ఈ కోర్సులతో... భవితకు భరోసా!

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ల తర్వాత ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులు మొగ్గు చూపేవి వెటర్నరీ, అగ్రికల్చరల్‌ కోర్సులు. ఇవి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వస్తున్నాయి కాబట్టి వీటిలో రైతుకుటుంబాల విద్యార్థులకు అదనపు రిజర్వేషన్‌ సదుపాయం ఉంది. ఉపాధికి భరోసానిచ్చే ఈ కోర్సుల ప్రవేశాలు ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే జరుగుతాయి.

ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించే కౌన్సెలింగ్‌లో కేవలం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు భర్తీ అవుతాయి. కానీ బీవీఎస్‌సీ, బిఎస్‌సీ (అగ్రికల్చర్‌) సీట్లను ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. విద్యార్థులు విడిగా ఆ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. బైపీసీ విద్యార్థులకు తోడుగా ఎంపీసీ విద్యార్థులకు సుమారు 129 సీట్లలో అగ్రికల్చరల్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ ఫుడ్‌ సైన్సెస్‌, కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (CA & BM) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు.

పశువైద్యుల (వెటర్నరీ డాక్టర్ల) ఆవశ్యకత ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా బాగానే ఉంది. ఇతర దేశాల్లో కూడా వీరికి గిరాకీ చాలా ఎక్కువ. గత సంవత్సరం కౌన్సెలింగ్‌ ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే బీవీఎస్‌సీ తుది ర్యాంకులు ఎస్‌వీ విశ్వవిద్యాలయం పరిధిలో అతి తక్కువగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఎక్కువగా కటాఫ్‌ ఏర్పడింది. అంటే ఎస్‌వీయూలో సుమారుగా 3400వ ర్యాంకు, ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 3600, ఉస్మానియా పరిధిలో 4500 ర్యాంకులు కటాఫ్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. బీసీ కేటగిరీలో బీసీ-ఈ అంటే ముస్లిం విద్యార్థుల కటాఫ్‌ ర్యాంకు బాగా ఎక్కువగా ఉంది.

గత సంవత్సరంతో పోలిస్తే సీట్లు పెరగలేదు. కాబట్టి తుది కటాఫ్‌ ర్యాంకు మారే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఎక్కువమంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోతున్నారు. ఆ ప్రక్రియను సరిగా చేయగలిగితేనే సీటు గురించి ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువసార్లు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని సమయాన్ని వృథా చేసుకునే బదులు ఈ కోర్సుల్లో చేరి బాగా చదవగలిగితే భవిష్యత్తు బాగుంటుంది.
అగ్రికల్చరల్‌ బీఎస్‌సీ కోర్సుకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం పోటీ పరీక్షలపై దృష్టిపెడుతుండటం విశేషం. సివిల్‌ సర్వీసెస్‌, బ్యాంకు ఆఫీసర్ల నియామకాల్లో ఎక్కువమంది బాపట్లలాంటి కళాశాలల వారుంటున్నారు. దీనికి సీనియర్ల దిశానిర్దేశం గానీ, అక్కడి అధ్యాపకుల ప్రోత్సాహం గానీ కారణం కావచ్చు. ఎలా అయినప్పటికీ జీవిత గమ్యంవైపు నిశ్చితమైన అభిప్రాయంతో వీరు వెళ్లగలుగుతున్నారు.

 

ప్రయోజనకరమైన కోర్సు

అగ్రికల్చరల్‌లో ఈ మధ్యకాలంలో ప్రాధాన్యం కలిగిన కోర్సులను ప్రవేశపెట్టారు. వాటిలో చెప్పుకోదగింది- సీఏ &బీఎం (కమర్షియల్‌ అగ్రికల్చర్‌ & బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌). దీనిలో సీట్లను బైపీసీ, ఎంపీసీ... రెండు గ్రూపుల విద్యార్థులతోనూ భర్తీ చేస్తున్నారు. ఇవి మొత్తం 80 సీట్లు. వీరందరికీ కూడా క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లోనే బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి.

ఈ మధ్యకాలంలో అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌లు కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. (వీటిపై కథనం ఇదే పేజీలో చూడొచ్చు). ఆ విభాగంలో పరిశ్రమలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్రికల్చరల్‌ తర్వాత ఫుడ్‌సైన్సెస్‌ను ఎక్కువమంది ఎంచుకుంటున్నారు. సరైన దిశా నిర్దేశంతో వెళ్లగలిగితే ఈ కోర్సులో కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి.

అగ్రికల్చరల్‌ ఓపెన్‌ కేటగిరీలో 6500- 7500వ ర్యాంకు వరకూ, బీసీ కేటగిరీలో 8500- 10,500 ర్యాంకు వరకూ, ఎస్‌సీ కేటగిరీలో 14,000- 16,000 ర్యాంకు వరకూ, ఎస్‌టీ కేటగిరిలో 10,000- 17,000 వరకూ కటాఫ్‌ ర్యాంకులుగా గత సంవత్సరం ఉన్నాయి. అయితే వీటిలో ఎస్‌టీ విద్యార్థులకు ఆంధ్రా విశ్వవిద్యాలయ పరిధిలోనే తుదిర్యాంకు బాగా ఎక్కువగా ఉంది. మిగిలిన విశ్వవిద్యాలయాల పరిధుల్లో ఎస్‌సీ, ఎస్‌టీల తుది ర్యాంకుల్లో పెద్దగా తేడా లేదు. ఇక సీఏ&బీఎం కటాఫ్‌ ర్యాంకులు 7500- 10,000 వరకు వివిధ విశ్వవిద్యాలయం పరిధులను అనుసరించి ఉంది. ఈ సంవత్సరమే ఆంధ్రప్రదేశ్‌లో అగ్రికల్చరల్‌ విశ్వవిద్యాలయం, తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రారంభం అవుతున్నప్పటికీ వాటిలో ప్రవేశాల ప్రక్రియ 2015 తర్వాతే ఉండవచ్చు. ఈ పరిణామాల దృష్ట్యా కటాఫ్‌ ర్యాంకుల్లో పెద్దగా తేడా ఉండే అవకాశం లేదు. ఏ కోర్సును కెరియర్‌ ఆప్షన్‌గా ఎంచుకున్నా దానిలోని అవకాశాలను స్పష్టంగా తెలుసుకుని వాటివైపు ఆత్మస్త్థెర్యంతో ముందుకు వెళ్ళటం ముఖ్యం. అప్పుడే కోర్సు ఏదైనా బంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది.


Back