దంతవైద్య ప్రవేశాలకు ఎంత ర్యాంకు కావాలి?

ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్‌ తర్వాత ప్రాధాన్యమిచ్చేది దంతవైద్యశాస్త్ర కోర్సు (బీడీఎస్‌)కు. డెంటల్‌ డాక్టర్ల ప్రాముఖ్యం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వివిధ స్పెషలైజేషన్లు ఏర్పడడంతో దంతవైద్యంలో కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులు క్రమంగా వస్తున్నాయి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 3 ప్రభుత్వ, 19 ప్రైవేటు దంతవైద్య కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో హైదరాబాద్‌, విజయవాడ కళాశాలలను స్టేట్‌ కోటా కళాశాలలుగా నిర్ణయించారు. అంటే 45: 33: 22 నిష్పత్తిలో సీట్ల పంపకం జరుగుతుంది. కడప ప్రభుత్వ డెంటల్‌ కళాశాల మాత్రం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉంది.

ప్రైవేటు డెంటల్‌ కళాశాలల్లో 8 ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో, 8 ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో, 3 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. అంటే 8 కళాశాలలు తెలంగాణలోనూ, 11 కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 240 సీట్లు, ప్రైవేటు డెంటల్‌ కళాశాలల్లో 1800 వరకు సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ ఏ, బీ, సీ మూడు పద్ధతుల్లో సీట్లు నింపినప్పటికీ ఫీజు పరంగా మాత్రమే వ్యత్యాసం ఉంటుంది.

50% సీట్లు కేటగిరీ-ఏలో భర్తీ చేస్తారు. దీనికి ఫీజు రూ.45,000. కేటగిరీ- బీలో 10% సీట్లు ఉన్నాయి. ఫీజు రూ. 1,30,000. కేటగిరీ-సీ, ఎన్‌ఆర్‌ కోటా ఫీజు రూ. 2,50,000. కేటగిరీ ఏ, బీ సీట్లు కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ అవుతాయి.

* ప్రభుత్వ కళాశాలల్లో విశ్వవిద్యాలయ పరిధిని అనుసరించి జనరల్‌ కేటగిరీలో 2800 నుంచి 4000 ర్యాంకు వరకు కటాఫ్‌ ర్యాంకులు ఉన్నాయి.

 

* కేటగిరీ-ఏలో ఉస్మానియా పరిధిలో 7200వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 7700 ర్యాంకు, ఎస్‌వీయూ పరిధిలో 6700వ ర్యాంకు వరకు కటాఫ్‌ ఉంది.

* కేటగిరీ-బీలో అయితే వరుసగా 8600, 8300, 7400 ర్యాంకులు గత సంవత్సరం కటాఫ్‌ ర్యాంకులుగా ఉన్నాయి.

ఇవి రెండో కౌన్సెలింగ్‌ కటాఫ్‌ ర్యాంకులు కాబట్టి ఈ ర్యాంకు కంటే తక్కువ ర్యాంకు ఉంటేనే సీటు సాధించే అవకాశం ఉంటుంది.

వూగిసలాట

బీడీఎస్‌ సీటు సాధించిన ఎక్కువమంది విద్యార్థుల్లో ఉండే ప్రశ్న- కోర్సులో చేరడమా? లేక లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌తో మళ్లీ ఎంబీబీఎస్‌ సీటుకు ప్రయత్నించడమా? దీంతో నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎంబీబీఎస్‌ సీటు సాధించేవారిలో ఎక్కువ శాతం మంది లాంగ్‌టర్మ్‌ విద్యార్థులే! అయితే వారు లాంగ్‌టర్మ్‌ మొదటిసారి తీసుకుంటున్నారా/ రెండో, మూడోసారా గమనించాలి.

మొదటిసారి (ఇంటర్‌ అయినవెంటనే) లాంగ్‌టర్మ్‌ అయితే ర్యాంకు పదో వంతుకు తగ్గే అవకాశం అవకాశం ఉంటుంది. కానీ రెండోసారి, మూడోసారి అయితే ర్యాంకు పెద్దగా మారదు. కొన్ని సందర్భాల్లో పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మొదటి లాంగ్‌టర్మ్‌ అయితే బీడీఎస్‌ సీటు వదులుకునే సాహసం చేయవచ్చు. కానీ రెండోసారి/ మూడోసారి అయితే మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా బీడీఎస్‌లో చేరి కొనసాగించడం మేలవుతుంది.

కొంతమంది బీడీఎస్‌లో చేరి ఎంసెట్‌ రాయడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా సరైన ప్రయోగం కాదు. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు పడవలపై ప్రయాణం సరి కాదు!

బీడీఎస్‌ రాని పక్షంలో బీవీఎస్‌సీ, అగ్రి బీఎస్‌సీలపై ఎక్కువమంది ఉత్సాహం చూపుతున్నారు. వాటికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. తీసుకున్న కోర్సు ఏదైనా దానిపైనే మనసు లగ్నం చేసి తొలి పది శాతం విద్యార్థుల్లో ఉండగలిగితే అద్భుతంగా రాణించవచ్చు.Back