ఎంత ర్యాంకు వస్తే... ఎంబీబీఎస్‌ సీటు?

ఎంసెట్‌ మెడికల్‌ విభాగంలో పోటీ అత్యధికంగా ఉన్నప్పటికీ దీక్షగా సాధన చేసి ఎంబీబీఎస్‌ ఆశావహులు ర్యాంకులు సాధించారు. ఏయే ర్యాంకులకు సీట్లు వచ్చే అవకాశం ఉందో బేరీజు వేసుకునే తరుణమిది. అందుకు గత ఏడాది సీట్ల కేటాయింపు తీరు ఎలా ఉందో విశ్లేషించుకోవటం అవసరం!

2014లో జరిగిన ఎంసెట్‌ మెడికల్‌ విభాగంలో మొత్తం 1,06,396 మంది పరీక్షకు హాజరైతే 98,292 మంది అర్హత సాధించారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులు 25% కనీస మార్కులుంటేనే అర్హులవుతారు. ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు ఎటువంటి కటాఫ్‌ మార్కు లేదు. అంటే సున్నా మార్కులు వచ్చినా ర్యాంకు పొందటానికి అర్హులే.
తెలంగాణ రాష్ట్రం నుంచి పరీక్షకు హాజరైన 51,278 మందిలో ర్యాంకులు పొందినవారు 41,529. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి పరీక్షకు హాజరయిన 52,859 మందిలో అర్హత సాధించినవారు 45,571. అదేవిధంగా స్థానికేతరులు అంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు విద్యార్థులు 2259 మంది పరీక్ష రాశారు. వీరిలో అర్హత సాధించినవారు 1387.

ఇక ఈ విద్యార్థులు ఏ మెడికల్‌ కళాశాలలో చేరాలి? సీటు వస్తుందా? రాదా? అనే సంశయంతో ఉంటారు, గత సంవత్సర తుది ర్యాంకులు చూస్తే ఏ కళాశాలలో సీటు సాధించవచ్చో అవగాహన కలుగుతుంది. (ఎంబీబీఎస్‌- 2013 తుది ర్యాంకుల వివరాలున్న పట్టికలు పక్కన చూడండి). ఈ జాబితా రెండో కౌన్సెలింగ్‌కు సంబంధించి కాబట్టి ఇంతకంటే తక్కువ ర్యాంకుకే సీటు కటాఫ్‌ అయ్యే అవకాశం ఉంది.
ఇంజినీరింగ్‌ విభాగంలో ర్యాంకు సాధించిన విద్యార్థి ఆ కోర్సులో చేరకపోయే అవకాశం ఉంది. కానీ మెడికల్‌లో సీటు సాధించిన విద్యార్థులు వేరే కోర్సులకు వెళ్లే అవకాశమే లేదు. ఎయిమ్స్‌, జిప్‌మర్‌ లాంటి సంస్థలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య చాలా పరిమితమే. ఎంసెట్‌ మెడికల్‌ విభాగంలో సీటు సాధించిన ప్రతి విద్యార్థీ ఇక్కడే చేరడానికి అవకాశాలు అధికం.

 

కొందరు విశ్లేషకులు ఎంసెట్‌ ర్యాంకు సాధించి ఇంటర్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఎక్కువగా అంటే 8371 మంది ఉన్నారని వాదిస్తున్నారు. కానీ, వారి ర్యాంకు సీటు సాధించడానికి సరిపోయే ర్యాంకు కాదు. వీరిలో 126 మార్కులు సాధించి ఒక విద్యార్థి, 99 మార్కులు సాధించిన ఇద్దరు, 84 మార్కులు వచ్చిన ఇద్దరు, 64 మార్కులు సాధించిన ఆరుగురు ఉన్నారు. మిగిలినవారి మార్కులు 64లోపే. అంటే వారికి రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ ఎంబీబీఎస్‌లో సీటు సాధించడానికి ఎటువంటి అవకాశమూ లేదు.
కటాఫ్‌ ర్యాంకు మారుతుంది
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కాబట్టి కటాఫ్‌ ర్యాంకు మారుతుంది. అంటే, ఉత్తమ ర్యాంకులు వచ్చిన విద్యార్థులే సీటు సాధించడానికి అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌ వెబ్‌ విధానంలోనే జరుగుతుంది. విద్యార్థి ఆప్షన్లు జాగ్రత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఎంబీబీఎస్‌లో సీట్లు ముఖ్యంగా నాలుగు కేటగిరీలుగా చెప్పవచ్చు. గవర్నమెంట్‌ మెడికల్‌ కళాశాలలు, ప్రైవేటు కేటగిరీ-ఏ, కేటగిరీ- బీ, కేటగిరీ- సీ. మొదటి మూడింటిలో ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తారు కానీ ఫీజులో వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో అయితే రూ.10,000. ప్రైవేటు కేటగిరీ-ఏ రూ.65,000, కేటగిరీ-బీ రూ. 2,30,000 ఉన్నాయి. కేటగిరీ-సీ మీద స్పష్టత లేదు కాబట్టి వాటి భర్తీ గతంలో లాగానే జరిగే అవకాశం ఉంది. అయితే ఫీజు రూ.5,50,000 వరకు ఉంది. ప్రైవేటు కళాశాలల్లో ఫీజు వ్యత్యాసం తప్పించి మిగిలినవాటిలో ఎటువంటి తేడా ఉండదు.
ఎంబీబీఎస్‌లో ఏ విద్యార్థి అయినా క్లినికల్‌ ఎక్స్‌పోజర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో ఉస్మానియా లేదా గాంధీ మెడికల్‌ కళాశాలల్లో చదివే విద్యార్థికి ఉండే అవకాశం మిగిలిన కళాశాలల్లో లేదు.
అందుకే ఆ కళాశాలలకు అంత ప్రాధాన్యం! ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ విద్యార్థులు పాస్‌, ఫెయిల్‌, ఎంబీబీఎస్‌ పర్సంటేజీ వంటి విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా క్లినికల్‌ ఎక్స్‌పోజర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వగలిగితే భవిష్యత్తు బాగుంటుంది.

Back