Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

వ్యవసాయంలో యువశక్తి

వ్యవసాయం గిట్టుబాటు కాదన్న అభిప్రాయంతో, యువత ఆ రంగంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ నూతన వ్యవసాయశాస్త్రపరిజ్ఞానం, అంతర్జాలంలో సమాచార-సాంకేతిక సౌలభ్యం వల్ల సేద్యంలోనూ లాభసాటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ సంబంధిత సంస్థలన్నీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చి యువతరాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే... దేశ సేద్య ముఖచిత్రం మారే అవకాశముంది!

దేశవ్యాప్తంగా వ్యవసాయరంగ స్థితిగతులపై జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ఇటీవల వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ లెక్కల ప్రకారం- ఆంధ్రప్రదేశ్‌లో 92.9శాతం, తెలంగాణలో 89.1శాతం రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. రైతు కుటుంబం సంపాదనలో సేద్యం ద్వారా లభించే ఆదాయం అంతంతమాత్రమే. దిల్లీకి చెందిన 'అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం' (సీఎస్‌డీఎస్‌) నిరుడు మార్చిలో నిర్వహించిన సర్వే ఫలితాల్నిబట్టి, 76శాతం రైతులు వ్యవసాయంపై నమ్మకం లేక, ప్రత్యామ్నాయ జీవనోపాధి వెదుక్కొంటున్నారు. అదేవిధంగా 1991 నుంచి 2011 వరకు జనాభా సేకరణ లెక్కల ప్రకారం, రోజుకు సరాసరిన రెండువేలమంది రైతులు ఆ రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు. సగటు రైతు- తన బిడ్డలెవ్వరూ వ్యవసాయంలో స్థిరపడాలని కోరుకోవడం లేదు. దాదాపు 80శాతం రైతు కుటుంబాలకు చెందిన యువతకు అసలు ఆ రంగంపైనే ఆసక్తి లేదు. వారిలో సుమారు 45శాతం తమ భవిష్యత్తు కోసం పట్టణాల వైపు సాగుతున్నారు. తగినంత చదువు, నైపుణ్యం లేక అక్కడ ఏ పని దొరికినా చేయాల్సి వస్తోంది. అంటే, ఒక తరం గతి తప్పుతోంది! ఇటువంటి పరిణామాలు యువతరానికి, వ్యవసాయ రంగానికి, దేశ ఆహార భద్రతకు ఎంతమాత్రం మంచివి కావు!

అవకాశాలు అపారం

వ్యవసాయమంటే ఎక్కువ ఖర్చు, శరీర కష్టంతో కూడుకొన్న రంగం. కష్టపడి పండించినా, ఆ పంటలకు సరైన మార్కెట్‌ ధరలు దక్కడం లేదు. రకరకాల పరిశోధనల వల్ల విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సేద్యంలో ఉపయోగించాలంటే ఆలోచన శక్తి చాలా అవసరం. విస్తరిస్తున్న అంతర్జాలం ద్వారా, దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మార్కెట్లతో 'నెట్‌వర్క్‌' అనుసంధానం ద్వారా- ఉత్పత్తులను లాభసాటి ధరలకు అమ్ముకునే అవకాశాలు పెరిగాయి. వీటిని యువత తెలివిగా అందిపుచ్చుకోవాల్సి ఉంది. కచ్చిత సాగు (ప్రిసిషెన్‌ ఫార్మింగ్‌) నాట్ల ద్వారా కందిసాగు వంటి విధానాలతో ప్రయోజనాలు సాధిస్తున్నారు. ఇటువంటి అనుభవాలు, ఉదాహరణలను ఎక్కువమందికి తెలియజెప్పి స్ఫూర్తి రగిలించే బాధ్యతను విద్యాసంస్థలు, రైతు శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన్‌ కేంద్రాలు, వ్యవసాయ శాఖ... సవ్యంగా నిర్వర్తించడంలేదు. కొద్దిమంది యువకులు చైతన్యవంతులై చేసిన ప్రతిపాదనలకు, ప్రాజెక్టులకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు ఆశించినంతగా లభించడం లేదు. యువ రైతులు సాంకేతికంగా ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించేందుకు 'నాబార్డు' 2005 నుంచి ఒక విధానం తీసుకొచ్చింది. దీని కింద నాటినుంచి 2014 వరకు రూ.82.08కోట్ల నిధులతో కేవలం 200 ప్రాజెక్టులు వచ్చాయి. వ్యవసాయ శాస్త్రం చదివినా ఉద్యోగాలు వద్దను కొని, గ్రామాల్లో తోటి రైతులకు సేవలందించేందుకు ఉద్దేశించిన 'అగ్రి క్లినిక్‌- అగ్రి బిజినెస్‌' పథకం 2002 నుంచే కేంద్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2014జూన్‌ 20వరకు కేవలం 15,623 వ్యవసాయ- వ్యాపార యూనిట్ల ఏర్పాటుకే యువతకు సహాయం అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1.31కోట్ల రైతులకుగాను కేవలం 295 యూనిట్లు ఏర్పాటయ్యాయి. దాదాపు 1.37కోట్ల రైతులున్న మహారాష్ట్రలో ఆ యూనిట్ల సంఖ్య 3,644. తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో- వ్యవసాయ శాస్త్రం చదువుకున్నవారూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు వెదుక్కుంటున్నారు. ఈ కారణంగా నష్టపోతోంది వ్యవసాయరంగమే!

ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా గడచిన 15 సంవత్సరాలుగా పరిస్థితులు కొంత మారాయి. యువకులు ఎవరైనా కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టేందుకు ప్రయత్నిస్తే బయటనుంచి సంస్థలుగాని, వ్యక్తులుగాని కొంత ప్రోత్సాహక పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి సహాయం కొన్ని రంగాలకే పరిమితమవుతోంది. యువతను వ్యవసాయ రంగంవైపు ఆకర్షించడానికి ప్రభుత్వమే చొరవ తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగా తగిన సలహాల కోసమే భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌) 2012లో ఒక కమిటీని నియమించింది. యువకులకు లాభసాటి వ్యవసాయం, దాని ఆధారిత పరిశ్రమల అవకాశాలపై అవగాహన కలిగించాలని కమిటీ సూచించింది. దేశవ్యాప్తంగా ఇటువంటి కేంద్రాలు 30 ఏర్పాటు చేయాలని, ఇందుకు రూ.200కోట్లు అవసరమవుతుందని అప్పట్లో భావించారు. ఆ సూచనలు కార్యరూపం ధరించాల్సి ఉంది.

గణనీయ మార్పులతో మేలు

వ్యవసాయ రంగంలోని లాభసాటి అవకాశాలను యువతరానికి ప్రభుత్వమే తెలియజెప్పాలి. నష్టభయాలు పోగొట్టాలి. సందేహాలు తీర్చాలి. మార్కెట్‌ విశ్లేషణలను వారికి అందుబాటులోకి తేవాలి. స్వల్పకాలంలోనే లాభాల బాట పట్టిన రైతుసంఘాల పని పోకడలపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేపట్టాలి. కొత్తగా వస్తున్న యంత్రాలు, హరిత క్షేత్రం (గ్రీన్‌హౌస్‌) వంటి సాంకేతిక విషయ పరిజ్ఞానంపై యువకులకు అవగాహన కలిగించాలి. సరైన ప్రతిపాదనలకు బ్యాంకుల నుంచి రుణాలు, ప్రోత్సాహక పెట్టుబడులు లభిస్తాయన్న నమ్మకం కల్పించాలి. ఇందుకు వ్యవసాయశాఖ, ఆ రంగంలోని విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), రైతు శిక్షణ కేంద్రాలు, పరిశోధన సంస్థలు, 'నాబార్డు' వంటివి రైతులోకానికి మరింత చేరువ కావాలి. కేవీకేలు ఇప్పుడు అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి మార్కెట్‌ విశ్లేషణలు జోడించాల్సిన అవసరముంది. పది లేదా ఇంటర్‌ స్థాయితో చదువుకు స్వస్తిచెప్పి, వ్యవసాయం వంటి పనులు చేయడానికి నిర్ణయించుకున్న యువతకు ఉపయోగపడేలా కేవీకేలు వ్యవహరించాలి. పరిశోధనల ఫలితాల్ని, రైతులు మార్కెట్లలో సాధించిన విజయగాథల విశ్లేషణల్ని అవి తమ 'వెబ్‌సైట్ల'లో ఉంచాలి. యువతకు మరింత చేరువ కావడానికి వీలుగా కేవీకేల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 641నుంచి కనీసం రెండింతలు చేయాలి. వాటి కార్యకలాపాల్ని పెంచడం ముఖ్యం. 'కిసాన్‌ కాల్‌ సెంటర్ల' పనితీరు చాలా మెరుగుపడాలి. ఇటీవల దేశవ్యాప్తంగా చేసిన ఓ సర్వే ప్రకారం- 70శాతం రైతులకు ఆ కేంద్రాల గురించి అవగాహన లేదు. మిగిలినవారు వాటి సమాచారం కోసం ప్రయత్నిస్తే 78శాతం రైతులకు సమయం వృథా అయిందే తప్ప, ఉపయోగం లేకుండా పోయింది. సంబంధిత సంస్థల పనితీరులో గణనీయమైన మార్పులు తేవాలి. ఇవన్నీ నెరవేరాలంటే, రాబోయే బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు సమధికంగా పెరగాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ప్రయోగాత్మకంగా చేపట్టే వ్యాపార ప్రాజెక్టుల ప్రోత్సాహానికి- గతంలో కేంద్ర బడ్జెట్లో రూ.10,000కోట్లతో నిధి రూపొందింది. అలాగే యువతను వ్యవసాయం వైపు నడిపించడానికీ ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం అవసరం!

(రచయిత - పరిటాల పుతుషోత్తం)
(రచయిత- విశ్రాంత ఆచార్యులు, గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు)
Posted on 05-01-2015