Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

పప్పుల తిప్పలు తీర్చేదెలా?

* 2016 అంతర్జాతీయ అపరాల సంవత్సరం
పప్పుల తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆకాశాన్ని అంటిన అపరాల ధరలు దిగిరామంటున్నాయి. అపరాల ధరల మంటలు ప్రపంచవ్యాప్తంగా తాకాయి. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి, 2016ను ‘అంతర్జాతీయ అపరాల సంవత్సరం’గా ప్రకటించింది. పప్పు దినుసుల పోషక లాభాలను వివరించడానికి, ఆహార పోషక భద్రతలో వాటి ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పడంతోపాటు దారిద్య్రాన్ని, ఆకలిని పారదోలడానికి ప్రపంచవ్యాప్తంగా అపరాల సాగును ప్రోత్సహించాలని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అన్ని దేశాలను కోరింది. అపరాల కొరతను తట్టుకునేందుకు లక్షా యాభై వేల టన్నుల అపరాలను ‘బఫర్‌ స్టాక్‌’గా సేకరించాలని, రైతుల నుంచే నేరుగా కనీస మద్దతు ధరలకంటే ఎక్కువ ధరతోనే అపరాలు కొనాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 2015-16లో రూ.1,100కోట్లు అవసరమని అంచనా. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి, ధర మద్దతు పథకాల నుంచి ఇందుకు నిధులు కేటాయిస్తోంది. అధిక దిగుబడినిచ్చే రకాల విత్తనాలు అందుబాటు లేకపోవడం అపరాలకు సంబంధించిన ప్రస్తుతం పెద్ద సమస్య. దీన్ని అధిగమించేందుకు అదనంగా రూ.440కోట్లు కేటాయించనున్నారు. దీనికితోడు దేశంలో అపరాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడానికి వీలుగా ‘దిగుబడి, బీమా, ధరలు’ అనే మూడు అంశాలతో దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ప్రభుత్వం ఆ వివరాలను పార్లమెంటుకు తెలిపింది.

సాగు విస్తీర్ణంపై దృష్టి

భారత్‌ అపరాల పరిశోధన సంస్థ అధ్యయనం ప్రకారం- అపరాలు ప్రధానంగా సాగుచేస్తున్న ఏడు రాష్ట్రాల్లో దిగుబడులు సాలీనా ఆరు శాతం పెరిగితే, దేశంలో అపరాల కొరతను పూర్తిగా అధిగమించవచ్చు. రబీ అపరాలకు ప్రభుత్వం మద్దతు ధర పెంచడంతో దేశవ్యాప్తంగా 15శాతం మేర అపరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఒక్క పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లోనే సంప్రదాయ వరి, గోధుమ పంటలకు బదులు 20శాతం సాగు విస్తీర్ణంలో అపరాలు వేశారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ఉంటే అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే. కానీ, దశాబ్దాల తరబడి అపరాల సాగు నిర్లక్ష్యానికి గురైంది. చాలావరకు దిగుమతులపై ఆధారపడటం, కొత్త రకాలు సాగులోకి రాకపోవడం, ప్రభుత్వాల ప్రోత్సాహకాలు అందకపోవడంతో నేడు పప్పు దినుసుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బహుముఖ వ్యూహాలతో సమగ్రంగా ముందుకు సాగితేనే పరిస్థితి కొంత ఉపశమిస్తుంది.

అపరాల్లో కంది ఉత్పాదకత తక్కువ. హెక్టారుకు సరాసరిన 439 కిలోలే. తరవాతి స్థానాల్లో పెసర, మినుము ఉన్నాయి. భారత్‌లో అపరాల సరాసరి ఉత్పాదకత హెక్టారుకు 641 కిలోలు. 1960లో ఉత్పాదకత 540 కిలోలు. ఇన్ని దశాబ్దాల్లో పెరిగిన ఉత్పాదకత 100కిలోలు మాత్రమే. కెనడా, మయన్మార్‌, బ్రెజిల్‌ దేశాలు ఇదేకాలంలో అపరాల ఉత్పాదకతను మూడు నుంచి నాలుగు రెట్లు పెంచుకోగలిగాయి. అందుకే ఆ దేశాలు తమ స్థానిక అవసరాలను తీర్చుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నాయి. ఆయా దేశాలు పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే నూతన రకాలకు ప్రాధాన్యమిచ్చాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయి. ఆరో దశకంలో పెసర, మినుము, పంటల్లో పల్లాకు తెగులును తట్టుకునే రకాలు దేశంలో లేవు. ఇప్పటికీ ఇదే పరిస్థితి. ఇప్పటివరకు నీటిఎద్దడిని తట్టుకునే రకాల రూపకల్పనే జరగలేదు.

అపరాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి భారీ ప్రణాళికలు రచించాలి. ప్రస్తుత పంటల సాగు ప్రాధాన్యాలు మార్చాలి. వర్షాధారంగానే అపరాలు సాగు అవుతుండటంతో బెట్టకు గురయ్యే అవకాశం ఎక్కువ. వరి, గోధుమలకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న సబ్సిడీ ఎకరాకు పదివేల రూపాయలకు పైనే. అపరాలకు ఇప్పటివరకు అందిన సబ్సిడీ అంతంతమాత్రమే. వరి, గోధుమలు ప్రధానంగా పండే పంజాబ్‌, హరియాణాల్లో భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో ఇప్పుడు అపరాల సాగు పట్ల రైతులు మొగ్గుచూపుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో సాగునీటి సౌకర్యాలు ఎక్కువ. ఇక్కడ వరి స్థానంలో అపరాల సాగు విస్తీర్ణం పెరిగితే, వాటి ఉత్పాదకత మెరుగుపడుతుంది. దేశంలో 93శాతం గోధుమ విస్తీర్ణం, 59శాతం వరి విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంటే- మూడు అపరాల పంటల విస్తీర్ణంలో కేవలం 16శాతానికే సాగునీటి సదుపాయం ఉంది. సాగునీటి సదుపాయం కల్పనతో అపరాల్లోనూ సరాసరిన హెక్టారుకు ఆరు నుంచి ఏడు టన్నుల ఉత్పాదకత సాధ్యమని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

తెలంగాణలో అపరాల విస్తీర్ణం పెంచడానికి అవకాశాలు ఎక్కువ. రాష్ట్రంలోని ఎనిమిది గ్రామీణ జిల్లాల్లో కంది, పెసర పంటలు సాగుచేసుకోవచ్చు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సోయాబీన్స్‌, మెదక్‌, నిజామాబాద్‌లలో మినుము సాగుచేసుకోవచ్చు. అన్ని అపరాల్లో విత్తన మార్పిడి నిష్పత్తి 33శాతమే. దీన్ని పెంచాలి. పదేళ్ల క్రితం విడుదలై, సాగులో ఉన్న రకాలను దశలవారీగా నూతన రకాలతో భర్తీచేస్తే దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. నీటి ఎద్దడి, ముంపు ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాల సాగు, మందుల వాడకం ద్వారా కలుపు నివారణ, పల్లాకు తెగులు తట్టుకునే పెసర, మినుము రకాలు, రెయిన్‌ గన్‌లు, బిందు, తుంపర సేద్యాల ద్వారా కొద్దిపాటి నీటితో అధిక దిగుబడులు సాధించాలి. మాగాణుల్లో అపరాల సాగు, చెరువుల కింద, నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో వరికి ముందు పెసర సాగు, అపరాలను అంతర పంటలుగా సాగు చేసేందుకు సబ్సిడీలు; జింకు, బోరాన్‌, ఇనుము, జిప్సం వాడకం ద్వారా నాణ్యత, దిగుబడులు పెంచుకోవచ్చు. ఖరీఫ్‌లో వరి బదులు కందితో దిగుబడులు పెరుగుతాయి. తేలికపాటి నేలల్లో పెసర, మధ్యస్తం నుంచి బరువైన నేలల్లో మినుముతో లాభాలున్నాయి. ముఖ్యంగా వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో వరి తరవాత అపరాల సాగు; వేసవిలో పత్తి పంట వేసే ప్రతి అంగుళం భూమిని అపరాల సాగుకు మళ్లించడం, రబీలో విస్తీర్ణం పెంచడం, మొక్కజొన్న ఏకపంటగా పండించినా, అపరాలతో అంతర పంటగా పండించినా ఒకే దిగుబడులు సాధ్యం. దాదాపు అన్ని కూరగాయలు, నూనెగింజలు, తృణధాన్యాలతో అపరాల పంటలు సాగు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ అపరాల విస్తీర్ణం, ఉత్పాదకత పెంచడానికి మేలైన మార్గాలున్నాయి. వరి మాగాణుల్లో నాలుగు లక్షల హెక్టార్లకు పైగానే విస్తీర్ణం పెంచుకోవచ్చు. అనంతపురం జిల్లాలో నూనెగింజల పంటలతోపాటు కందిని అంతర పంటగా సాగుచేస్తే ఉత్పాదకత పెరుగుతుంది. వేసవిలో మినుము, పెసర లక్ష హెక్టార్లపైనే అదనంగా సాగు చేయవచ్చు. కేవలం వరి పొలం గట్లపై కంది పంటను విత్తటం వల్ల లక్షన్నర హెక్టార్లపైనే విస్తీర్ణం పెరుగుతుంది. తక్కువ వర్షపాతం, సీజన్‌ చివరలో వచ్చే నీటిఎద్దడిని తట్టుకునే రకం ఇప్పుడు అందుబాటులో ఉంది. ‘ఇక్రిసాట్‌’ అభివృద్ధి చేసిన అధిక దిగుబడినిచ్చే సంకర కంది రకాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పప్పు మిల్లులు ఏర్పాటుచేసి విలువ జోడించవచ్చు. ‘విపణి అంచనా’ పెంచడం ద్వారా విస్తీర్ణం, ఉత్పత్తి, సరఫరాల్లో భారీ వ్యత్యాసాలు లేకుండా చూసుకోవచ్చు.

గాడిలో పెట్టాల్సిన తీరు

అపరాల ఎగుమతుల నిలిపివేత, దిగుమతులపై సున్నా సుంకం అమలు, భవిష్య వాణిజ్యంపై నిషేధం, నిల్వదారులపై చర్యలు, ధరల తగ్గుదలకు ధరల స్థిరీకరణ నిధి జోడింపు, దిగుమతుల ద్వారా దేశంలో అపరాల ‘బఫర్‌ స్టాక్‌’కు ప్రయత్నాల వంటి చర్యలు చేపడుతున్నా అపరాల ధరలు దిగిరానంటున్నాయి. ఇవన్నీ తక్షణ ఉపశమనాలే కానీ, శాశ్వత పరిష్కారాలు కావు. దేశంలో మొత్తం కాలాలు కలిపి గరిష్ఠంగా మూడు నెలలు మాత్రమే అపరాల కోత జరుగుతుంది. అవే సంవత్సరమంతా అందుబాటులో ఉండాలి. ఒకవేళ నిల్వదారులను కాదంటే వాటిని అవసరాలకు నిల్వ చేసుకోగలిగే గిడ్డంగులు, గోదాములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? పెట్టుబడుల నుంచి నిల్వదారులు వెనకకు వెళ్లే ప్రమాదం ఉంది. అలాగే, పంట కోతల వెంటనే అపరాల ధరలు ఒకేసారి పడిపోయే ప్రమాదం ఉంది. సరఫరా పెరిగితే ధరలు తగ్గడం సహజమే. రైతులకు నష్టంగా మారుతాయి. ఇది ఒక తప్పుడు చర్య అయితే, రెండోది భవిష్య మార్కెట్లపై కొరడా. వీటిలోనే నిల్వలు, భవిష్యత్తు ధరలు కనిపిస్తాయి. వాటి నిషేధంతో ప్రభుత్వానికి ధరలపై ఒక ఆధారం లేనట్టే. ప్రభుత్వం చేస్తున్న మూడో తప్పు- ఏడు వేల టన్నుల కందిపప్పు దిగుమతి చేసుకోవటం. దాదాపు 40లక్షల టన్నుల కందిపప్పు అవసరం కాగా, ఏడు వేల టన్నులు ఏ మూలకు? మూడు వ్యూహాలతో దేశంలో అపరాల కొరతను తగ్గించవచ్చు. సాధ్యమైనంత వరకు దేశీయంగా ఉత్పత్తి చేసి, లేదా దిగుమతుల ద్వారా 20 నుంచి 30 లక్షల టన్నుల అపరాల ‘బఫర్‌ స్టాక్‌’ ఏర్పాటు చేసుకోవాలి. ధరల పెరుగుదలను అరికట్టడానికి రెండు కోట్ల టన్నుల పప్పు దినుసులు అవసరమున్న దేశంలో ఆ మాత్రం బఫర్‌ నిల్వలు తప్పనిసరి. అత్యధిక ఎరువులు, సాగునీరు, విద్యుత్‌, సబ్సిడీలు పొందుతున్న వరి, గోధుమ, చెరకు స్థానంలో అపరాలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి. దీంతో అపరాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి తప్పకుండా పెరుగుతాయి. అపరాల్లో మరిన్ని ‘ప్రొటీన్‌’ అందించే పంటలు చేర్చాలి. పచ్చ బఠానీలు కెనడా, ఆస్ట్రేలియా నుంచి సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. వీటి అందుబాటు ఎక్కువే. ముఖ్యంగా అత్యధికంగా ప్రొటీన్‌ ఉన్న సోయాను అపరాల్లో చేర్చాలి. ఇతర పప్పుధాన్యాల్లో ప్రొటీన్‌ 20-25శాతం ఉంటే, సోయాలో 40శాతం మేర ఉంది. ఈ పంట దిగుబడి కూడా అన్ని అపరాల పంటల కంటే ఎక్కువే. బహుముఖ వ్యూహాలతోనే పప్పులు ఉడికేది, పోషక భద్రత చేకూరేది!

- డాక్టర్ పిడిగెం సైద‌య్య
(రచయిత- శాస్త్రవేత్త, ఉద్యాన విశ్వవిద్యాలయం)
Posted on 2-1-2016