ఎంసెట్‌లో ఏ మార్కుకు ఏ ర్యాంకు?

ఎంసెట్‌ ముగిసింది...! ఇంజినీరింగ్‌, మెడికల్‌ విభాగాల్లో పరీక్ష రాసిన విద్యార్థులు వివిధ సంస్థలు ప్రకటించిన అనధికారిక 'కీ'ల ఆధారంగా రాబోయే ర్యాంకు గురించి తర్జనభర్జనలు పడుతున్నారు. దాని ఆధారంగా ఏ కళాశాలలో సీటు వచ్చే అవకాశముందో బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ మార్కుకు ఏ ర్యాంకు వచ్చే అవకాశం ఉందో గ్రహించటానికి ఉపకరించే పట్టికలను ఇస్తున్నాం!

ఎంసెట్‌ తుది ర్యాంకు నిర్ధారణకు విద్యార్థి ఇంటర్మీడియట్‌లో గ్రూపు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను 25కు కుదిస్తారు. అంటే లాంగ్వేజెస్‌ 400 మార్కులు వదిలేసి మిగిలిన 600 మార్కులకు విద్యార్థి సాధించిన మార్కులను 25కు కుదిస్తారు. అంటే ఇంటర్‌లో గ్రూప్‌లో పొందిన ప్రతి 24 మార్కులకూ ఎంసెట్‌లో ఒక మార్కు వెయిటేజి వస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్స్‌తో కలిపి గ్రూపు మార్కులను లెక్కిస్తారు. ఈ ఇంటర్‌ మార్కులు ర్యాంకును అంతగా ప్రభావితం చేయకపోయినా తుది ర్యాంకు నిర్ధారణకు ఉపయోగపడతాయి.
ఇక ఎంసెట్‌లో 160 మార్కులకు విద్యార్థి సాధించిన మార్కులను 75కి కుదిస్తారు. ఈ రెంటినీ కలిపిన మార్కుల ఆధారంగా తుది ర్యాంకు నిర్ధారణ జరుగుతుంది. ఎంసెట్‌లో ఒక మార్కు అనేది ఇంటర్లో దాదాపు 14 మార్కుల వరకూ సమానమవుతుంది. ఇంటర్మీడియట్‌ మార్కులు ఎంసెట్‌ ర్యాంకును పెద్దగా ప్రభావితం చేయవు కాబట్టి ఆ మార్కులను ఈ పట్టికల్లో పరిగణనలోకి తీసుకోలేదు.
ఇంజినీరింగ్‌ విభాగం చూస్తే- మాథమేటిక్స్‌ పేపర్‌ గతంతో పోలిస్తే కొంత నిడివిగా ఉందని చెప్పవచ్చు. దాదాపు 15 ప్రశ్నల వరకు జేఈఈ- మెయిన్‌ పరీక్ష స్థాయిలోని ప్రశ్నలున్నాయి. అందువల్ల మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌కు తయారయ్యే విద్యార్థులకు పేపరు అనువుగా ఉంది. అయితే ఆ విద్యార్థులకు 24వ తేదీనే అడ్వాన్స్‌డ్‌ కాబట్టి కొంతమంది ఎంసెట్‌ను ముఖ్యమైన పరీక్షగా పరిగణించలేదు. పది ప్రశ్నల వరకు నిడివిగా ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా గత సంవత్సరంతో పోలిస్తే మార్కులు అన్ని స్థాయుల్లో తగ్గే అవకాశం ఉంది.
భౌతికశాస్త్రం గత సంవత్సరంతో పోలిస్తే కొంత సులభంగానే ఉంది. అయితే మాథమేటిక్స్‌, కెమిస్ట్రీ పూర్తిచేసి ఫిజిక్స్‌ చేస్తున్నారు కాబట్టి సమయపాలన కూడా ఇబ్బంది అయింది.
గతంతో పోలిస్తే గత సంవత్సరపు మార్కుకు ఈ సంవత్సరం కొంత మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. అయితే ఇది వివిధ విద్యార్థుల విశ్లేషణను క్రోడికరించడమే కాబట్టి స్వల్పంగా మార్పులు ఉండే అవకాశ ముంటుంది.
గత సంవత్సరం అంటే 2013లో తొలిర్యాంకు 154 మార్కులకు ప్రారంభమై 10వ ర్యాంకు 151 మార్కులకు, 20వ ర్యాంకు 148 మార్కులకు, 30వ ర్యాంకు 147 మార్కులకు, 40వ ర్యాంకు 145 మార్కులకు, 50వ ర్యాంకు 144 మార్కులకు, 100వ ర్యాంకు 140 మార్కులకు వచ్చింది.
ఈ సంవత్సరం గరిష్ఠ మార్కు అక్కడే ప్రారంభం కావచ్చు. కానీ 10వ ర్యాంకు 150 మార్కుల వరకు, 100వ ర్యాంకు 138 మార్కుల వరకూ వచ్చే అవకాశం ఉంది. మిగిలిన మార్కులు సుమారుగా ర్యాంకుల పరిధి కూడా కింది విధంగా ఉండే అవకాశం ఉంది.

మెడికల్‌ సంగతేమిటి?

ఎంసెట్‌ మెడికల్‌ విభాగపు పేపర్‌ గత సంవత్సరం కంటే సులభంగానే ఉంది. అయితే జువాలజీలో 2 ప్రశ్నలు, బోటనీలో ఒక ప్రశ్న వివిధ సంస్థల 'కీ'లలోనే తేడా ఉంది. అంటే కొంత సందిగ్ధత ఉండడం వల్ల గత సంవత్సరం కంటే మార్కు అదే ర్యాంకుకి 1, 2 మార్కులు తగ్గే అవకాశం ఉంది. ఫిజిక్స్‌లో కూడా 2 ప్రశ్నలు ఆలోచించి సమాధానం రాయాల్సిన విధంగా ఉన్నాయి. అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులు చేయగల విధంగానే ఉన్నాయి. కానీ సాధారణ విద్యార్థికి గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గేట్లుగా ఉన్నాయి.
కటాఫ్‌ మార్కు అంటే సీటు సాధించడానికి కావాల్సిన మార్కు ఈ సంవత్సరం కూడా 117 వరకు ఉండే అవకాశం ఉంది.
రాసిన విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి కటాఫ్‌ పెరగాలి. కానీ కొన్ని ప్రశ్నల్లో తేడా వల్ల గత సంవత్సరంలాగే ర్యాంకులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ర్యాంకుల మీద స్పష్టత తుది 'కీ'లో సవరణల మీద ఆధారపడి ఉంటుంది. సవరణలు ఏమీ లేకపోతే పట్టికలో చూపిన విధంగానే ఉండే అవకాశం ఉంది.