Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

లాభాలు పండాలి వాన దేవుడా !

* గిట్టుబాటు సేద్యానికి మార్గాలివి...
దేశంలో ఈసారి మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం అందజేయడం భారత రైతాంగానికి తీపి కబురు. సాధారణ స్థాయికన్నా కొంత అధికంగా(109 శాతం) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ‘స్కైమెట్‌’ లాంటి సంస్థలూ చెబుతున్నాయి. రెండు వరస కరవులతో వ్యవసాయ ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. రైతుల ఆదాయాలూ దెబ్బతిన్నాయి. వస్తువుల గిరాకీ అడుగంటుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా వర్షాధారితమే. 18శాతం స్థూల దేశీయోత్పత్తి వ్యవసాయం ద్వారానే వస్తోంది. దేశంలో 75శాతం ఆహార ధాన్యాలు, నూనె గింజలు, ఖరీఫ్‌ సీజన్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు కురిసే నైరుతి రుతుపవనాల మీదే పంటల సాగు ఆధారపడి ఉంది. 75శాతం పంటల సాగుకు ఈ రుతుపవనాలే ఆధారం.

కష్టకాలంలో చల్లని కబురు
రెండు వరస కరవులు సంభవించడం దేశంలో ఇది నాలుగోసారి. ప్రభుత్వాలు ఎన్ని రకాల రాయితీలు ప్రకటించినప్పటికీ వరుణుడి కరుణ లేకపోతే బతుకు బండి అడుగైనా ముందుకుపడదు. అందుకే మంచివానల కోసం రైతులోకం ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. నదీ జలాలను నమ్ముకుని సేద్యానికి ఉపక్రమించే పరిస్థితి ప్రస్తుతం లేదు. దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యంలో 24శాతం మేర నీరే ఉందని కేంద్రీయ సాగునీటి కమిషన్‌ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నీటి మట్టాలు పది సంవత్సరాలనాటితో పోలిస్తే మూడోవంతైనా లేవు. కాబట్టి, అటు ప్రత్యక్షంగా పంటల సాగుకు, పరోక్షంగా రిజర్వాయర్లు, భూగర్భ జలాల మట్టాలు పెరగడానికి రుతుపవన వర్షాలే కీలకం.
దీర్ఘకాలిక సరాసరి ప్రకారం ఈ ఏడాది 109శాతం వర్షపాతం నమోదు అవుతుందని అంటున్నారు. దేశంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖరీఫ్‌ పంట సాగుకు ఇది కచ్చితంగా వూతమిచ్చేదే. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలలు కురిసే వర్షాలు ఖరీఫ్‌ పంటలకు, భూగర్భ జలాలు పెరగడం ద్వారా రబీ పంటలకు ఉపయోగపడతాయి. ఇప్పటికే రెండేళ్లపాటు దేశాన్ని కరవుకు గురిచేసిన ఎల్‌ నినో ప్రభావం తగ్గిపోతోందని అధ్యయనాలు చాటుతున్నాయి. పసిఫిక్‌ మహాసముద్రంలోని జలాలు వేడెక్కడం, చల్లారడంతో ముడివడిన అంశాలు రెండు ఉన్నాయి. అవి ఎల్‌ నినో, లా నినా. సముద్రజలాలు వేడెక్కితే ముఖ్యంగా ఆసియా ఖండంలో(భారత్‌ సహా) వర్షపాతలేమి ఉంటుంది. దీనినే ఎల్‌ నినో ప్రభావం అంటారు. అవి చల్లారితే వర్షాలు అధికంగా పడతాయి. దీనినే ‘లా నినా’ ప్రభావం అంటారు.
1900 నుంచి ఇప్పటివరకు 26 ఎల్‌ నినోలు సంభవించాయి. అతివృష్టి, అనావృష్టి లేని సంవత్సరాలు 50. లా నినా పరిస్థితులు 46సార్లు ఏర్పడ్డాయి. రెండుసార్లు మాత్రమే వరసగా ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. 1950 నుంచి చూస్తే- 1986 ఆగస్టు నుంచి 1988 మార్చి మధ్య దీర్ఘకాలిక ఎల్‌ నినో కొనసాగింది. ప్రస్తుత ఎల్‌ నినో కూడా పెద్దదే. 2015 ఫిబ్రవరిలో మొదలై ఇప్పటివరకు కొనసాగింది. అంటే 15 నెలల కాలమన్నమాట. ఆస్ట్రేలియా వాతావరణ విభాగం అంచనాల ప్రకారం... ఎల్‌ నినో, లా నినా పరిస్థితులు ఒకదాని తరవాత మరొకటి సంభవించాలి. అలాగే జరుగుతోంది. ఎల్‌ నినో మాదిరిగానే లా నినా పరిస్థితులు తొమ్మిది నెలల నుంచి 12 నెలల వరకే ఉంటాయి. కానీ, 2010 నుంచి 2012 వరకు రెండేళ్లపాటు దేశంలో లా నినా ఏర్పడినట్లు అమెరికాకు చెందిన జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన విభాగం పేర్కొంది. మూడో సంవత్సరం మాత్రం ఎల్‌ నినో ప్రభావం కచ్చితంగా ఉండదు. 2016 రెండోభాగంలో అంటే, జూన్‌ తరవాత ఎల్‌ నినో బలహీనపడుతుంది. లా నినా బలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది అధిక వర్షాలు పడతాయని వివిధ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. వర్షజలాలను ఏ విధంగా వాడుకోవాలన్నదానిపై దృష్టి సారించాల్సి ఉందిప్పుడు!
తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న మిషన్‌ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ- వర్షపు నీటిని మళ్లించడానికి మేలైన మార్గం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం యుద్ధప్రాతిపదికన పొలాల్లో ఇంకుడు గుంతల తవ్వకానికి ప్రోత్సాహమివ్వడం ఆహ్వానించదగ్గదే. ఏ మాత్రం అవకాశం ఉన్నా, రెండు రాష్ట్రాలు ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో బిందు, తుంపర సేద్యాలను తప్పనిసరి చెయ్యాలి. చెరకు పంటకు కర్ణాటక, మహారాష్ట్రల మాదిరిగా డ్రిప్‌ ఉంటేనే సాగుకు అనుమతివ్వాలి. అన్ని పండ్ల తోటలు, కూరగాయలకు సూక్ష్మసేద్య పద్ధతులను విధిగా పాటించేలా చూడాలి. వరి పంటకు తప్ప అన్ని పంటల సాగులో బిందు, తుంపర నీటి సేద్యాన్ని సులభంగా ఆచరించవచ్చు.

పొలాలకు జలరక్ష
వాన నీటిలో కేవలం 15శాతమే పంటలకు వాడుకుంటున్నాం. మిగతాది వృథాగా పోతోంది. చెరువులు, కుంటలు, పొలంలో కందకాలు, గుంతలు తవ్వడం ద్వారా వర్షపు నీటిని సేకరించి, పంటలకు వాడుకోవచ్చు. ఒక్కోసారి వర్షపాతం అయిదు సెంటీమీటర్ల వరకు రెండు, మూడు రోజులపాటు నమోదవుతుంది. పంటలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేవు. పొలాల్లో నీటిగుంతలు తవ్వడం ద్వారా అధిక వర్షపు నీటిని ఎక్కడికక్కడే నిల్వ చేసుకోవచ్చు. దానివల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షాల మధ్య వచ్చే విరామ కాలాల నుంచి పంటలను కాపాడుకునేందుకు అది ‘జీవ జలం’గా ఉపయోగపడుతుంది. ఇంకుడు గుంతల్లో నీటిని నిల్వ చేసి వాడుకోవడం వల్ల పంటల ఉత్పాదకతలో 12శాతం మెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా అన్ని వర్షాధార ప్రాంతాల్లో ఈ పద్ధతి అవలంబిస్తే, రెండు నుంచి రెండున్నర కోట్ల టన్నుల అదనపు ఉత్పత్తి సాధ్యం. అందుకోసం అయిదు కోట్ల నీటి గుంతలు తవ్వాల్సి ఉంటుంది. ఒక నీటిగుంత తవ్వి, దాని ద్వారా నీరు పొందడానికి రూ.25వేలు ఖర్చయితే, అదే మొత్తంలో నీటిని ప్రాజెక్టులు కట్టి కాలువల ద్వారా అందించడానికి లక్షా 25వేల రూపాయలు అవసరం. నీటి గుంతలను రైతులు సులభంగా తవ్వుకోవచ్చు.
ఖరీఫ్‌లో పంటల ఎంపిక కీలకం. ముఖ్యంగా తగ్గుతున్న అపరాల పంట, అశాస్త్రీయంగా పెరిగిపోతున్న పత్తి సాగు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగు అడ్డగోలుగా సాగుతోంది. తెలంగాణలో సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 42లక్షల హెక్టార్లు. అందులో 16.89లక్షల హెక్టార్లలో రైతులు పత్తిని సాగుచేశారు. తెలంగాణలో వర్షపాతం సాధారణం కన్నా 2014లో 36శాతం, 2015లో 24 శాతం తగ్గింది. పత్తి సాగు మాత్రం 13వేల హెక్టార్ల మేర పెరిగింది. అదే సమయంలో దాని ఉత్పాదకత బాగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి. ఏపీలో పత్తి సాగు విస్తీర్ణం 5.84లక్షల హెక్టార్లు. 2014లో వర్షాభావ పరిస్థితులున్నప్పటికీ 8.32లక్షల హెక్టార్లలో, 2015లో 6.62లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ప్రపంచ పత్తి ఉత్పాదకత హెక్టారుకు 905 కిలోలు. అది దేశంలో 537 కిలోలు, తెలంగాణలో 515 కిలోలు. ఆంధ్రప్రదేశ్‌లో 624 కిలోలు. అపరాలు, నూనె గింజల పంటలతో పోలిస్తే పత్తికి ఎక్కువ నీరు అవసరం. ఒక క్వింటా పత్తి ఉత్పత్తికి దాదాపు రూ.6,000 ఖర్చవుతుంది. కేంద్రం రూ.3,800 మాత్రమే మద్దతు ధరగా ఇస్తోంది. అంటే నికరంగా ఒక క్వింటాకు రైతు రూ.2,200 నష్టపోతున్నాడు. దేశంలో మొదట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే పత్తి వస్తుంది. తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది తక్కువ ధర పలుకుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో వస్త్ర పరిశ్రమలు తక్కువ కాబట్టి, రవాణా ఖర్చులు తీసేసి, తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారు. నైరోబీ సదస్సులో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలపై సంతకం చేసిన భారత్‌, 2017 జనవరి నుంచి పత్తి ఎగుమతి ప్రోత్సాహకాలు ఎత్తివేయనుంది. వస్త్ర పరిశ్రమకు రుణాలపై కేంద్రం ఇస్తున్న మూడు శాతం రాయితీకీ కాలం చెల్లనుంది. దాంతో వస్త్ర పరిశ్రమలు పత్తి కొనుగోళ్లు తగ్గిస్తాయి. డబ్ల్యూటీఓ నిబంధనల కారణంగా భారతదేశంలోకి పలు దేశాల నుంచి పత్తి దిగుమతులు వెల్లువెత్తుతాయి. పెరిగే సరఫరాతో దేశీయంగా ధరలు పడిపోతాయి. కాబట్టి, మేలైన ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికలు రచించాలి.

పంటల వ్యూహం ప్రధానం
ఎర్రనేలల్లో వర్షాధారంగా అపరాల సాగును విజయవంతంగా చేపట్టవచ్చు. మినుము, పెసర్లు, సోయాబీన్‌ మూడు నెలల కాలంలోనే కోతకు వస్తాయి. వీటికి నీటిఎద్దడి భయం తక్కువ. పత్తి సాగు చేయడానికి 650 మి.మీ. నుంచి 850 మి.మీ. నీరు అవసరం. అపరాలకు కేవలం 200 మి.మీ. నుంచి 400 మి.మీ. నీరు సరిపోతుంది. ఒక ఎకరంలో పత్తి సాగుకు వాడే నీటితో మూడు ఎకరాల్లో అపరాలు సాగు చేసుకోవచ్చు. వీటి దిగుబడీ బాగానే ఉంటుంది. పెసర్లకు క్వింటాకు రూ.4,850, మినుములకు క్వింటాకు రూ.4,625 మద్దతు ధరతో పాటు కేంద్రం బోనస్‌ కూడా ప్రకటించింది. అపరాల సాగుతో నేలలకు నత్రజని పోషకాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో వర్షాధారంగా దీన్ని సాగు చేసుకోవచ్చు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మినుము, పెసర; నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సోయాబీన్‌ సాగు చేసుకోవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. వారి పెట్టుబడి సామర్థ్యం తక్కువ. ఇప్పటికే రెండు సంవత్సరాలు పంటలు కోల్పోయి రైతులు పీకల్లోతు అప్పుల్లో మునిగారు. కాబట్టి వచ్చే కాలంలో నష్టపరచే పంటలకు దూరంగా ఉండేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పించాలి. పెట్టుబడి ఖర్చులు తగ్గించే తరుణోపాయాలు తెలియజెప్పాలి. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం గాడిన పడేది!

- డాక్టర్ పిడిగెం సైద‌య్య
(రచయిత- శాస్త్రవేత్త, ఉద్యాన విశ్వవిద్యాలయం)
Posted on 26-05-2016