Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

కాసులు కళ్లజూసే ఆశలేవీ?

* వ్యయానికి తగ్గ సాయంలేని వ్యవసాయం
రైతుల ఆదాయాలు 2022నాటికి రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం, అందుకు విధివిధానాలు సూచించాలని కోరుతూ అశోక్‌ దల్వాయి సారథ్యంలో ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఇదివరకే ఏర్పాటు చేసింది. కానీ, తగ్గుతున్న రైతుల లాభాలు, మందగిస్తున్న వ్యవసాయ వృద్ధిరేటు నేపథ్యంలో ఆదాయ భద్రత సాధించడం అంత సులువుగా కనిపించడం లేదు. ఆ దిశగా అడుగులు పడటం మాత్రం శుభసూచకం. ఈ బృహత్తర లక్ష్యాన్ని చేరుకొనే దిశలో అవరోధాలు అనేకం. మొదటి అవరోధం పంటల ఉత్పాదకత పెంచేందుకు అనువైన పరిశోధనపరమైన మద్దతు లేకపోవడం! మొదటి హరిత విప్లవం సాధించడంలో జాతీయ వ్యవసాయ పరిశోధన వ్యవస్థ పాత్ర చాలా ఉంది. అయినా, కొన్ని దశకాలుగా పరిశోధనల్లో ఆశించిన మేర మెరుగుదల లేదు. ఆర్థిక వనరులు అంతంతమాత్రంగానే కేటాయిస్తున్నారు. ఆసియా ఖండంలో వ్యవసాయ పరిశోధన-అభివృద్ధికి వివిధ దేశాలు కేటాయిస్తున్న నిధులు పరిశీలిస్తే మన స్థాయి అర్థమవుతుంది. వ్యవసాయ జీడీపీలో పరిశోధనకు భారత్‌ 31 శాతం నిధులు కేటాయించగా, చైనా రెండింతలు వెచ్చిస్తోంది. బంగ్లాదేశ్‌ లాంటి చిన్న దేశాలు సైతం 38 శాతం వ్యవసాయ జీడీపీ నిధులు పరిశోధనలకు కేటాయిస్తున్నాయి. ఇక రెండో అవరోధం ఉత్పాదకతలోనే మెరుగుదల కనిపించకపోవడం. 2014 గణాంకాలు చూస్తే, దాదాపు అన్ని పంటల్లో భారత్‌లో సరాసరి ఉత్పాదకత చైనా కంటే చాలా తక్కువ. తక్కువ ఆదాయం ఉన్న పలు చిన్న దేశాల కంటే కూడా తక్కువే. చైనాతో పోలిస్తే హెక్టారుకు దాదాపు 39 శాతం కంటే తక్కువ సరాసరి ఉత్పాదకత నమోదైంది. వరిలో అయితే 46 శాతం కంటే తక్కువే. ఇండొనేసియా, బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాల్లోనూ భారత్‌ కంటే ఉత్పాదకత ఎక్కువ. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రస్తుతం విస్తృతంగా సాగు చేస్తున్న వరి పంటకు బదులుగా ఇతర తృణ ధాన్యాలు, పప్పు దినుసుల పంటలకు మారాలి. పంటల ఉత్పత్తి కారకాలకు వరి, గోధుమ అంతగా స్పందించవు. భూగర్భ జలమట్టాలను అధికంగా వాడుకొంటాయి. పర్యావరణ మార్పులకు ప్రధాన కారణమైన హరితగృహ వాయువులను విడుదల చేస్తాయి. అందువల్ల మిగతా పంటల సాగుకు అనువైన విధాన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. ఇతర పంటలను ప్రోత్సహించడానికి వీలుగా, వాటి మద్దతు ధరలు గణనీయంగా పెంచాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉదాహరణకు హరియాణాలో స్థానిక రకాలు, ఔషధ రకాల వడ్ల మిల్లింగు కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పలు రకాల సాగు వూపందుకుంది. రైతులకు లాభాల్లో మెరుగుదల కనిపించింది. పరిశోధన, గిట్టుబాటు ధరలు, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందించడం ద్వారా రైతులను ఇతర పంటలకు మళ్లించాలి.

భారమవుతున్న సాగునీటి వ్యయం
వ్యవసాయానికి ప్రధాన వనరులైన సాగునీరు, సాగుభూమి కొరత మూడో ప్రతికూల అంశం. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గిపోతోంది. ఇతర వ్యవసాయ ప్రధాన దేశాలతో పోలిస్తే భారత్‌లో తలసరి సరాసరి కమతం విస్తీర్ణం చాలా తక్కువ. దీనికితోడు ఉత్పత్తుల ఎగుమతి రూపంలో భూముల సారాన్ని, అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటినీ కోల్పోతున్నాం. నిరుడు భారత్‌ నుంచి ఎగుమతైన ఆహార ఉత్పత్తుల్లో వాడిన నీరు 25 క్యూబిక్‌ కిలోమీటర్లు. అంటే ఒక ఏడాదిలో దేశంలో అందుబాటులో ఉన్న నీటిలో ఒక శాతం. ఇది తిరిగి పొందరానిది. ఈ మేరకు నీటిని పొందడానికి అయ్యే ఖర్చు ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం కంటే ఎక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం సాగు విస్తీర్ణంలో 34 శాతానికే సాగునీటి సౌకర్యం ఉంది. పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 50 శాతం పైగా నికర సాగునీటి విస్తీర్ణం ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 50 శాతం కంటే తక్కువే. సాగునీరు దేశమంతటా అన్ని రాష్ట్రాలకు అంది వస్తేనే పంటల ఉత్పాదకత పెరిగేది.

పంట ఖర్చులు పెరగడానికి ప్రధాన కారణం- కూలీ ఖర్చులు పెరగడం. వలసలు పెరగడంవల్ల కూలీల కొరత, కూలీలు రెండూ పెరుగుతున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సకాలంలో వ్యవసాయ పనులు జరగడంతోపాటు వ్యర్థాలూ తగ్గించవచ్చు. ఇప్పటివరకు దాదాపు అన్ని పంటల్లో యాంత్రీకరణ 50 శాతం మించి పెరగడం లేదు. మన్నిక కలిగి, తోడటానికి సులభంగా ఉండి, తక్కువ ఖర్చుతో కూడిన పనిముట్లు, యంత్రాలు అందుబాటులోకి వస్తే పంటల ఉత్పాదకత పెరుగుతుంది. సూక్ష్మ పోషక ఎరువుల వాడకంతో ఉత్పాదకత పెంచేందుకు మరో అవకాశం ఉంది. దేశంలోని భూముల్లో సూక్ష్మధాతు పోషకాలైన బొరాన్‌, జింకు, కాపర్‌, ఇనుము ఎక్కువ మొత్తంలో లోపించిన ఫలితంగా పంటల దిగుబడులు, ఉత్పాదకత తగ్గిపోతున్నాయి. ‘భారత వ్యవసాయ పరిశోధన సంస్థ’ ప్రకారం సూక్ష్మధాతు పోషకాల వాడకంతో అన్ని పంటల్లో హెక్టారుకు మూడు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి పెరగనుంది. కాబట్టి సూక్ష్మ పోషకాల వాడకాన్ని భారీగా ప్రోత్సహించాలి. వాటిని సేంద్రియ ఎరువుల రూపంలో వాడితే లాభాలు ద్విగుణీకృతమవుతాయి. చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ సాగును సులభంగానూ ఆచరించవచ్చు. దేశంలోని 67 శాతం నేలలు తక్కువ కర్బనం కలిగి ఉన్న నేపథ్యంలో సేంద్రియ ఎరువుల వాడకం మేలైన ప్రత్యామ్నాయం అవుతుంది. ‘భారత వ్యవసాయం- హరిత విప్లవం వంటి తన పాత విజయాల బాధితురాలు’ అన్న 2015-16 ఆర్థిక సర్వే, ప్రస్తుత దేశ వ్యవసాయ పరిస్థితిని కళ్లముందు ఉంచింది. అధిక దిగుబడినిచ్చే రకాల విత్తనాలు, ఎరువులతో భూముల ఉత్పాదకత పెరిగింది. అయితే భూగర్భ జల మట్టాలు అడుగంటాయి. హరితగృహ వాయువులు, ఉద్గారాలు పెరిగాయి. ఉపరితల, భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల మందగించింది. వ్యవసాయం సంక్షోభంలోకి జారుకొంది. రైతుల ఆదాయాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా నేడు వ్యవసాయం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఇలాంటప్పుడు సునాయాసం కాదు. 2022 నాటికి లక్ష్యం చేరాలంటే రైతుల ఆదాయంలో 12 శాతం వృద్ధి కనిపించాలి. కానీ 2003 నుంచి 2013 వరకు భారత రైతు ఆదాయంలో వృద్ధిరేటు సరాసరిన అయిదు శాతం మించలేదు. రెండు కరవు పరిస్థితుల్లో చోటుచేసుకున్న వృద్ధిరేటు ఒక్క శాతంకన్నా తక్కువే.

సంస్కరణలే సమాధానం
రైతు నికరంగా పొందుతున్న ఆదాయం 2013 నాటికి రూ.3,844 మాత్రమేనని జాతీయ నమూనా సర్వే తెలిపింది. ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలు మరో నాలుగు ఉన్నాయి. మొదటిది పెరుగుతున్న ఉత్పత్తి కారకాల ధరలు. ఆ సర్వే ప్రకారం పదేళ్లలో వ్యవసాయం నుంచి రైతుకు ఆదాయం 3.6 రెట్లు పెరిగింది. ఉత్పత్తి కారకాల ధరలూ మూడింతలయ్యాయి, నికర ఆదాయం లేదు. మద్దతు ధరలు చూస్తే, అవి 1965 నుంచి అమలు అవుతున్నాయి కానీ, 25 శాతం కంటే తక్కువమంది రైతులకే వీటిపై అవగాహన ఉంది. మూడేళ్లలో సాలీనా అన్ని పంటలకు సరాసరిన మద్దతు ధర పెరుగుదల 12 శాతం మించలేదు. ప్రకటించిన మద్దతు ధరల్లో 10 నుంచి 30 శాతం మించి ధరలు ప్రస్తుత మార్కెట్‌ వ్యవస్థలో రైతుకు అందడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్‌ తెలిపింది. గ్రామీణ పేదరికాన్ని తగ్గించడంలో సమర్థవంతమైన వ్యవసాయ మార్కెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది. కానీ వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్‌ కమిటీలో ప్రస్తుతమున్న పలు పన్నుల కారణంగా రైతుకు మార్కెటింగ్‌ వ్యవస్థ సమర్థవంతంగా ఉపయోగపడటంలేదు. చైనా 1978లో వ్యవసాయ సంస్కరణలు మొదలుపెట్టి కేవలం ఆరు సంవత్సరాల్లోనే వ్యవసాయంలో రైతులు, రైతు కూలీల పేదరికాన్ని సగానికి తగ్గించగలిగింది. ఆ తరహా వ్యవసాయ సంస్కరణలు అవసరమిప్పుడు.
17 రాష్ట్రాల్లో మధ్యస్థాయి రైతు సాలీనా ఆదాయం రూ.20 వేలు మించడం లేదని ఆర్థిక సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయాలు పెరగాలంటే రెండు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలి. రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలి. సుస్థిర వ్యవసాయ సాగు పద్ధతులు అవలంబించాలి. పంటల ఉత్పాదకతను పెంచుకోగలగాలి. నీరు, నేలల ఉత్పాదకత సామర్థాన్ని పెంచాలి. ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీలు పెంచడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తి కారకాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. రైతుల ఆదాయ మార్గాలను పెంపొందించే పథకాలకు రూపకల్పన చేయాలి. అప్పుడే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు రైతుకూ ఆదాయ భద్రత సాధ్యమవుతుంది.

Posted on 26-08-2016