Preparation Plan

టీఎస్ ఎడ్‌సెట్‌ - 2016

తెలంగాణలోని బీఎడ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్‌)- 2016కు ఉస్మానియా యూనివర్సిటీ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
ఆ వివరాలు........
కోర్సు: బీఎడ్.
వ్యవ‌ధి: రెండేళ్లు
మెథడాలజీలు: ఇంగ్లిష్, తెలుగు, సైన్స్ (బయాలజీ, ఫిజిక్స్), మ్యాథమెటిక్స్, సోషల్.
అర్హతలు: ఏదైనా డిగ్రీ. ఆఖ‌రు సంవ‌త్సరం చ‌దువుతున్నవాళ్లూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: మే 7
ప్రవేశ పరీక్ష తేది: మే 27
వెబ్‌సైట్‌: http://www.tsedcet.org/
ఎడ్‌సెట్ స్వరూపం ఇలా... ఎడ్‌సెట్ ప్రధానంగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. దీన్లో మూడు విభాగాలుంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 150. రుణాత్మక‌ మార్కులు ఉండవు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంటలు.
విభాగం - ప్రశ్నలు - మార్కులు
పార్ట్ - ఎ: జనరల్ ఇంగ్లిష్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
పార్ట్ - బి: 1) జనరల్‌నాలెడ్జ్ - 15 ప్రశ్నలు - 15 మార్కులు.
2) టీచింగ్ ఆప్టిట్యూడ్ - 10 ప్రశ్నలు - 10 మార్కులు
పార్ట్ - సి: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు - 100 ప్రశ్నలు - 100 మార్కులు.
సబ్జెక్టులు - ప్రశ్నలు - మార్కులు
మ్యాథమెటిక్స్ - 100 ప్రశ్నలు - 100 మార్కులు
ఫిజికల్ సైన్సెస్ - 100 ప్రశ్నలు - 100 మార్కులు
* ఫిజిక్స్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు.
* కెమిస్ట్రీ - 50 ప్రశ్నలు - 50 మార్కులు.
బయోలాజికల్ సైన్సెస్ - 100 ప్రశ్నలు - 100 మార్కులు.
* బోటనీ - 50 ప్రశ్నలు - 50 మార్కులు.
* జువాలజీ - 50 ప్రశ్నలు - 50 మార్కులు.
సోషల్ స్టడీస్ - 100 ప్రశ్నలు - 100 మార్కులు.
* జాగ్రఫీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు.
* హిస్టరీ - 30 ప్రశ్నలు - 30 మార్కులు.
* సివిక్స్ - 15 ప్రశ్నలు - 15 మార్కులు.
* ఎకనమిక్స్ - 20 ప్రశ్నలు - 20 మార్కులు.
ఇంగ్లిష్ - 100 ప్రశ్నలు - 100 మార్కులు.
అర్హత మార్కులు: ప్రవేశ పరీక్షలో జనరల్ కేటగిరీ వారికి 37 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.
సిలబస్ విశ్లేషణ
పార్ట్ -ఎ:
జనరల్ ఇంగ్లిష్ : ఎడ్‌సెట్ అభ్యర్థుల ర్యాంకును నిర్ణయించడంలో జనరల్ ఇంగ్లిష్ పాత్ర కూడా త‌క్కువేమీ కాదు. ఈ విభాగానికి 25 మార్కులు కేటాయించ‌డ‌మే కార‌ణం. ఇంగ్లిష్ పై పట్టు సాధించిన అభ్యర్థులు మంచి ర్యాంకు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి.
పరీక్షలో ప్రశ్నలు అడిగే అంశాలు.
1. Reading Comprehension.
2. Correction of Sentences, Articles, Prepositions, Tenses, Spelling.
3. Vocabulary, Synonyms, Antonyms.
4. Transformation of Sentences- Simple, Compound and Complex. Voices, Direct Speech and Indirect Speech.
పార్ట్ - బి:
జనరల్ నాలెడ్జ్: చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థి ఆసక్తి, అవగాహనా సామర్థ్యం, వాటిని సమాజానికి వర్తింపజేసి పరిశీలించేతత్వం లాంటి లక్షణాలను ఈ ప్రశ్నల ద్వారా పరీక్షిస్తారు.
జనరల్‌నాలెడ్జ్ విస్తృతమైన సబ్జెక్టు. అందువ‌ల్ల పాత‌ ప్రశ్నపత్రాల ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయో గ‌మ‌నించి సంబంధిత అంశాల‌కు ప్రాధాన్య‌మివ్వాలి. కింది తరగతుల్లోని అన్ని సబ్జెక్టుల ప్రాథమిక అంశాలను చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
వివిధ దేశాలు - వాటి రాజధానులు, కరెన్సీ, భౌగోళిక ప్రాధాన్యం లాంటి అంశాలను చదవాలి. వివిధ దేశాల సంస్కృతి, నాగరికతలను ప్రతిబింబించే ముఖ్యమైన కట్టడాలు, వాటిని నిర్మించిన ప్రదేశాలు, పండగలు, ముఖ్యమైన గ్రంథాలు - రచయితల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
కరెంట్ జనరల్ నాలెడ్జ్ విభాగంలో వివిధ అవార్డులు, బహుమతులు, బిరుదులు, క్రీడలు, ఇటీవ‌ల సమావేశాలు జరిగిన ప్రదేశాలు, వార్తల్లో వ్యక్తులు, సంఘటనలు, ప్రదేశాలను గురించి తెలుసుకోవాలి.
టీచింగ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థికి బోధనపై ఏ మేరకు అభిరుచి ఉందో ఈ విభాగం (పార్ట్ -సి)లో పరీక్షిస్తారు. ముఖ్యంగా పిల్లల్లో నేర్చుకోవడంలో వ్యత్యాసాలను గుర్తించడం, కమ్యూనికేషన్ సామర్థ్యం, జనరల్ ఇంటెలిజెన్స్ స్థాయిలను అంచనా వేస్తారు. ప్రశ్నలో ఇచ్చిన సందర్భాన్ని విచక్షణతో ఆలోచించి తేలిగ్గా సమాధానాలు గుర్తించగలిగిన విభాగం ఇది. మంచి ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు, తరగతి గదిలో వివిధ సందర్భాల్లో ఉపాధ్యాయులు పాటించాల్సిన ప్రమాణాల ఆధారంగా ఇందులో ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగానికి సంబధించి గత ఎడ్‌సెట్ ప్రశ్నపత్రాలను సాధనచేస్తే ప్రయోజనం ఉంటుంది.
పార్ట్ - సి :
కింది వాటిలో ఏదైనా ఒకదానిని ఎంచుకోవాలి.
మ్యాథమెటిక్స్ (ఎంఎస్).
ఫిజికల్ సైన్సెస్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) (పీఎస్).
బయోలాజికల్ సైన్సెస్ (బోటనీ, జువాలజీ) (బీఎస్).
సోషల్ స్టడీస్ (జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనమిక్స్) (ఎస్ఎస్).
ఈ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు డిగ్రీ స్ధాయి వరకు ఉంటాయి.
ఇంగ్లిష్ (దీనికి సంబంధించి 8, 9, 10, ఇంటర్ తరగతుల్లో చదివిన ఇంగ్లిష్ ఆధారంగా 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు). ఈ విభాగంలోని టాపిక్‌లు.
Language functions.
Elements of Phonetics.
Grammar.
Syllabus prescribed for Optional English at B.A. Degree Level (B.A.Special English)/ Modern Literature Syllabus.
పార్ట్ సిలో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు ప్రకారం డిగ్రీ స్ధాయివరకు ప్రశ్నలు ఇస్తారు కాబట్టి వాటిపై మంచి అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా సబ్జెక్టుల్లో 8, 9, 10 తరగతుల్లో ఉండే పాఠ్యాంశాల నుంచి కూడా ప్రశ్నలు వ‌స్తాయి. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించ‌డానికి ఎనిమిదో తరగతి మొదలు డిగ్రీ ఆఖ‌రు సంవ‌త్సరం వరకు సబ్జెక్టు పుస్తకాలను చదవాలి.
గణితం: ఇందులో చాలా ముఖ్యమైన పాఠ్యాంశాలు... సమితులు, సంబంధాలు, ప్రమేయాలు, వర్గ సమీకరణాలు, ద్విపద సిద్ధాంతం, ప్రస్తారాలు, సంయోగాలు, మాత్రికలు, త్రికోణమితి, అనుక్రమాలు, శ్రేణులు, అవకలనీయం, సమాకలనం, అవకలన సమీకరణాలు, సమూహాలు, వలయాలు, రుజువర్తనలు తదితరాలు. ఈ పాఠ్యాంశాల్లోని సూత్రాలను ఒక క్రమపద్ధతిలో రాసుకుని రోజూ పునశ్చరణ చేసుకోవాలి. ప్రతిరోజు అధ్యాయాల వారిగా లెక్కలను అభ్యాసం చేయాలి.
భౌతిక, రసాయన శాస్త్రాలు: భౌతిక, రసాయన శాస్త్రాలపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలుంటాయి. అనువర్తనాలకు ప్రాధాన్యం ఉంటుంది. పాఠ్యాంశాల వారీగా ముఖ్యమైన సిద్ధాంతాలు, నిర్వచనాలు, నియమాలను పాయింట్ల రూపంలో రాసుకుని రోజూ పునశ్చరణ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదవాలి. యాంత్రిక శాస్త్రం, విద్యుత్, అయిస్కాంతత్వం నుంచి ఎక్కువ ప్రశ్నలు రావ‌డానికి ఆవకాశం ఉంది.
రసాయన శాస్త్రంలో... మూలక, భౌతిక రసాయన శాస్త్రాలకు ఇంటర్మీడియట్ పుస్తకాలు, కర్బన రసాయన శాస్త్రానికి డిగ్రీ స్థాయి వరకు పాఠ్యాంశాలు చదవాలి. ఈ మూడు అంశాల నుంచి దాదాపు సమాన సంఖ్యలో ప్రశ్నలు వస్తుంటాయి.
జీవశాస్త్రం : జీవశాస్త్రం అభ్యర్థులు జంతువుల విసర్జక వ్యవస్థ, కిరణజన్య సంయోగక్రియలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
సాంఘిక శాస్త్రం: ఈ విభాగంలో అధిక ప్రాధాన్యం భూగోళ‌శాస్త్రానికే (35 మార్కులు). కాబ‌ట్టి స‌న్నద్ధత‌లోనూ అద‌న‌పు స‌మ‌యం కేటాయించుకోవాలి. ప్రాథమిక అంశాలను శ్రద్ధగా చదవాలి. అట్లాస్, మ్యాప్ రీడింగ్ సాయంతో చ‌దివితే గుర్తుంచుకోవ‌డం సులువ‌వుతుంది.
పౌరశాస్త్రంలో భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ, రాజనీతి సిద్ధాంతాలు, భావనలు, అంతర్జాతీయ సంబంధాలపై దృష్టి కేంద్రీకరించాలి.
ఆర్థిక శాస్త్రంలో సూక్ష్మ అర్థశాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. భారత ఆర్థికాభివృద్ధిపై కూడా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికలు, పన్నులు, ద్రవ్య విధానం, బ్యాంకింగ్, జనాభా అంశాలపై ప్రశ్నలు రావచ్చు. వీటికి సంబంధించిన వర్తమాన అంశాలను తెలుసుకోవాలి.
చరిత్రలో సాధారణంగా ఆధునిక యుగం నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తుంటాయి. ముఖ్యంగా సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణోద్యమం, ఐరోపా, అమెరికాల్లో అనేక విప్లవాలు, ప్రపంచ యుద్ధాలు, నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి అంశాలను చదవాలి. భారతదేశ చరిత్రకు సంబంధించి స్వాతంత్య్ర ఉద్యమంలోని వివిధ దశలు, సింధు నాగరికత, బౌద్ధ, జైన మతాలు, మౌర్యులు, గుప్తులు, ఆధునిక దక్షిణ భారతదేశ చరిత్రపై దృష్టి కేంద్రీకరించాలి.
గ‌మ‌నిక‌: బీఎడ్ ప‌రీక్షను ఏ స‌బ్జెక్టులో రా సిన‌ప్పటికీ ప్రశ్నప‌త్రం మాత్రం 8 నుంచి డిగ్రీ ఆఖ‌రు సంవ‌త్సరం పాఠ్యపుస్తకాల‌ను అనుస‌రించే ఉంటుంది. కాబ‌ట్టి గైడ్లకంటే పాఠ్యపుస్తకాల‌ను న‌మ్ముకున్నవారే ఎక్కువ మార్కులు సాధించ‌గ‌ల‌రు. పాత‌ప్రశ్నప‌త్రాల‌ను ప‌రిశీలించి సంబంధిత స‌బ్జెక్టులో ఏయే అంశాల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకోవాలి. ప‌రీక్షకు 15 రోజుల ముందు వీలైన‌న్ని మోడ‌ల్ ప్రశ్నప‌త్రాలు సాధ‌న‌చేయాలి.

Posted on 25.03.2016


TS Ed.CET - 2017 Info.

  • Notification