Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

సాగు బాగుకు ‘అంకురం’

* ప్రోత్సాహం అత్యవసరం
భారతదేశంలో సగం జనాభా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలైన కూరగాయలు, పండ్లు, చేపలు, రొయ్యలు తదితర రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామాల్లో నేటికి 58శాతం కుటుంబాలకు ఇవే జీవనాధారం. కేంద్ర గణాంక సంస్థ లెక్కల ప్రకారం దేశ స్థూల విలువ(జీవీఏ)లో 15శాతం వాటా ఈ రంగానిదే. ఇంతటి ప్రాధాన్యతగల వ్యవసాయ రంగానికి సమాచార, సాంకేతిక రంగం వెన్నుదన్నుగా నిలిస్తే అది కూడా ఒక పరిశ్రమగా రూపాంతరం చెందుతుందన్నది నిర్వివాదం. అప్పుడు రైతులు నచ్చిన ధరకు తమ పంటలను అంతర్జాతీయ విపణిలో అమ్ముకునే అవకాశం కలుగుతుంది. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుర్గతి నుంచి అన్నదాతలు బయటపడతారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడాలంటే వ్యవసాయ రంగంలో నూతన అంకుర సంస్థల ఏర్పాటును ప్రభుత్వం యథాశక్తి ప్రోత్సహించాలి.

తీరు మారాల్సిన సమయం
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా దారిద్య్రాన్ని నిర్మూలించవచ్చనే ఆలోచనతోనే ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి. దాన్ని ఒక పరిశ్రమగా, ఉత్పాదక శక్తిగా, ఉపాధికల్పనకు అవకాశం గల రంగంగా పాలకులు నేటికీ గుర్తించకపోవడం బాధాకరం. 1950 దశకంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా 51శాతం పైమాటే. ఇప్పుడది 13శాతానికి దిగజారిపోయింది. వ్యవసాయ రంగానికి శాస్త్ర సాంకేతిక రంగాలు అందిస్తున్న సహకారం నామమాత్రం. ఇప్పటికైనా వ్యవసాయ రంగంలో అంకుర పరిశ్రమలు పాదుకునేలా చేయడం దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుంది. పాలకులు తక్షణం దృష్టిసారించాల్సిన అంశమిది!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహంతో నిరుడు దేశవ్యాప్తంగా మూడువేల పైచిలుకు అంకుర సంస్థలు ఉద్భవించాయి. అంకుర సంస్థలను అత్యధికంగా ప్రోత్సహించే దేశాలైన అమెరికా, యూకే, ఇజ్రాయెల్‌ వంటి దేశాల సరసన భారత్‌ స్థానం దక్కించుకుంది. ఇదే దూకుడు కొనసాగిస్తే అంకుర సంస్థల వల్ల ఏటా రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దురదృష్టవశాత్తు ఈ వేగం తిరోగమిస్తోంది. ఈ ఏడాది కొత్త అంకుర సంస్థల్లో పెట్టుబడులు గణనీయంగా తగ్గడమే అందుకు దాఖలా. వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థల్లో పెట్టుబడులు సగానికి సగం కోసుకుపోయాయి. దేశ అంకుర సంస్థల్లో అత్యధికంగా 33శాతం వాటా ఈ-కామర్సు విభాగానిదే. వ్యవసాయ ఆధారిత సంస్థలు కేవలం 11శాతం వాటా కలిగి ఉన్నాయి. 2014లో ఈ సంస్థల్లో 12.30కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. 2015నాటికి అవి 5.60కోట్ల డాలర్లకు దిగజారాయి. 2015లో కరవు తీవ్రంగా వేధించినా కేవలం 20 వ్యవసాయ అంకుర సంస్థలు మాత్రమే 60లక్షల డాలర్లను పెట్టుబడి పెట్టాయి.
గిరాకీ-సరఫరాల మధ్య వ్యత్యాసం వల్ల ఏటా ఆహార కొరత ఏడు శాతం చొప్పున పెరుగుతోంది. కరవు, ఆహార కొరతలను ఎదుర్కోవడానికి కొత్తరకం వంగడాలు, నీటి ఆదా, సేద్య, శుద్ధి పద్ధతులను ఆవిష్కరించారు. కానీ, వీటి పట్ల రైతాంగానికి అవగాహన కల్పించడంలో ఐటీ రంగం వెనకబడింది. చిన్నతరహా రైతులు కొత్త సాంకేతిక విధానాలను అందిపుచ్చుకోవడానికి విముఖత చూపుతున్నారు. ఈ రంగంలో రూ.70వేల మేర వ్యాపారావకాశాలు ఉన్నప్పటికీ, ముందడుగు వేస్తోంది అతి కొద్దిమందే. సౌరశక్తితో పనిచేసే చిన్నతరహా శీతల గిడ్డంగుల నిర్మాణానికి ‘స్టెల్‌ ఆప్స్‌’అనే సంస్థ ముందుంది. నేటికీ సరైన రవాణా, నిల్వ సదుపాయాలు లేక రెండు వందల కోట్ల డాలర్ల విలువైన కూరగాయలు, పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను వ్యర్థ పదార్థాలుగా కోల్పోవటం జరుగుతోంది.
అమెరికాకు చెందిన థామస్‌ హైలాండ్‌, జార్జి సోరస్‌లు స్థాపించిన ‘సాంగ్‌’ అనే సంస్థ దేశంలోని చిన్న, మధ్యతరహా వ్యవసాయ అనుబంధ అంకుర సంస్థలకు విస్తృతంగా పెట్టుబడులు సమకూరుస్తోంది. ఇదే తరహాలో వివిధ సంస్థలు ముందుగా అంకుర పరిశ్రమలతో కలిసి కొన్ని నెలలు కలిసి పనిచేసి, వాటి పనితీరు నచ్చితే పెట్టుబడులు పెడుతున్నాయి. ఎస్కార్ట్స్‌ (ట్రాక్టర్ల తయారీ) అనుబంధ సంస్థ ‘ఈఎమ్‌3’ వ్యవసాయ పనిముట్లను రైతులకు తక్కువ ధరలకు అద్దెకిచ్చే అంకుర సంస్థగా ఎదుగుతోంది. దేశంలోని 10శాతం రైతులు మాత్రమే సొంత వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసుకోగలుగుతున్నారు. మిగిలిన 90శాతం వాటిని అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ‘ఈఎమ్‌3’ తమ కార్యకలాపాలు సాగిస్తూ 95శాతం రైతులకు సహాయపడుతోంది. వాతావరణాన్ని విశ్లేషించి రైతుకు తగిన సూచనలు ఇవ్వడం, విపణి ధరలను ఎప్పటికప్పుడు తెలియజేయడం వంటి సేవలతో ‘స్కైమెట్‌’ ముందుంది. సాంగ్‌, ఒమ్నివ్‌ర్‌, విల్‌గ్రో, ఆప్పడా వంటి సంస్థలు వ్యవసాయ అంకుర పరిశ్రమలను ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నా, అది ఒక శాతానికి మించడం లేదు. అంకుర సంస్థలు ఈ రంగం వైపు మళ్లడానికి టాటా, రిలయన్స్‌, విప్రో వంటి సంస్థలు కృషి చేయాలి. కానీ అలా జరగడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం, కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ తక్కువ. అందువల్ల ఈ రంగానికి నిధులు అరకొరగా వస్తున్నాయి. టెలికం, ఈ-కామర్స్‌, వినోదం వంటి రంగాలకున్న ఆకర్షణ శక్తి ఈ రంగానికి లేదు. పెట్టుబడులు తిరిగివస్తాయన్న నమ్మకం ఉండదు. భూసార పరీక్షల దగ్గరనుంచి రవాణా, నిల్వ సదుపాయాలవంటి వివిధ రకాల అంశాలు ఇమిడి ఉండటంతో, క్లిష్టమైన రంగంగా ఇది అవతరించింది. దీంతో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ రంగం పనికాలం పరిమితం. వర్షాభావ పరిస్థితులు వేధిస్తుంటాయి. సంప్రదాయ వ్యవసాయ విధానాలనే రైతులు ఆచరిస్తుండటం మరో లోపం. కొత్త పద్ధతులను అందిపుచ్చుకోవడంలో అనాసక్తి సేద్యరంగంపాలిట శాపమవుతోంది. వారికి అవగాహన పెంచడంలో ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయి. ఫలితంగా వ్యవసాయ రంగానికి యువత దూరంగా ఉంటోంది. వ్యవసాయ రంగంలో అంకుర సంస్థలు రాకపోవడానికి, వచ్చినవి పుంజుకొనకపోవడానికి ఈ పరిణామాలు కారణమవుతున్నాయి.

వ్యవసాయం దిశగా యువత
వ్యవసాయ రంగంలో అంకుర సంస్థలు ఇంకా మొగ్గదశలోనే ఉన్నాయి. ఇవి పూర్తి పనితీరు కనబరచాలి. రైతులకు వెన్నుదన్నుగా నిలవాలి. అందుకోసం వీటిలో పెట్టుబడులు పెట్టడానికి బడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. గ్రామీణ వాతావరణంలో పనిచేసేందుకు యువత ముందుకురావాలి. స్వలాభం కొంత మానుకుని ఈ సంస్థల్లో పనిచేయడానికి వారు ఉత్సాహం చూపాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక వేత్తలు ఈ సంస్థలకు పూర్తి సహకారం అందించాలి. నాబార్డ్‌, డీఎస్‌టీ, సీఎస్‌ఆర్‌ఐ వంటి ప్రభుత్వ సంస్థలు, ఇంజినీరింగ్‌ సంస్థలు తమవంతు సాయం వీటికి అందజేయాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఇక్రిశాట్‌ సహాయంతో ఇన్‌క్యుబేషన్‌ కేంద్రాలను ప్రోత్సహించడం, ఎన్‌ఆర్‌సీ, ఇకార్‌ వంటి సంస్థలు తమ పరిశోధనా ఫలితాలను అందించడం వంటి చర్యలు వీటి పనితనాన్ని ఇంకా మెరుగుపరుస్తాయి.
సామాజికవేత్తలు, శాస్త్రవేత్తలు తీసుకురాలేని పెనుమార్పులను అంకుర సంస్థలు వ్యవసాయ రంగంలో అనతి కాలంలో తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రోత్సహిస్తూ మరింత వేగంగా ముందుకెళ్లడానికి తోడ్పడితే వ్యవసాయ రంగం అనతికాలంలోనే పారిశ్రామిక రంగంగా మార్పు చెందుతుంది. ప్రతి రైతు తను పండించే పంట, తనకు నచ్చిన ధరకు అంతర్జాతీయ విపణిలో అమ్ముకొనే స్వేచ్ఛ లభిస్తుంది. దళారీ వ్యవస్థ నశించి రైతుకే నేరుగా లబ్ధి చేకూరుతుంది. అప్పుడు రైతు ఆత్మహత్యలు లేని వ్యవసాయ భారతం సమీప భవిష్యత్తులోనే ఆవిష్కృతమవుతుంది.

- డాక్ట‌ర్ ఈద‌ర శ్రీనివాస‌రెడ్డి
(డీన్‌, ఆచార్య నాగ‌ర్జున విశ్వ‌విద్యాల‌యం)
Posted on 22-06-2016