line decor
  HOME  ::  
line decor
   

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్....సందేహాలు - సమాధానాలు

ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న అభ్యర్థులకు ఎన్నో సందేహాలు ఎదురవుతుంటాయి. తనిఖీకి తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్‌ల దగ్గర్నుంచి, కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకోవడం, రిజర్వేషన్లు, కేటాయించిన సీటు నచ్చకపోతే రద్దు చేసుకోవడం లాంటి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అలాంటి వాటికి సమాధానాలు...

సర్టిఫికెట్‌ల తనిఖీ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది?

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్లలో సర్టిఫికెట్‌ల తనిఖీ జరుగుతుంది. అభ్యర్థులు తమ తమ ర్యాంకులకు కేటాయించిన తేదీల్లో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావాలి. కేటగిరీలు, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల తనిఖీ వివరాలను కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌లో తెలియజేశారు. ఎంసెట్‌ అధీకృత వెబ్‌సైట్‌లో కూడా ఈ వివరాలు లభిస్తాయి.
సర్టిఫికెట్‌ల తనిఖీకి ఏయే పత్రాలు తీసుకెళ్లాలి?

అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తనిఖీకి తీసుకెళ్లాలి. ఇవేమిటంటే... ఎంసెట్‌ ర్యాంకు కార్డు, హాల్‌ టికెట్‌, ఇంటర్మీడియట్‌ మార్కుల జాబితా కమ్‌ పాస్‌ సర్టిఫికెట్‌, పదో తరగతి మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్‌లు, 1 జనవరి 2012 తర్వాత జారీచేసిన ఆదాయ ధృవీకరణ పత్రం (తల్లిదండ్రుల వార్షికాదాయం ఓసీ, బీసీలకు రూ.లక్షలోపు, ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షల లోపు ఉండాలి). కుల ధృవీకరణ పత్రం, ఎన్‌సీసీ / స్పోర్ట్స్‌ / క్యాప్‌ / మైనారిటీ, తదితర ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులైతే సంబంధిత పత్రాలు తీసుకెళ్లాలి.

సొంత జిల్లాలోనే వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలా?

అలాంటి నిబంధన లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రం నుంచైనా వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఏదైనా ఇంటర్నెట్‌ సెంటర్‌ లేదా ఇంటిలోని నెట్‌ నుంచి కూడా వెబ్‌ ఆప్షన్లు ఇవ్వొచ్చు.

సర్టిఫికెట్ల తనిఖీ రోజు ఆరోగ్యం సరిగా లేకపోతే నా బదులు ఇతరులను పంపించవచ్చా?

పంపించవచ్చు. అయితే మీరు అనారోగ్యానికి గురైనట్లు ధృవీకరిస్తూ డాక్టర్‌ సర్టిఫికెట్‌ తీసుకురావడం తప్పనిసరి. స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులు మాత్రం స్వయంగా హాజరు కావాల్సిందే.

స్పెషల్‌ కేటగిరీల అభ్యర్థులు సర్టిఫికెట్ల తనిఖీకి ఎక్కడైనా హాజరు కావచ్చా?

వీలుకాదు. హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో మాత్రమే వీరికి సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ ఫామ్‌లో నా కేటగిరీ తప్పుగా పడింది. సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో ఈ విషయం సంబంధిత అధికారికి తెలియజేయలేదు. తర్వాత మార్చుకోవచ్చా?

వీలుకాదు. సర్టిఫికెట్ల తనిఖీ పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్‌ ఫామ్‌లో వివరాలను క్షుణ్నంగా చెక్‌ చేసుకోవడం అభ్యర్థి బాధ్యత.

సర్టిఫికెట్ల తనిఖీ సరిగా జరిగిందీ, లేనిదీ తెలుసుకోవడం ఎలా?

తనిఖీ కౌంటర్‌ నుంచి వెళ్లే ముందు రశీదును సరిగా చెక్‌ చేసుకోవాలి. అందులో ఏమైనా తప్పులుంటే తక్షణం వెరిఫికేషన్‌ ఆఫీసర్‌కు చెప్పి సరి చేయించుకోవాలి. వెబ్‌సైట్‌లో View Options & Bio-data మీద క్లిక్‌ చేయడం ద్వారా కూడా వెరిఫికేషన్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

కాలేజీ వివరాలు ఎలా తెలుసుకోవాలి?

వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 'Institute Profile'మీద క్లిక్‌ చేస్తే సంబంధిత కాలేజీ వివరాలు వస్తాయి.

ఒక కాలేజీలో ఎన్ని బ్రాంచిలను ఎంచుకోవచ్చు?

అన్ని బ్రాంచిలను ఎంచుకోవచ్చు. అన్ని కాలేజీల్లోనూ మీకు ఇష్టమైన సంఖ్యలో బ్రాంచిలను ఎంచుకోవచ్చు. కాలేజీలను, బ్రాంచిలను సరైన ప్రాధాన్యంలో అమర్చడం చాలా ముఖ్యం.

ఇంటర్నెట్‌ ద్వారా వెబ్‌ ఆప్షన్లు ఒకసారి ఇచ్చాక మళ్లీ మార్చుకోవచ్చా?

కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌లో మీ ర్యాంకుకు కేటాయించిన తేదీ, సమయంలోగా ఎన్నిసార్లయినా ఆప్షన్లు మార్చుకోవచ్చు. గడువు ముగిశాక మళ్లీ నిర్దిష్ఠ తేదీల్లో మార్చుకునే అవకాశం ఉంటుంది.

నేను అబ్బాయిని. నా ర్యాంకు 120, ఓసీ కేటగిరీ. ఇదే కేటగిరీలో 185 ర్యాంకు వచ్చిన అమ్మాయికి సీటు వచ్చింది కానీ నాకు రాలేదు. ఎందుకని?

అమ్మాయిలకు 33.1/3 శాతం సీట్లు రిజర్వు అయి ఉంటాయి. ఆ కోటాలో వచ్చి ఉంటుంది.

నేను బీసీ-ఎ కేటగిరీ విద్యార్థిని. కానీ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌లో బీసీ-బి అని వచ్చింది. నేను ఏమి చేయాలి?

నిబంధనల ప్రకారం ఏదైనా కేటగిరీలో మిగిలిపోయిన సీట్లు దాని తర్వాత కేటగిరీకి మారుస్తారు. ఉదాహరణకు బీసీ-ఎ కేటగిరీలో మిగిలినవి బీసీ-బి కి మారతాయి. బీసీ-ఎ, బీసీ-బిలలో మిగిలిన సీట్లు బీసీ-సి కేటగిరీకి మారతాయి. అలా బీసీ-బి కేటగిరీలో మిగిలిపోయిన సీటు మీకు అలాట్‌ అయి ఉంటుంది.

కేటాయించిన సీటు వద్దనుకుంటే చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తారా?

ఇస్తారు. దగ్గర్లోని హెల్ప్‌ లైన్‌ కేంద్రాన్ని సంప్రదించి ఒరిజినల్‌ చలానా, చిరునామా వివరాలు ఇవ్వాలి. 4 నుంచి 6 వారాల్లోగా ఆ చిరునామాకు డి.డి. రూపంలో ఫీజు పంపిస్తారు.

మెదక్‌ జిల్లాలో నివశిస్తున్నాను. కరీంనగర్‌ జిల్లా తహశీల్దారు ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రం ఉంది. ఫీజు మినహాయింపు పొందడానికి ఇది సరిపోతుందా?

సరిపోదు. మీరు ఎక్కడ నివశిస్తున్నారో ఆ ప్రాంతానికి చెందిన తహశీల్దారు జారీచేసిన ఆదాయ ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుతుంది.

వెబ్‌ కౌన్సెలింగ్‌లో సీటు రాలేదు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు వెనక్కి తీసుకోవచ్చా?

తీసుకోవచ్చు. తర్వాతి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే మాత్రం ఒరిజినల్‌ సర్టిఫికెట్లను మళ్లీ సమర్పించాలి. వెనక్కి తీసుకోకపోతే, నేరుగా మలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

నాకు సీటు వచ్చిన కాలేజీలో చేరడం ఇష్టం లేదు. తర్వాతి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చా?

ఫీజు చెల్లించకుండా, తర్వాతి దశ కౌన్సెలింగ్‌ ఉంటే, అందులో పాల్గొనవచ్చు. ఒకవేళ ఫీజు చెల్లిస్తే, చలానాను, అలాట్‌మెంట్‌ లెటర్‌ను కాలేజీలో ఇవ్వకూడదు.

మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఒక కాలేజీలో సీటు వచ్చింది. రెండో దశలో వేరే కాలేజీలో వచ్చింది. మొదటి కాలేజీలోనే చేరడం వీలవుతుందా?

ఇలా చేరడం వీలు కాదు. కౌన్సెలింగ్‌ ప్రకారం రెండో దశలో వచ్చిన కాలేజ్‌లోనే మీకు సీటు అలాట్‌ అయినట్లు పరిగణిస్తారు. మీ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజు కూడా రెండో కాలేజీకే వెళ్తాయి.