా మలిదశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
ఒకవేళ మొదటి దశలో అలాట్ అయిన కాలేజీలో రిపోర్టు చేసినప్పటికీ మలిదశ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ మీకు నచ్చిన కాలేజీ, కోర్సులో సీటు వస్తే వదులుకోవద్దు, తర్వాతి కౌన్సెలింగ్‌కు వెళ్లి ఇబ్బందిపడొద్దు.
అడ్మిషన్ రద్దు చేసుకోవడం...
కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిశాక కూడా సీటును రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తారు. నిర్ణీత గడువులోగా దీన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. గడువు తర్వాత సీటు రద్దు విషయంలో ఎంసెట్ కన్వీనర్‌కు సంబంధం ఉండదు. సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌కే దీనిపై నిర్ణయాధికారం ఉంటుంది.
కచ్చితమైన ప్రణాళికతో కౌన్సెలింగ్‌లో పాల్గొంటే ఎలాంటి గందరగోలం లేకుండా, మీ ర్యాంకునకు తగిన, అనుకున్న కాలేజీలో ప్రవేశం సాధించే వీలుంటుంది. ఆప్షన్ల ఎంపిక, రిజర్వేషన్‌లు ఉపయోగించడం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటుండాలి. ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోతే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో కావాల్సిన వివరాలను పొందుపరచి మరో పాస్‌వర్డ్‌ని పొందవచ్చు.
ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యకు మించి ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. కంగారుపడి మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, డబ్బులను అనధికార, అపరిచిత వ్యక్తులు, మధ్యవర్తులు, బ్రోకర్లు, ఏజంట్లకు ఇవ్వకూడదు. అలాగే మీ పాస్‌వర్డ్, ఇతర వివరాలను కూడా ఎవరికీ చెప్పకూడదు. అంతగా అవసరం అనుకుంటే హెల్ప్‌లైన్ కేంద్రాల వద్ద ఉండే సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. ఆప్షన్స్ ఎంట్రీ చేశాక లాగ్ అవుట్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజర్‌ను క్లోజ్ చేయడం మర్చిపోవద్దు. నచ్చిన కోర్సు, మెచ్చిన కాలేజీలో సీటు రావాలని ఆశిద్దాం!