line decor
  HOME  ::  
line decor
   

 ఎంసెట్‌లో మీ ర్యాంకు అంచనా!

ఎంసెట్ 'కీ' విడుదలయ్యాక తమకు ఎన్ని మార్కులు రావొచ్చో విద్యార్థులకు అంచనాలు ఏర్పడ్డాయి. వాటి ఆధారంగా ఏ ర్యాంకు వచ్చే వీలుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ వారిలో సహజం. ఇప్పుడు సీనియర్ ఇంటర్ బైపీసీవారు రాయబోయే పరీక్ష 'నీట్'కోసం తమ పఠనం తీరును మల్చుకోవాల్సివుంది. కీలకమైన ఈ అంశాలపై మార్గదర్శనం.. ఇదిగో!
ఇంటర్ తరవాత విద్యార్థులు రాసే ప్రవేశ పరీక్షల్లో అధిక భాగం పూర్తయ్యాయి. ఎంసెట్ కూడా ముగిసింది. ఇప్పుడిక ఏ విద్యాసంస్థలో చేరాలి, విధి విధానాలు ఎలా ఉంటాయి? అనే అంశాలపైనే విద్యార్థుల ఆలోచనలు! ఎం.పి.సి./ బై.పి.సి. విద్యార్థులు ఎంసెట్‌లో వచ్చే మార్కుల ఆధారంగా వివిధ కళాశాలల్లో చేరే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎం.పి.సి. పేపరు కొంత కష్టంగా ఉందనే చెప్పొచ్చు. మేథమ్యాటిక్స్‌లోని 80 ప్రశ్నలలో దాదాపు 74 అకాడమీ పుస్తకం లేదా అకాడమీ బిట్ బ్యాంకు నుంచి ఇవ్వడం జరిగింది. అయితే వాటిలో అధిక ప్రశ్నలు విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ప్రశ్నలు ఎక్కువగా నిడివిగా ఉండటం వల్ల నిర్ణీత కాలవ్యవధిలో చేయడానికి విద్యార్థులు కష్టపడాల్సి వచ్చింది. ఫిజిక్స్ పేపరు మధ్యస్థంగా ఉంది కానీ రెండు లెక్కలు చేయడానికి చాలా సమయం పట్టింది. ఈ అన్నింటిలో గత సంవత్సరాలతో పోలిస్తే విద్యార్థులకు కొంత మార్కులు తగ్గే అవకాశం ఉంది.
వెయిటేజి లెక్కింపు
తుది ర్యాంకు నిర్థారణకు ఎంసెట్ మార్కులను 75కు కుదించి మిగిలిన 25 మార్కులకు ఇంటర్ వెయిటేజిని లెక్కిస్తారు. ఇంటర్ వెయిటేజి కోసం కేవలం గ్రూపు సబ్జెక్టుల్లో 600 మార్కులకు విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో వాటిని 25కి కుదిస్తారు.
ఇంటర్‌లో గ్రూపు సబ్జెక్టుల్లో విద్యార్థికి 24 మార్కుల తేడా వస్తే తుది వెయిటేజిలో ఒక మార్కు తేడా వస్తుంది.
ఉదా: ఒక విద్యార్థి 600 మార్కులకు 500 మార్కులు సాధిస్తే అతను పొందే తుది వెయిటేజి 500/600ప25= 20.83.
ఎంసెట్‌లో సుమారుగా ప్రతి రెండు మార్కులకూ తుది వెయిటేజిలో ఒక మార్కు మారుతుంది. అందువల్ల తుది ర్యాంకు నిర్థారణలో ఎంసెట్ మార్కుకు అధిక ప్రాధాన్యం!
విశ్వవిద్యాలయ కళాశాలలో...
ఎంసెట్‌లో 100 మార్కుల పైన సాధించినవారికి విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉంది. 80 పైన సాధించిన విద్యార్థులు కూడా పాత ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందడానికి వీలుంది.
మెడికల్ విభాగం సంగతి?
ఎంసెట్ మెడికల్ విభాగంలో పరీక్ష సులభంగా ఉంది. బయాలజీలో కూడా విద్యార్థికి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు లేవు. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో నిడివైన కాలిక్యులేషన్ ఉండటం వల్ల విద్యార్థులు తప్పులు అధికంగా చేశారు. ర్యాంకు నిర్థారణ కెమిస్ట్రీతో జరగవచ్చు. పేపరు సులభంగా ఉన్నప్పటికీ రాసినవారు తప్పులు అధికంగా చేశారు. దీనివల్ల గరిష్ఠ మార్కు తగ్గుతున్నది కానీ 130 మార్కులు సాధించే విద్యార్థుల సంఖ్య పెరిగింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది కాబట్టి కటాఫ్ మార్కు పెరుగుతుంది. గత సంవత్సరం 107 మార్కుల వరకు మెడిసిన్‌లో సీటు వచ్చింది. కానీ ఈ ఏడాది ఈ మార్కు 115 మార్కులకు పెరిగే అవకాశం ఉంది. రిజర్వేషను విద్యార్థులకూ, జనరల్ కేటగిరి వారికీ మెడిసిన్ విభాగంలో పెద్దగా తేడా ఉండటం లేదు. గరిష్ఠంగా రెండు లేదా మూడు మార్కుల వ్యత్యాసం ఉంటుంది. అంటే రిజర్వేషను విద్యార్థులు కూడా 110 మార్కులపైనే సాధించవలసి ఉంటుంది.
గత ఏడాది...
గత సంవత్సరం 136 మార్కుల పైన వచ్చిన విద్యార్థులు ఉస్మానియా పరిధిలోని ప్రభుత్వ కళాశాలలోనూ, 122 మార్కుల పైన వచ్చినవారు ప్రైవేటు కళాశాలలో కేటగిరి- ఎ లోనూ, 115 మార్కుల పైన వచ్చిన వారు కేటగిరి- బి లోనూ సీటు సాధించారు.
ఉస్మానియా కంటే ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 4 మార్కుల వరకు తక్కువగా ఉన్నా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఆంధ్రా యూనివర్సిటీ కంటే ఇంకా ఐదు మార్కులు తక్కువగా ఉన్నా సీటు పొందారు. ఈ సంవత్సరం కూడా యూనివర్సిటీ పరంగా ఇదేవిధంగా లెక్కించవచ్చు.
కేటగిరి- ఎ లేదా కేటగిరి- బిలో మార్పు ఫీజు మాత్రమే. కేటగిరి- ఎ అయితే రూ. 65 వేలు. కేటగిరి 'బి' అయితే రూ. రెండు లక్షల వరకు సంవత్సరానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలలో ఫీజు రూ. పది వేలు ఉంటుంది.
ఎం.బి.బి.ఎస్. ప్రాధాన్యం ఎంత ఉందో ఇప్పుడు బి.డి.ఎస్.కు కూడా దాదాపు అంతే ప్రాధాన్యం ఉంది. ఈ సంవత్సరం తుది ఎంసెట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విద్యార్థులు ఏ కోర్సుకు వెళ్లేదీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.


ఎంసెట్ ర్యాంక్ లెక్కింపు విధానం

మీకు ఇంటర్ మార్కులు తెలుసు; ఎంసెట్ మార్కులూ తెలుసు. ఈ రెండిటి ఆధారంగా దాదాపు మీకు రాగల ర్యాంకును నిర్థారించుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలో ఇంప్రూవ్‌మెంట్ అవకాశం లేదు కాబట్టి పాస్ కాని విద్యార్థులకు మాత్రమే ఆ ఫలితాల వల్ల ర్యాంకు నిర్థారణ జరుగుతుంది. కానీ 95 శాతంపైగా విద్యార్థులు ఇంటర్ పూర్తిచేసుకున్నారు కాబట్టి వీరి ర్యాంకును సుమారుగా నిర్థారించుకోవచ్చు.
ప్రాక్టికల్స్‌తో కలిపి గ్రూపు సబ్జెక్టుల్లో 600కు వచ్చిన మార్కులను 25కి కుదించాలి. అంటే ఇంటర్ ఒక మార్కుకు వచ్చే వెయిటేజీ:
1/600 x 25 = 0.041666.
ఎంసెట్‌లో 160 మార్కులకు వచ్చిన మార్కులను 75 మార్కులకు కుదించాలి. అంటే ఎంసెట్ ఒక మార్కుకు వచ్చే వెయిటేజి:
1/160 x 75 = 0.46875.
ఇంటర్లో విద్యార్థి సాధించిన 11 లేదా 12 మార్కులు ఎంసెట్‌లో 1 మార్కుకు సమానం. దీని ఆధారంగానే ర్యాంకు అవకాశాన్ని విశ్లేషిద్దాం!
పట్టిక చూడండి...
ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో ప్రతి మార్కుకూ ఆపైన ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఉంది. ఒకవేళ ఇంటర్ వెయిటేజీ తీసుకోకపోతే అదే విద్యార్థి తుది ర్యాంకు అయివుండేది! ఇంటర్ వెయిటేజీలో 600 మార్కులకు 600 వస్తే విద్యార్థి ర్యాంకు అదే ర్యాంకు కానీ, అంతకంటే తక్కువ ర్యాంకు కానీ వస్తుంది. ఆ విద్యార్థికే 577 మార్కులు వస్తే ఇంటర్ వెయిటేజిలో ఎంసెట్ మార్కుతో పోల్చుకున్నపుడు 2 మార్కులు తగ్గే అవకాశం ఉంది. మొత్తం ఆ మార్కులు సాధించిన విద్యార్థుల్లో కొందరి ఇంటర్ మార్కులు ఈ విద్యార్థికంటే ఎక్కువ ఉండే అవకాశముంది. కాబట్టి మొత్తం విద్యార్థుల్లో 50 శాతం తన మార్కును దాటినవారు ఉంటారని భావిస్తే -2 బదులు -1 గా తీసుకోవచ్చు. అప్పుడు దాదాపుగా తుది ర్యాంకుకు దగ్గరగా వస్తాము. అంటే ఆ విద్యార్థి ఎంసెట్‌లో సాధించిన మార్కులను ఒకటి తగ్గించి, ఆ మార్కు వరకు పట్టికలో ఉన్న విద్యార్థుల సంఖ్య చూడాలి. అదే విద్యార్థి ర్యాంకు అవుతుంది!
ఉదాహారణ చూద్దాం...
సురేశ్ అనే విద్యార్థికి ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 130 మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్‌లో 600కు 542 మార్కులు వచ్చాయి. ఇతడికి ఏ ర్యాంకు వస్తుందో పరిశీలిద్దాం!
పట్టిక చూడండి- ఎంసెట్‌లో 130 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు ఎంతమందున్నారు? 435 మంది.
ఇప్పుడు ఇంటర్ మార్కులను ఎంసెట్ మార్కులుగా మార్చాలి. ఇంటర్లో 11 లేదా 12 మార్కులు ఎంసెట్‌లో 1 మార్కుకు సమానమని అనుకున్నాం కదా! 600 - 542 = 58 58/11 = 5 (దాదాపు).
ఇలా ఇంటర్ మార్కులను ఎంసెట్ మార్కులుగా మార్చినపుడు 5 మార్కులు తగ్గాయి. కాబట్టి 130 - 5 = 125. ఈ 125 ఎంసెట్ మార్కులకు పట్టిక ప్రకారం చూస్తే వచ్చేది... 659 ర్యాంకు!
అయితే ఇక్కడ చిన్న తిరకాసుంది.
ఎంసెట్‌లో 130 మార్కులు వచ్చినవారందరికీ ఇంటర్లో కచ్చితంగా 542 మార్కులు రావు కదా! అంతకంటే ఎక్కువా రావొచ్చు; తక్కువా రావొచ్చు. 130 మార్కులు వచ్చినవారిలో 50 శాతం మంది సురేశ్ కంటే ఇంటర్‌లో ఎక్కువ మార్కులూ, 50 శాతం మంది సురేశ్ కంటే తక్కువ మార్కులూ తెచ్చుకునివుంటారని ఊహిద్దాం. అప్పుడు 130 - 5 కాకుండా 130 - 2 లేదా 130 - 3 అవుతుంది. అంటే సురేశ్ మార్కులు 127 లేదా 128.
ఇప్పుడు చూడండి... 127 మార్కులకు ర్యాంకు 557. 128 మార్కులకు చూస్తే ర్యాంకు 522. సురేశ్ తుది ర్యాంకు ఈ రకంగా 522 - 577 మధ్య ఉండే అవకాశముందన్నమాట!
గమనిక: ఈ కాల్‌క్యులేషన్ చేసేటపుడు గమనించాల్సింది- ప్రతి సందర్భంలోనూ ఇంటర్ మార్కులను మైనస్ చేయనక్కర్లేదు. ఎంసెట్‌లో ఎక్కువ మార్కులు వచ్చినవారి విషయంలో దాదాపు ప్రతి సందర్భంలో మైనస్ చేయాలి. కానీ తక్కువ మార్కులు వచ్చినవారి విషయంలో అది మైనస్ లేదా ప్లస్ ఏ విధంగా అయినా అవ్వొచ్చు. ఓ ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం.
రమేశ్‌కి ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 160 మార్కులకు 81 వచ్చాయి. కానీ ఇంటర్లో 600కు 595 మార్కులు వచ్చాయి.
పట్టిక చూడండి... 81 మార్కులు ఆపైన తెచ్చుకున్నవారు 12,170 మంది. వీరందరి వెయిటేజి కంటే రమేశ్ ఇంటర్ మార్కులు ఎక్కువే! అవి ఎంసెట్ మార్కులుగా మారిస్తే 3 లేదా 4 అదనంగా ఉండొచ్చు. కాబట్టి రమేశ్ మార్కులను 84 లేదా 85గా భావించి ర్యాంకును నిర్ణయించుకోవాలి. ఇతడి ర్యాంకు 9756 - 10,868 మధ్య ఉండొచ్చు!
స్థూలంగా చెప్పాలంటే- ఎంసెట్‌లో 120 మార్కులపైన వస్తే ఇంటర్ మార్కులను మైనస్ చేయాలి. 120లోపు వచ్చిన విద్యార్థుల ఇంటర్ మార్కులు విద్యార్థుల సగటు మార్కు కంటే ఎక్కువుంటే ప్లస్ చేయటం, సగటు మార్కు కంటే తక్కువుంటే మైనస్ చేయటం చేయాలి. ఇలా చేస్తేనే ఎంసెట్ ర్యాంకును దాదాపు కచ్చితంగా నిర్థారించుకోవటం సాధ్యమవుతుంది.
మెడికల్ విభాగంలో ...
హాసినికి ఎంసెట్‌లో 120 మార్కులు, ఇంటర్లో 565 వచ్చాయి. పట్టిక చూడండి. మెడికల్ విభాగంలో 120 ఆపైన మార్కులు వచ్చినవారు 1054 మంది. ఇప్పుడు ఇంటర్ మార్కులను ఎంసెట్ మార్కులుగా మారిస్తే 3 మార్కులు మైనస్ అవుతాయి. అంటే 117 మార్కులు. కానీ సగటున 1.5 లేదా 2 మార్కులనే మైనస్ చేద్దాం. అప్పుడు హాసిని తుది మార్కు 118 లేదా 119 అవుతుంది. ఈ ప్రకారం పట్టికను చూస్తే... ఆమెకు 1122- 1183 మధ్య ర్యాంకు వస్తుంది!