మేలైన ప్రత్యామ్నాయం.. ఫార్మసీ

ఇంటర్మీడియట్‌లోని ఎంపీసీ, బైపీసీ- రెండు గ్రూపుల వారూ చేరగల కోర్సు ఫార్మసీ. వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ కోర్సులకు మేలైన ప్రత్యామ్నాయంగా బీ-ఫార్మసీని పేర్కొంటున్నారు. ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా దీనిలో ప్రవేశాలు జరుగుతాయి. మెరుగైన ప్రతిభ చూపిస్తే ఉపాధికి చక్కని అవకాశాలుంటాయి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫార్మా రంగం, దాని అనుబంధ పరిశ్రమలు రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చెందుతాయని అంచనా. వచ్చే దశాబ్దకాలంలో అనేక వందల ఫార్మా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలనుంచీ, ఇతర దేశాల నుంచీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయి. ఈ పరిశ్రమలకు కావాల్సిన బల్క్‌ డ్రగ్స్‌, కెమికల్స్‌, ఇతర ముడిపదార్థాలు, ప్యాకింగ్‌ మెటీరియల్స్‌, ఔషధ తయారీ, విశ్లేషణలకు అవసరమయ్యే యంత్ర సామగ్రి అత్యధిక భాగం తెలంగాణ నుంచి వెళ్లాల్సిందే.

నిపుణుల అంచనాల ప్రకారం రానున్న 5 సంవత్సరాల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఫార్మా పరిశ్రమల టర్నోవర్‌ రెట్టింపు అవుతుంది. ఈ స్థాయిలో పరిశ్రమ ఎదగడానికి ఫార్మసీ చదివిన నిపుణులు కూడా ఇప్పటి సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో అవసరమవుతారు.ఒకప్పుడు మెడిసన్‌, బీడీఎస్‌లలో సీట్లు రాని ఇంటర్‌ బయాలజీ వారు, ఇంజినీరింగ్‌లో సీటు రాని ఇంటర్‌ మేథమేటిక్స్‌ వారూ ఫార్మసీ వైపు మొగ్గు చూపేవారు. అయితే ఇప్పుడు సంప్రదాయ కోర్సులకు వన్నె తగ్గి, బీ-ఫార్మసీ వారికి మెండైన అవకాశాలు ఉండడం వల్లనూ ఈ కోర్సుకు గిరాకీ పెరిగింది.

రెండు రకాల డిగ్రీలు

ఫార్మసీలో రెండు రకాల డిగ్రీ కోర్సులు ఉన్నాయి. అవి నాలుగు సంవత్సరాల బీ-ఫార్మసీ, ఆరు సంవత్సరాల ఫార్మా-డీ.

 

బీ-ఫార్మసీ: అభివృద్ధి చెందిన దేశాల్లోని ఫార్మసీ కోర్సుకి విరుద్ధంగా భారత్‌లో బీ-ఫార్మసీ పూర్తిగా ఫార్మా ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. దీనిలో ఫార్మా పరిశ్రమలో ఔషధాలు తయారుచేసే విధానాలు, నూతన ప్రక్రియలు, తయారైన మందుల నాణ్యత విశ్లేషించే పద్ధతులు బోధిస్తారు.కోర్సులో భాగంగా ప్రతి విద్యార్థీ నెలరోజులపాటు పరిశ్రమలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా ఫార్మసీ కళాశాలలు ఈ సదుపాయం కల్పించలేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు.

బీ-ఫార్మసీ తరువాత రెండు సంవత్సరాల ఎం-ఫార్మసీ/ ప్రముఖ విద్యాసంస్థల్లో ఎంఎస్‌ చేసినా మంచి అవకాశాలుంటాయి.

ఫార్మా-డీ: ఈ ఆరేళ్ల కోర్సు క్లినికల్‌ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. మొదటి మూడు సంవత్సరాలు బీ-ఫార్మసీలో మాదిరిగానే కళాశాలలో పాఠ్యాంశాలు, ప్రాక్టికల్స్‌ నేర్పిస్తారు. ప్రతి నెలా అప్పుడప్పుడూ ఆస్పత్రి సందర్శనలు ఉంటాయి. నాలుగో సంవత్సరంలో కళాశాలలో బోధనతోపాటు వారానికి కనీసం రెండుసార్లు ఆస్పత్రి సందర్శనలుంటాయి. ఐదో సంవత్సరంలో ప్రతిరోజూ ఒకపూట ఆసుపత్రిలోని వార్డుల్లో రౌండ్లు, బెడ్‌సైడ్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. ఆరో సంవత్సరం పూర్తిగా హాస్పిటల్‌ ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ఈ రెసిడెన్సీ ప్రోగ్రాంలో కనీసం ఆర్నెల్లపాటు జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో, తర్వాత ఒక్కో విభాగంలో రెండు నెలల చొప్పున మూడు స్పెషాలిటీల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది.

ఈ కారణంగా ఫార్మా-డీ కోర్సు అందించే ప్రతి కళాశాలకూ అనుబంధంగా కనీసం 300 పడకల సదుపాయం ఉన్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌తో ఒప్పందం ఉండాలి. ఈ హాస్పిటల్‌లో జనరల్‌ మెడిసిన్‌తోపాటు కనీసం మరో మూడు స్పెషలైజేషన్లు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాక ఆస్పత్రిలో క్లినికల్‌ ఫార్మసీ విభాగం, డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఉండాలని ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) నిర్దేశిస్తోంది.

అర్హత: బీ-ఫార్మసీ, ఫార్మా-డీల్లో సగం సీట్లు ఇంటర్‌ మేథమేటిక్స్‌ వారికీ, మిగతా సగం ఇంటర్‌ బైపీసీ వారికీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారు. డిప్లొమా ఇన్‌ ఫార్మసీ (రెండు సంవత్సరాల కోర్సు చదివిన) వారు ఫార్మా-డీ కోర్సులో చేరడానికి అర్హులు.

ఉద్యోగావకాశాల సంగతి

మనదేశం ఔషధరంగంలో స్వయం సమృద్ధి సాధించడంతోపాటు గత సంవత్సరం సుమారు ఎనభైవేల కోట్ల రూపాయల విలువైన ఔషధాలు 230 దేశాలకు ఎగుమతి చేసింది. ఇప్పటికే దేశంలో తయారవుతున్న ఔషధాల్లో 30 శాతం హైదరాబాద్‌ కేంద్రంగా తయారవుతున్నాయి.

కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మా పరిశ్రమ రంగంలో నెలకొన్న స్తబ్ధత త్వరలో తొలగిపోయి పునర్వైభవంతో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీ-ఫార్మసీ చదివినవారు ఫార్మా పరిశ్రమలో మాన్యుఫాక్చరింగ్‌ కెమిస్ట్‌గా, క్వాలిటీ అస్యూరెన్స్‌ ఆఫీసర్‌గా, రెగ్యులేటరీ అధికారిగా, ఔషధాల నాణ్యత విశ్లేషించే కెమిస్ట్‌గా, రిసెర్చ్‌ & డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌గా, మార్కెటింగ్‌ నిపుణుడిగా, అంతర్జాతీయ మార్కెటింగ్‌ నిపుణుడిగా చేరవచ్చు. అయితే ఈ రంగాల్లో ఉద్యోగం పొందాలంటే తగిన నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది.

ఇతర ఉద్యోగావకాశాలు

డ్రగ్స్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఔషధాల నాణ్యత పరిరక్షించే డ్రగ్స్‌ ఇన్స్‌పెక్టర్లుగా, ప్రభుత్వ డ్రగ్‌ టెస్టింగ్‌ లెబోరేటరీల్లో గవర్నమెంట్‌ ఎనలిస్టుగా, ప్రభుత్వ డ్రగ్‌ డిపోల్లో, హాస్పిటల్‌ ఫార్మసీల్లో, కమ్యూనిటీ ఫార్మసీలో, మార్కెటింగ్‌లో, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌ రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రైవేట్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ సంస్థల్లో, ఫార్మసీ కళాశాలల్లో లెక్చరర్లుగా అవకాశాలు అందించే కోర్సు బీ- ఫార్మసీ. మనిషి మనుగడ ఉన్నంతకాలం వ్యాధులను ఎదుర్కోకతప్పదు. కాబట్టి ఫార్మసీ ప్రాధాన్యానికీ, ప్రగతికీ ఢోకా లేదు!

బీ-ఫార్మసీ కళాశాలలు- సీట్ల వివరాలు

దేశంలో 1185 బీ-ఫార్మసీ కళాశాలలు ఉండగా వీటిలో సుమారు 80 వేల బీ-ఫార్మసీ సీట్లున్నాయి. వీటిలో పీసీఐ గుర్తింపు పొందిన కళాశాలలు 928 మాత్రమే. కళాశాల స్థాపించిన 4 సంవత్సరాలకు గానీ పీసీఐ గుర్తింపు రాదు. ఫార్మసీ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన కళాశాలల వివరాల కోసం పీసీఐ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఒక డీమ్డ్‌ యూనివర్సిటీ బీ-ఫార్మసీ కోర్సును అందిస్తున్నాయి. వీటిలో మొత్తం బీ-ఫార్మసీ సీట్ల సంఖ్య 260. తెలంగాణలో మూడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో బీ-ఫార్మసీ కోర్సు ఉంది. వీటిలో 180 సీట్లు ఉన్నాయి. 

Back