Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

పొలం బాటలో సంస్కరణలు

రాజకీయ నాయకులు తరచూ అనే మాట- రైతన్నకు వ్యవసాయాన్ని పండగ చేస్తామని! అవన్నీ వట్టి మాటలేనని దశాబ్దాల అనుభవాలు చెబుతున్నాయి. నేతలను కాకుండా నేలతల్లినే నమ్ముకొన్న రైతులు- గిట్టుబాటు కాకపోయినా సేద్యాన్ని కొనసాగిస్తున్నారు. సాగు రంగం బాగుపడాలంటే, మారుతున్న రోజులకు అనుగుణంగా రైతు దృక్పథంలోనూ మార్పు రావాలి. పాత విధానాలు విడిచిపెట్టి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. తద్వారా ఉత్పాదక వ్యయాన్ని సాధ్యమైన మేర తగ్గించుకోగలిగితే వ్యవసాయం లాభాల బాట పడుతుంది. అందుకు పాలకులూ అన్నదాత మేలుకోరే విధానాలతో ముందుకు రావాలంటున్న వ్యాసమిది...
‘దేన్నయినా నిర్లక్ష్యం చేయవచ్చుగానీ.... సేద్యానికి సంబంధించిన సమస్యలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదు’ దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యాఖ్యలవి. గడచిన మూడేళ్లుగా దేశంలో సేద్య రంగం గతుకుల దారిలో సాగుతోంది. దేశంలోని 120కోట్లమంది ఆకలి తీరుస్తున్న రైతన్నలు అప్పుల్లో మునిగిపోయి నిర్వేదంలో కూరుకుపోయారు. పదకొండో పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు నాలుగుశాతం కాగా, గడచిన మూడేళ్లలో అది రెండు శాతానికి పడిపోయింది. వర్షాభావ పరిస్థితులు సేద్యాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఉత్పత్తుల ధరలు పడిపోయి గత మూడేళ్లుగా వాణిజ్య విపణిలో రైతులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దుర్భిక్షం బారినపడిన అన్నదాతను ఆదుకునేందుకు తక్షణ చర్యలు, వ్యవస్థాగతంగా పేరుకుపోయిన లోపాలను సరిదిద్దేందుకు దీర్ఘకాలిక విధానాలు రూపొందించాల్సి ఉంది.

సేద్యానికి సాయం
దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లతోపాటు తెలంగాణనూ దుర్భిక్ష పీడిత రాష్ట్రంగా ప్రకటించారు. ఉత్పత్తుల రేట్లు పడిపోయి, దుర్భిక్షం పాలబడి రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఈ సమస్యపై వెన్వెంటనే దృష్టిసారించాల్సి ఉంది. కమతాల పరిమాణం కోసుకుపోవడం, వాణిజ్య పంటలకు కేటాయించిన భూ విస్తీర్ణం, రుణాల తీవ్రత వంటి వాటికీ అన్నదాతల ఆత్మహత్యలకూ దగ్గరి సంబంధం ఉందన్న విషయం వివిధ అధ్యయనాల్లో వెల్లడవుతోంది. నేపథ్యాన్ని గమనిస్తే బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాల్లో వైద్య ఖర్చులు విపరీతంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. మరోవంక అవసరానికి అన్నదాతలకు వెంటనే రుణాలిచ్చే వ్యవస్థలు తెరవెనక్కి వెళ్ళాయి. పరోక్ష రుణ వ్యవస్థలు విస్తరించడంతో అందుబాటులో డబ్బుల్లేక రైతులు విలవిల్లాడే పరిస్థితి తలెత్తింది. సాగునీటి అభివృద్ధి, వ్యవస్థాగత రుణాల అందుబాటు పెంచడం, పంటలకు లాభదాయక ధరలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి వంటి సంస్కరణలను వీలైనంత సత్వరం క్షేత్రస్థాయిలో అమలుపరిస్తే రైతాంగం సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుంది. దీర్ఘకాలిక దృష్టితో నిర్మాణాత్మకంగా ముందుకు కదలడమే ఇప్పుడు కీలకం. బీడు, వర్షాధార భూముల్లో సేద్యం చేసుకుంటున్న రైతులకోసం ప్రత్యేక విధానాలు రూపొందించాలి.

అన్నదాతకు సామాజిక రక్షణ ఛత్రం ఏర్పాటు చేయడంతోపాటు- దుర్భిక్ష నివారణ, పంటల బీమా, విపత్తు నిర్వహణ విధానాలు పటిష్ఠంగా రూపొందించి అమలు చేయాలి. కరవు బారినుంచీ అన్నదాతను తక్షణం కాపాడటంతోపాటు- దేశ వ్యవసాయ రంగంలో వృద్ధిని, సుస్థిరతను సాధించడంకోసం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. అందుకోసం మరో హరిత విప్లవాన్ని ఆవిష్కరించాలి. ఏడో దశకంలో సాకారమైన హరిత విప్లవంతో పోలిస్తే కొత్తగా మోసులెత్తాల్సిన హరిత విప్లవం ప్రపంచీకరణ, వాతావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధిపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మునుపటితో పోలిస్తే ప్రపంచం మారిపోయింది. పరస్పరాధారితంగా మారింది. అంతర్జాతీయంగా సేద్య రంగంపై ముఖ్యంగా దేశ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం కనబరచే మార్పులివి. జీవ సాంకేతిక, సమాచార సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో హరిత విప్లవం మరెన్నో అవకాశాలు ఆవిష్కరించనుంది. పంటల దిగుబడి, విస్తృతి పెరిగితే వ్యవసాయ పురోభివృద్ధి సాధ్యమవుతుంది.

పంట దిగుబడులను, రైతు ఆదాయాలను పెంచే క్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలది కీలక పాత్ర. ఉత్పత్తి వ్యయాలు అనూహ్యంగా పెరిగినందున కనీస మద్దతు ధర రైతులకు ప్రాణావసరంగా మారుతోంది. చాలా సందర్భాల్లో ఉత్పత్తి వ్యయానికీ, ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకూ మధ్య పెద్ద తేడా ఉండటం లేదు. ఉదాహణకు 2015-16లో క్వింటా బియ్యం పండించేందుకు అంచనా వ్యయం రూ.1324కాగా, ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1410 మాత్రమే. అంటే వరి రైతుకు మిగులు కేవలం ఏడుశాతం మాత్రమేనన్నమాట. ఇతర ఖరీఫ్‌, రబీ పంటలకూ మద్దతు ధరలు మరీ తక్కువగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మద్దతు ధరకంటే పంట ఉత్పత్తి ఖర్చులే అధికంగా ఉంటున్నాయి. అయితే గోధుమకు మాత్రం ఉత్పత్తి ఖర్చుకన్నా 31శాతం అధికంగా కనీస మద్దతు ధర లభిస్తోంది. పంజాబ్‌, హరియాణా ప్రాంతాలనుంచి వెల్లువెత్తిన ఒత్తిళ్ల కారణంగానే గోధుమ పంటకు కనీస మద్దతు ధరను ఇబ్బడిముబ్బడిగా పెంచారా అన్నదానికి సమాధానం రావలసి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తృణ ధాన్యాలకు, పప్పు ధాన్యాలకు, నూనె గింజలు, కూరగాయలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏది కొనాలన్నా సామాన్యుడు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. మరోవైపు గిట్టుబాటు ధర దక్కక రైతు బిక్కమోహం వేస్తున్నాడు. మరి లాభం ఎవరు తింటున్నట్లు? దళారీ వ్యవస్థను పక్కకు నెట్టి రైతులకు నేరుగా లాభాలు అందే వ్యవస్థలు ఏర్పాటు చేస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు.

మార్కెట్‌ పరిస్థితులను మెరుగుపరచి, వ్యవసాయ ఎగుమతులకు అనుకూలమైన వాతావరణం సృష్టించాల్సి ఉంది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కొరత; భూమి, నీటి నిర్వహణలో లోటుపాట్లు; పరిశోధన- సాంకేతిక విస్తరణలో వెనకబాటు; మార్కెట్లో ఒడుదొడుకులు; రైతన్నలను కష్టకాలంలో ఆదుకునే రుణ సదుపాయాలు అంతంతమాత్రంగా ఉండటం; పంటల విస్తరణపై కనీస దృష్టి లేకపోవడం వంటివి దేశంలో వ్యవసాయాన్ని కుంగదీస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంతోపాటు- వ్యవసాయాభివృద్ధిపై ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు ఇనుమడింపజేయాలి. పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం పన్నుల్లో రాష్ట్రాల వాటా 32శాతంనుంచి 42శాతానికి పెంచినందున రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) వంటి కార్యక్రమాలను స్థానికంగా సర్కార్లే చూసుకోవాలంటూ కేంద్రం వాటికి నిధులు పెంచడం లేదు. కానీ ఇప్పటికిప్పుడు పెట్టుబడులు ఆ స్థాయిలో కుమ్మరించాలంటే రాష్ట్రాలకు కుదిరే పరిస్థితి లేదు. కాబట్టి వ్యవసాయ పథకాలపై పెట్టుబడులు పెంచేందుకు వాటికి మరికొంత సమయం ఇవ్వక తప్పదు. ఈ క్రమంలో దేశంలో సేద్యరంగం ఇబ్బందుల్లో కూరుకుపోకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. సాంకేతిక విజ్ఞాన రంగంలో కొత్త పుంతలు తొక్కడంవల్లే ఆరు, ఏడో దశకాల్లో దేశంలో హరిత విప్లవం సాధ్యమైంది. జీవ, సాంకేతిక, సమాచార విజ్ఞానంలో చోటు చేసుకుంటున్న తాజా మార్పులను కచ్చితంగా ఉపయోగించుకోగలిగితే మరో హరిత విప్లవం సాధ్యమే!

మరో హరిత విప్లవం!
పంటల మార్పిడిపై గట్టి శ్రద్ధ పెట్టాలి. సంప్రదాయ పంటల స్థానే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పళ్లు, కూరగాయలు, పశువుల దాణా, చేపల పెంపకం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రపంచవ్యాప్త వినియోగం తీరుతెన్నులనుబట్టి పంటల సరళి మార్చుకోవాల్సి ఉంది. పంట దిగుబడులకు సంబంధించి వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలు తగ్గించడంతోపాటు- దేశవ్యాప్తంగా దిగుబడి పెంచడంపైనా దృష్టిపెట్టాలి. అందుకోసం నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. పంటను కోసిన తరవాత నిల్వ, రవాణా వంటి సౌకర్యాలు సరిగా లేకపోవడంతో దిగుబడులు పెరిగినా రైతన్న నష్టపోతున్నాడు. ఆధునిక సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే ఈ నష్టాలు తగ్గించడంతోపాటు ఉత్పత్తికీ అదనపు విలువ జోడించవచ్చు. సేద్యంలో సమ్మిళితాభివృద్ధి కోసం సన్న, చిన్నకారు రైతుల ఆదాయాలు పెంచడం అత్యంత కీలకం. గిట్టుబాటు కాక సేద్యాన్ని వదిలిపెట్టే దురవస్థనుంచి సన్న, చిన్నకారు రైతులను కాపాడేందుకు ప్రభుత్వాలు నిర్మాణాత్మక విధానాలతో కదలాలి. వ్యవసాయ దిగుబడులపరంగా వెనకబాటులో ఉన్న ప్రాంతాలపై మరీ ముఖ్యంగా బిహార్‌, ఒడిశా వంటి రాష్ట్రాలపై గట్టి శ్రద్ధ పెట్టాలి. సంక్షోభాలు తట్టుకుని, విపత్తులలోనూ నిలదొక్కుకొనే విధంగా సేద్యరంగాన్ని తీర్చిదిద్దడం ప్రస్తుత ప్రాధాన్యాంశం. మరోవంక దేశ ఆహార భద్రతకు, పేద ప్రజల జీవికకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండానే సాధ్యమైనంతవరకు పర్యావరణ అనుకూల, సేంద్రియ పద్ధతులను అనుసరించడం ఉత్తమం. సేద్య రంగంలో సుస్థిరాభివృద్ధికి నీటిని సమర్థంగా ఉపయోగించడంతోపాటు, భూసారాన్ని కాపాడుకోవడమూ కీలకం. దేశంలో అత్యధిక ప్రజానీకానికి ఆధారభూతమైన సేద్యాన్ని కాపాడుకోవాలంటే వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టాలి. సమగ్ర విధానాలను పట్టాలకెక్కించాలి. ఆ క్రమంలో కేంద్రంతోపాటు రాష్ట్రాలపైనా ఎనలేని బాధ్యత ఉంది.


(రచయిత- ఐజీఐడీఆర్‌, ముంబయి ఉపకులపతి)
Posted on 19-1-2016